ఏపీలో కుండపోత వర్షం, ఈ జిల్లాలకు అలర్ట్

 ఆంధ్రాలో వానలు దంచికొడుతున్నాయి. గత రెండు, మూడు రోజుల నుంచి పలు జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తుంది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

ఏపీలో కుండపోత వర్షం, ఈ జిల్లాలకు అలర్ట్
Follow us

|

Updated on: Sep 14, 2020 | 11:33 AM

ఆంధ్రాలో వానలు దంచికొడుతున్నాయి. గత రెండు, మూడు రోజుల నుంచి పలు జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తుంది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.  ప్రధానంగా కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదయ్యింది. ఉత్తరాంధ్రలోని కొన్ని జిల్లాల్లో ఓ మాదిరిగా వర్షం పడింది. ఈ వానలకు వేలాది ఎకరాల్లో  వరి, మిర్చి, వేరుసెనగ, పత్తి సహా ఇతర పంటలు నీట మునిగాయి.

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం ఈతకోటలో అత్యధికంగా 21.9 సెం.మీ వర్షపాతం నమోదైంది. పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్రలో 19.1, కర్నూలు జిల్లా ఆత్మకూరులో 18.7, పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం తూర్పుతాళ్లులో 13సెం.మీ, తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరంలో 11.4,  బ్రహ్మంగారి మఠంలో 10.9, అనంతపురం జిల్లా యాడికిలో 9.9 సెం.మీ వర్షపాతం నమోదయ్యింది.

మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో.. ఉత్తరాంధ్ర తీరానికి సమీపంలో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపోస్పియర్‌ స్థాయి ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఆవరించింది. వీటి ప్రభావం వలన సోమవారం ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.  రాయలసీమ, కోస్తాలోని పలు ప్రాంతాల్లో.. ఉరుములు మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఈనెల 17 వరకు ఏపీలో వర్షాల తీవ్రత కొనసాగే అవకాశం ఉంది. కోస్తాలో తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Also Read :

అరకు ఎంపీ గొడ్డేటి మాధవికి కరోనా పాజిటివ్

పవన్​-క్రిష్​ సినిమాకు ఆసక్తికర టైటిల్ !