AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఆపరేషన్ అంతిమ ప్రహార్’ సక్సెస్..! అడవుల్లో బయటపడ్డ మావోయిస్టుల ఆయుధ కర్మాగారం..!

మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో నక్సలిజం నిర్మూలన దిశగా భద్రతా దళాలు మరో భారీ విజయాన్ని అందుకున్నాయి. మావోయిస్టులు రహస్యంగా నిర్వహిస్తున్న ఒక ఆయుధ తయారీ కర్మాగారాన్ని గడ్చిరోలి పోలీసులు విజయవంతంగా ధ్వంసం చేశారు. లొంగిపోయిన మావోయిస్టులు ఇచ్చిన కీలక సమాచారం ఆధారంగా ఈ ఆపరేషన్ సాగింది.

‘ఆపరేషన్ అంతిమ ప్రహార్’ సక్సెస్..! అడవుల్లో బయటపడ్డ మావోయిస్టుల ఆయుధ కర్మాగారం..!
Maoist Arms Factory
Balaraju Goud
|

Updated on: May 24, 2026 | 11:45 AM

Share

మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో నక్సలిజం నిర్మూలన దిశగా భద్రతా దళాలు మరో భారీ విజయాన్ని అందుకున్నాయి. మావోయిస్టులు రహస్యంగా నిర్వహిస్తున్న ఒక ఆయుధ తయారీ కర్మాగారాన్ని గడ్చిరోలి పోలీసులు విజయవంతంగా ధ్వంసం చేశారు. లొంగిపోయిన మావోయిస్టులు ఇచ్చిన కీలక సమాచారం ఆధారంగా ఈ ఆపరేషన్ సాగింది.

ఇటీవల మే 16వ తేదీన ‘ఆపరేషన్ అంతిమ ప్రహార్’ కింద కొందరు మావోయిస్టులు గడ్చిరోలి పోలీసుల ముందు లొంగిపోయారు. వారిని పోలీసులు లోతుగా విచారించగా, పోమ్కేం బినాగుండా పరిధిలోని అటవీ ప్రాంతంలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాల తయారీ సామగ్రిని భూమిలో పాతిపెట్టినట్లు వెల్లడించారు. ఈ సమాచారంతో గడ్చిరోలి పోలీస్ సూపరింటెండెంట్ ఎం. రమేష్ మార్గదర్శకత్వంలో మే 21న ప్రత్యేక ఆపరేషన్ బృందాలు రంగంలోకి దిగాయి. గడ్చిరోలి, ప్రాణహిత సంయుక్త బృందాలు, బాంబు డిస్పోజల్ స్క్వాడ్ కలసి అడవిని జల్లెడ పట్టాయి.

మే 22న పోమ్కేం బినాగుండా ఉత్తర అటవీ ప్రాంతంలో తనిఖీలు చేపట్టగా, భూమిలో దాచిన భారీ ఆయుధ కర్మాగారం బయటపడింది.

అక్కడ లభించిన సామగ్రి:

* ఒక లేత్ మెషీన్, డ్రిల్లింగ్/గ్రైండింగ్ మెషీన్లు, జిగ్ సా మెషీన్.

* BGL (బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్) పైపులు, 12 బోర్ పైపులు.

* విద్యుత్ సరఫరా కోసం జనరేటర్, ఇన్వర్టర్, బ్యాటరీలు, సోలార్ ప్యానెల్స్.

* ప్రెజర్ పంప్, 20 అడుగుల ఫుట్‌బాల్ పైప్ తదితర వస్తువులు.

భద్రతా దళాలకు హాని కలిగించేందుకు, నక్సల్ వారోత్సవాలు, ఎన్నికల సమయంలో విరుచుకుపడేందుకు మావోయిస్టులు వీటిని దాచినట్లు సమాచారం. అయితే, ప్రమాదకరమైన ఈ సామగ్రి మొత్తాన్ని జవాన్లు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఘటనా స్థలంలోనే పూర్తిగా ధ్వంసం చేశారు. గడ్చిరోలి జిల్లాలో మావోయిజం ఇప్పుడు దాదాపు అంతమైపోయింది. అడవుల్లో దాచిన సామగ్రిని వెలికితీయడం పోలీసు దళం సాధించిన పెద్ద విజయం. ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన భద్రతా దళాలను ఉన్నతాధికారులు అభినందించారు.

వీడియో ఇక్కడ చూడండి..

“ఆపరేషన్ క్రాక్‌డౌన్”

ఇదిలావుంటే, మహారాష్ట్రలోని నాందేడ్‌లో ‘ఆపరేషన్ క్రాక్‌డౌన్’ పేరుతో భారీ ఆపరేషన్‌ చేపట్టి అక్రమ ఆయుధాల డంప్‌ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో నేరస్తులపై తమ పట్టును మరింత బిగించే పనిలో పడ్డారు నాందేడ్ పోలీసులు. “ఆపరేషన్ క్రాక్‌డౌన్” పేరుతో నిర్వహిస్తున్న నిరంతర ఆపరేషన్ల ద్వారా, పోలీసులు అనేక మంది నేరస్తులను కటకటాల వెనక్కి పంపుతున్నారు. నాందేడ్‌లోని దేనా బ్యాంక్ సమీపంలో ఉన్న సచ్‌ఖండ్ గురుద్వారా రోడ్డులో భారీ డంప్‌ని స్వాధీనం చేసుకున్నారు. 300 సాల్ షాపింగ్ ప్లాజాలో షాపు నంబర్ 8లో అక్రమ ఆయుధాల వ్యాపారం జరుగుతోందని స్థానిక క్రైమ్ బ్రాంచ్‌కు ఒక రహస్య సమాచారం రావడంతో వెంటనే ఆ వివరాలను జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అవినాష్‌కు తెలియజేశారు. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో స్థానిక క్రైమ్ బ్రాంచ్ ఆకస్మిక తనిఖీ చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో పోలీసులు భారీ మొత్తంలో అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 470 కత్తులు, 208 కఠారులు, అలాగే 24 ‘ఫైటర్ పంచ్‌లు’ ఉన్నాయి. మొత్తంగా 703 అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 14 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ అక్రమ ఆయుధాల వ్యాపారి, షాపు యజమాని అయిన రంజిత్ సింగ్ సర్దార్ అక్కడి నుంచి పారిపోయాడు. అతన్ని పట్టుకునేందుకు పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us