ఆ చీకటి రోజులకు 44 ఏళ్లు.. 21నెలల్లో ఏం జరిగింది..?

స్వతంత్ర్య భారతదేశంలో చీకటి రోజులుగా భావించే ఎమర్జెన్సీ డేస్ విధించి నేటికి 44సంవత్సరాలు అవుతోంది. అంతర్గత కల్లోలాలతో దేశ భద్రతను ముప్పు పొంచి ఉందన్న ఉద్దేశంతో అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 352 ఆధారంగా ఎమర్జెన్సీని విధించారు. 1975 జూన్ 25వ తేది అర్ధరాత్రి 11.45గంటలకు అమల్లోకి వచ్చిన ఎమర్జెన్సీ.. 1977 మార్చి 21(21 నెలలు) వరకు కొనసాగింది. ఈ కాలంలో ఇందిరా గాంధీ తన ప్రత్యర్థులను ఎంతోమందిని జైళ్లలో నిర్భంధించారు. పత్రికా స్వేచ్ఛను […]

ఆ చీకటి రోజులకు 44 ఏళ్లు.. 21నెలల్లో ఏం జరిగింది..?
Follow us

| Edited By:

Updated on: Jun 25, 2019 | 3:39 PM

స్వతంత్ర్య భారతదేశంలో చీకటి రోజులుగా భావించే ఎమర్జెన్సీ డేస్ విధించి నేటికి 44సంవత్సరాలు అవుతోంది. అంతర్గత కల్లోలాలతో దేశ భద్రతను ముప్పు పొంచి ఉందన్న ఉద్దేశంతో అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 352 ఆధారంగా ఎమర్జెన్సీని విధించారు. 1975 జూన్ 25వ తేది అర్ధరాత్రి 11.45గంటలకు అమల్లోకి వచ్చిన ఎమర్జెన్సీ.. 1977 మార్చి 21(21 నెలలు) వరకు కొనసాగింది. ఈ కాలంలో ఇందిరా గాంధీ తన ప్రత్యర్థులను ఎంతోమందిని జైళ్లలో నిర్భంధించారు. పత్రికా స్వేచ్ఛను కూడా హరించారు. ఇక ఇదే కాలంలో ఇందిర కుమారుడు సంజయ్ గాంధీ సామూహిక కుటుంబ నియంత్రణ కార్యక్రమం(మాస్- స్టెరిలైజేషన్) చేపట్టాలని పిలుపునిచ్చారు.

ఎమర్జెన్సీ ఎలా ప్రారంభమైందంటే.. 1969లో కాంగ్రెస్‌లో చీలిక వచ్చాక 1971లో జరిగిన ఎన్నికల్లో ఇందిర సారధ్యంలోని కాంగ్రెస్ 351 సీట్లతో జయకేతనం ఎగరవేసింది. అయితే ఈ ఎన్నికల్లో గెలిచేందుకు ఇందిరా గాంధీ అక్రమాలకు పాల్పడ్డారని, ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని.. ఆమెపై పోటీ చేసిన రాజ్ నారాయణ్ అలహాబాద్ హైకోర్టులో కేసు వేశారు. దీనిపై ఆమెను ఆరేళ్ల పాటు పార్లమెంట్ సభ్యత్వానికి అనర్హురాలిగా ప్రకటిస్తూ 1975 జూన్ 12న అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. ఇక దీనిపై ఆమె సుప్రీంను ఆశ్రయించగా.. జూన్ 24న అలహాబాద్ కోర్టు తీర్పుపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. అయితే అప్పటికే దేశమంతా అవినీతికి వ్యతిరేకంగా నిరసనలు, ఉద్యమాలు మొదలయ్యాయి. సోషలిస్ట్ జయప్రకాశ్ నారాయణ్ సంపూర్ణ క్రాంతి పిలుపుతో దేశ ప్రజలంతా శాంతియుత నిరసనలకు దిగారు. దీంతో జూన్ 25న ఎమర్జెన్సీ అమల్లోకి వచ్చింది.

ఎప్పుడెప్పుడు ఏం జరిగిందంటే..

  • 1975 జూలై 1వ తేదిన పౌర హక్కులపై ఇందిరా గాంధీ నిబంధనలు విధించారు.
  • 1975 జూలై 24న ఎమర్జెన్సీకి లోక్‌సభలో ఆమోదం లభించింది.
  • 1975 ఆగష్టు 5న దేశంలో అంతర్గత భద్రతా చట్టం విధించారు.
  • 1976 జనవరి 9న రాజ్యంగంలో నిర్దేశించిన స్వేచ్ఛా నిబంధనలు ఉక్కుపాదంతో అణిచివేశారు.
  • 1976 ఫిబ్రవరి 4న లోక్‌సభ కాలపరిమితిని మరో ఏడాది పొడిగించారు.
  • 1976 మే 21న కోర్టుల నుంచి కొన్ని చట్టాలను రక్షించేందుకు రాజ్యాంగాన్ని సవరించారు.
  • 1977 జనవరి 18న లోక్‌సభ ఎన్నికలను ప్రకటించారు.
  • 1977 జనవరి 24న జనతా పార్టీ ఆవిర్భవించింది.
  • 1977 మార్చి 16న ఎన్నికలు ప్రారంభమయ్యాయి.
  • 1977 మార్చి 21న ఎమర్జెన్సీని తొలగించారు.
  • 1977 మార్చి 22న జనతా పార్టీ విజయం సాధించి అధికారాన్ని దక్కించుకుంది.