కశ్మీర్: దేశం ఉలిక్కిపడింది. జవాను రక్తంతో కశ్మీర్ తడిసిపోయింది. 42 మంది భారతమాత ముద్దు బిడ్డలను పొట్టన పెట్టుకున్న పుల్వామా ఉగ్రదాడిపై భారతీయుడు చింతిస్తున్నాడు. ప్రధానితో సహా పలువురు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జవాన్ల వీర మరణం సాక్షిగా తక్షణ కర్తవ్యం కేక పెడుతోంది..
ప్రతీకారం, నిరసనలు, జవాన్ల వీర మరణం వృధా కావొద్దు,… ఒక్కసారిగా 42 మంది సీఆర్పిఎఫ్ జవాన్లు వీర మరణం పొందడం దేశాన్ని కదిలించింది. ప్రతి ఒక్కరు చింతిస్తున్నారు. ఉగ్రదాడికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
కుటుంబంతో ఆనందంగా గడిపొచ్చారు 2001లో కశ్మీర్ అసెంబ్లీపై జరిపిన కారు బాంబు దాడి తర్వాత ఆ తరహాలోనే దాడి జరగడం ఇదే మొదటి సారి. సెలవలకు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపి వచ్చిన సిఆర్పిఎఫ్ జవాన్లు విధుల నిమిత్తం కశ్మీర్ చేరుకున్నారు. జమ్మూ నుంచి శ్రీనగర్ వెళుతున్నారు. అయితే శ్రీనగర్‌కు ఇంకా 20 నుంచి 30 కిలో మీటర్ల దూరం ఉందనగా దారుణం జరిగింది. గురువారం నాడు సరిగ్గా 3 గంటల 15 నిమిషాల సమయంలో 78 వాహనాలు 2500 మంది జవాన్లతో జమ్మూ నుంచి శ్రీనగర్‌కు ప్రయాణం చేస్తున్నాయి.
మృత్యు రూపంలో దూసుకొచ్చిన స్కార్పియో అవంతిపుర వద్దకు కాన్వాయ్ రాగానే అదిల్ అహ్మద్ స్కార్పియోలో భారీ స్థాయిలో పేలుడు పదార్ధాలతో వచ్చి జవాన్లు ఉన్న ఒక బండిని ఢీ కొట్టాడు. ఆ స్కార్పియోలో 350 కిలోల ఐఈడీ పేలుడు పదార్ధాలు ఉన్నాయి. అతను గుద్దిన 76వ బెటాలియన్‌కు చెందిన వాహనంలో 44 మంది జవాన్లు ఉన్నారు. అంతా చెల్లాచెదురై పడిపోయారు. పేలుడు శబ్ధం కొన్ని కిలోమీటర్ల వరకు వినిపించింది. స్పాట్‌లోనే చాలా మంది వరకూ చనిపోయారు. మిగిలిన గాయపడిన వారిని వెంటనే ఆర్మీ ఆస్పత్రుల్లో చేర్పించి చికిత్స అందించారు. ఇంకా చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వాహనశ్రేణిలోని ఇతర వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. అయితే ఈ దాడి తర్వాత ఉగ్రవాదులు అంతటితో ఊరుకోకుండా మళ్లీ కాల్పులు జరిపారు. అక్కడే నక్కి ఉండి కాచుకు కూర్చున్నారు. దాడితో షాక్‌కు గురైన మిగిలిన జవాన్లు ఒక్క ఉదుటున ఎదురు దాడికి దిగి ముష్కరులను తరిమి కొట్టారు.
ఆ ఒక్క అజాగ్రత్తవల్లనే ఈ దారుణం అన్ని జాగ్రత్తలు తీసుకున్న భద్రతా బలగాలు ఒక్క విషయంలో మాత్రం పొరబడ్డారు. జవాన్ల ప్రయాణం నేపథ్యంలో ప్రజల సాధారణ ప్రయాణానికి ఆటంకం కలగకూడదని రాకపోకలను నియంత్రించలేదు. ఇదే అవకాశంగా వాడుకున్న ఉగ్రవాది నేరుగా దాడి చేశాడు. ఆత్మాహుతి దాడికి పాల్పడిన అదిల్ అహ్మద్ ఏడిది క్రితమే జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థలో చేరాడు. ఈ సంస్థ పాకిస్థాన్‌లో బాగా పాపులర్ అయిన ఉగ్ర సంస్థ. 6 నెలల నుండి కశ్మీర్‌లో దాడికి అతను సిద్ధమౌతూ వచ్చాడు.
స్వర్గంలో ఉన్నాడట దాడి చేసింది తామే అని ప్రకటించిన జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ ఆ ఉగ్రవాదికి సంబంధించిన ఒక వీడియోను విడుదల చేసింది. అందులో అతను మాట్లాడుతూ ఈ వీడియోను మీరు చూసే సమాయానికి నేను స్వర్గంలో ఉంటానని చెప్పాడు. దక్షిణ కశ్మీర్ ప్రజలు స్వేచ్ఛ కోసం భారత్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నారని, ఉత్తర, మధ్య కశ్మీర్ ప్రజలు కూడా తమతో కలవాలని చెప్పాడు. ఏదో కొంతమందిని అంతమొదించినంత మాత్రాన తాము ఊరుకుంటామని భావించొద్దంటూ భారత్‌ను హెచ్చరించాడు.
అత్యవసర సమావేశం దాడి నేపథ్యంలో కశ్మీర్‌లో హై అలర్ట్ ప్రకటించారు. రాకపోకలు జరుపుతున్న ప్రతి వాహనాన్ని క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. దాడి తర్వాత ప్రధాని మోడీ ఢిల్లీలో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. హోం మంంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్‌తో పాలు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తీసుకోవాల్సిన చర్యలపై సమాలోచనలు చేశారు.
ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహం జవాన్ల ప్రాణత్యాగం వృధా కావడానికి వీల్లేదని ప్రధాని మోడీ అన్నారు. మర్చిపోలని విధంగా బదులు తీర్చుకుంటామని రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ దాడిని ఖండించారు. ప్రపంచం నలు మూలల నుంచి పలువురు ప్రముఖ నాయకులు దాడిని ఖండించారు. ఉగ్రవాద నిర్మూలనకు భారత్‌తో కలిసి పని చేస్తామని వెల్లడించారు.
మద్దతివ్వని చైనా.. పాక్ దౌత్యాధికారికి వార్నింగ్ దాడి చేసిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజహర్‌ను అంతర్జీతీయ ఉగ్రవాది జాబితాలో చేర్చేందుకు మద్దతివ్వాల్సిందిగా చైనాకు భారత్ విజ్ఞప్తి చేయగా అందుకు చైనా నిరాకరించింది. పాకిస్థాన్‌కు ఉన్న ‘మోస్ట్ ఫేవర్డ్ నేషన్’ గుర్తింపును భారత్ ఉపసంహరించుకుంది. భారత్‌లో ఉన్న పాకిస్థాన్ దౌత్య అధికారి సోహైల్ మహ్మద్‌ను భారత విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన కార్యాలయానికి పిలిపించి మాట్లాడింది. దాడికి పాల్పడింది తామే అని పాకిస్థాన్‌లో ఉన్న జైషే మహ్మద్ సంస్థ ప్రకటించినందున దానిపై చర్యలు తీసుకోవాలని అతనికి సూచించింది.