లోకల్‌ టాలెంట్ గ్లోబల్‌ కావాలి.. సబల్‌పూర్‌ ఐఐఎం బిల్డింగ్ భూమిపూజ కార్యక్రమంలో ప్రధాని

ఒడిశాలోని సబల్‌పూర్‌ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం)శాశ్వత ప్రాంగణానికి ఇవాళ ప్రధాని శంకుస్థాపన చేశారు.

లోకల్‌ టాలెంట్ గ్లోబల్‌ కావాలి.. సబల్‌పూర్‌ ఐఐఎం బిల్డింగ్ భూమిపూజ కార్యక్రమంలో ప్రధాని
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 02, 2021 | 2:16 PM

లోకల్‌ను గ్లోబల్‌గా మార్చేందుకు ఐఐఎం విద్యార్థులు కొత్త ఆలోచనలతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. ఒడిశాలోని సబల్‌పూర్‌ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)శాశ్వత ప్రాంగణానికి ఇవాళ ప్రధాని శంకుస్థాపన చేశారు. వర్చువల్ పునాది రాయి వేసిన ప్రధాని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు కొత్త ఆలోచనలతో స్వదేశీ పరిజ్ఞానంతో ప్రపంచానికే మార్గదర్శకం కావాలని ప్రధాని అన్నారు. దేశంలో ప్రస్తుతం 20 ఐఐఎంలు అందుబాటులో ఉన్నాయన్న ప్రధాని.. ఇక్కడి టాలెంట్‌ అంతా స్వావలంబన భారత్‌ పురోగతికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

అలాగే, సమ్మిళిత అభివృద్ధిపై దృష్టి సారించాలన్న ప్రధాని.. అట్టడుగు వర్గాలకు చెందినవారిని సైతం అభివృద్ధిలో భాగస్వాములను చేయాలన్నారు. ఈ దశాబ్దంలో భారతదేశంలో బహుళజాతి సంస్థల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెడదాం. నేడు స్టార్టప్‌లుగా పురుడుపోసుకున్న సంస్థలే భవిష్యత్తులో ఎంఎన్‌సీలుగా మారతాయని ప్రధాని తెలిపారు. నేటి విద్యార్థులే రేపటి ఎంఎన్‌సీ కంపెనీలకు నాయకత్వం వహించాలని ప్రధాని పిలుపునిచ్చారు. అలాగే బ్రాండ్‌ ఇండియాకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడం మన బాధ్యత’ అని మోదీ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, కేంద్ర మంత్రి రమేశ్ పోక్రియాల్ తదితరులు పాల్గొన్నారు.