రూ.13 లక్షలు క్లియర్‌ చేసి మృతదేహాన్ని తీసుకెళ్లండి

కరోనా వేళ పలు ప్రైవేట్ ఆసుపత్రులు తమ చేతి వాటం ప్రదర్శిస్తున్నాయి. రోగుల వద్ద నుంచి అధిక డబ్బులను వసూలు చేస్తున్నాయి.

రూ.13 లక్షలు క్లియర్‌ చేసి మృతదేహాన్ని తీసుకెళ్లండి
Follow us

| Edited By:

Updated on: Aug 08, 2020 | 8:08 PM

Private Hospital Bill to Corona deceased person: కరోనా వేళ పలు ప్రైవేట్ ఆసుపత్రులు తమ చేతి వాటం ప్రదర్శిస్తున్నాయి. రోగుల వద్ద నుంచి అధిక డబ్బులను వసూలు చేస్తున్నాయి. కొన్ని ఆసుపత్రులు డిశ్చార్జ్ చేసే సమయంలో, చనిపోయినప్పుడు మృతదేహాన్ని అప్పగించే సమయంలో డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా అలాంటి ఘటనే బెంగళూరులో చోటుచేసుకుంది. కరోనా బారిన పడిన ఓ 74ఏళ్ల వృద్ధుడిని కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ అతడు గురువారం కన్నుమూశారు. ఈ క్రమంలో ఆసుపత్రి మొత్తం బిల్లును రూ.13,54,337గా వేసింది. అందులో రూ.6,55,000లను వృద్ధుడి కుటుంబం  కట్టింది. అయితే మిగిలిన డబ్బును కట్టిన తరువాత మృతదేహాన్ని తీసుకెళ్లాలని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. దీంతో వృద్ధుడి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం విధించిన రేట్ల ప్రకారం రోజుకు రూ.25వేల చొప్పున వేసినా, 22 రోజులకు గానూ మొత్తం రూ.5,50,000 అవుతుంది. కానీ ఆసుపత్రి వర్గాలు రూ.13లక్షలకు పైనే బిల్లు వేసింది. ఇక ఈ విషయంపై ఆ వ్యక్తి తనయుడు ఆసుపత్రి డాక్టర్‌తో మాట్లాడగా.. కావాలంటే సంతకం లేకుండా బ్లాంక్‌ చెక్ ఇచ్చి మృతదేహాన్ని తీసుకెళ్లమని చెప్పినట్లు తెలుస్తోంది. ఆ తరువాత అతడు మాట్లాడుతూ.. ”మేము చెక్ ఇవ్వలేదు. మా నాన్నకు కేవలం దగ్గు మాత్రమే ఉండగా.. పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆసుపత్రిలో చేర్చాము. అయితే రెండో రోజు నుంచే వారు మా తండ్రిని వెంటిలేటర్‌పై పెట్టారు. గురువారం ఆయన మరణించారు 13లక్షలను మేము ఎలా కట్టగలం” అని ప్రశ్నించారు.

ఇదిలా ఉంటే ఓ ఎన్జీవో సాయంతో ఎట్టకేలకు ఆ వ్యక్తి మృతదేహాన్ని ఆసుపత్రి వర్గాలు, కుటుంబ సభ్యులకు అప్పగించాయి. మరోవైపు ఈ ఘటనపై ఆసుపత్రి వర్గాలు స్పందించాయి. ”జూలై 14న ఆ వ్యక్తిని ఆసుపత్రికి తీసుకువచ్చిన సమయంలో న్యుమోనియా, తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందితో బాధపడుతున్నారు. 21 రోజులు అతడిని వెంటిలేటర్‌పై ఉంచాం. అంతేకాదు అతడికి మిగిలిన ఆరోగ్య సమస్యలు ఉండటంతో చికిత్స అందించాం. అందుకే అంత ఖర్చు అయ్యింది” అని తెలిపాయి.

Read This Story Also: ఏపీలో కరోనా టెర్రర్‌: 10,080 కొత్త కేసులు.. 97 మరణాలు