నవంబర్ 9న తిరుమలలో అద్భుత దృశ్యం..ఒక్కరోజే ఛాన్స్

తిరుమల శ్రీనివాసుని దర్శనం సకల పాపహరణం అని భావిస్తారు భక్తులు. శ్రీవారి దివ్యసుందర రూపాన్ని క్షణకాలం చూసినా ఆ ఆనందపరవశం కలకాలం గుర్తుండిపోతుందంటారు శ్రీ వేంకటేశ్వరుని భక్తులు. నిత్యం వేలాది మంది దర్శించుకునే శ్రీనివాసుని ఓ అరుదైన రూపం ఏడాదికి ఒక్కసారే భక్తులకు దర్శనమిస్తుందంటే ఆశ్చర్యానికి గురయ్యేవారు చాలా మందే వుంటారు. అలాంటి అరుదైన రూపంలో స్వామి వారు తిరుమాడ వీథుల్లో దర్శనమిచ్చే రోజు ఆసన్నమైంది. తిరుమలేశుని సన్నిధిలో మూల విరాట్టు.. మూల బేరం తర్వాత అత్యంత […]

నవంబర్ 9న తిరుమలలో అద్భుత దృశ్యం..ఒక్కరోజే ఛాన్స్
Rajesh Sharma

|

Nov 03, 2019 | 9:56 AM

తిరుమల శ్రీనివాసుని దర్శనం సకల పాపహరణం అని భావిస్తారు భక్తులు. శ్రీవారి దివ్యసుందర రూపాన్ని క్షణకాలం చూసినా ఆ ఆనందపరవశం కలకాలం గుర్తుండిపోతుందంటారు శ్రీ వేంకటేశ్వరుని భక్తులు. నిత్యం వేలాది మంది దర్శించుకునే శ్రీనివాసుని ఓ అరుదైన రూపం ఏడాదికి ఒక్కసారే భక్తులకు దర్శనమిస్తుందంటే ఆశ్చర్యానికి గురయ్యేవారు చాలా మందే వుంటారు. అలాంటి అరుదైన రూపంలో స్వామి వారు తిరుమాడ వీథుల్లో దర్శనమిచ్చే రోజు ఆసన్నమైంది.
తిరుమలేశుని సన్నిధిలో మూల విరాట్టు.. మూల బేరం తర్వాత అత్యంత పురాతనమైన స్వామి వారు ఉగ్రరూపంలో దర్శనమిచ్చే ఉగ్ర శ్రీనివాస మూర్తి విగ్రహమే. ఈ విగ్రహం స్వామి వారి ఆగ్రహ దశను సూచిస్తుంది. మూల విరాట్టు విగ్రహం తర్వాత అత్యంత పురాతనమైనది.. ప్రాచీనమైనది ఈ విగ్రహమేనని భావిస్తారు. ఈ విగ్రహాన్నే స్నపన బేంర అని కూడా అంటుంటారు. ఈ విగ్రహం 18 అంగుళాల ఎత్తు కలిగి వుంటుంది. 7 అంగుళాల ఎత్తు పీఠం మీద నిలబడి వున్న ఉగ్ర శ్రీనివాస మూర్తి విగ్రహాన్ని దర్శించుకునే అవకాశం ఏడాదికి ఓసారి మాత్రమే దొరుగుతుంది. ధృవబేర, కౌతుకబేర, బలిబేరాలకు భిన్నంగా ఈ విగ్రహం నిలుచుని ఉన్న భంగిమలో శ్రీదేవి, భూదేవుల ప్రతిమలతో కలసి ఉంటుంది.
తమిళ పర్యాయపదమైన ‘వెంకట తురైవార్’ అన్న పేరును బట్టి భోగ శ్రీనివాసుని విగ్రహ ప్రతిష్ఠాపన జరగడానికి పూర్వం ఉత్సవ విగ్రహంగా ఉగ్ర శ్రీనివాస మూర్తి ఉండేదని తెలుస్తుంది. 14వ శతాబ్దానికి ముందు ఉత్సవ విగ్రహంగా ఉపయోగించేవారని తెలుస్తోంది. ఒకసారి ఈ విగ్రహం ఊరేగింపుగా వెళ్ళినప్పుడు అగ్నిప్రమాదం జరగడం వల్ల అప్పట్నుంచీ ఈ విగ్రహంపై సూర్యకిరణాలు పడనివ్వరు. ఏడాదికి ఒక్కసారి సూర్యోదయానికి ముందే ఉగ్ర శ్రీనివాసుని అన్ని అలంకారాలతో ఊరేగింపుగా తీసుకువెళ్ళి, గర్భగుడిలోకి తీసుకెళ్ళిపోతారు. ఉత్థాన ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, ద్వాదశి ఆరాధనలలో ఈ ఉగ్ర శ్రీనివాసుని విగ్రహానికి ప్రాధాన్యత ఏర్పడుతుంది. ఈయనపై సూర్యకిరణాలు పడరాదని, అలా ప్రసరించినట్లయితే ప్రపంచానికి హాని సంభవిస్తుందని పురాణేతిహాసం తెలుపుతోంది.
అందువల్ల ఒక్క కౌశిక ద్వాదశి పర్వదినం రోజున ఉగ్ర శ్రీనివాస మూర్తి విగ్రహాన్ని తిరుమాడ వీథుల్లో ఊరేగిస్తారు. ఈ సంవత్సరం కౌశిక ద్వాదశి నవంబర్ 9న వస్తుండడంతో ఆ రోజు తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే ఉగ్ర శ్రీనివాస మూర్తి విగ్రహాన్ని సర్వాలంకార భూషితంగా తీర్చి దిద్ది.. తిరుమాడ వీథులలో ఊరేగించి.. తిరిగి సూర్యోదయం కంటే ముందుగానే గర్భాలయంలోకి తరలిస్తారు. ఈ ఉగ్రరూప శ్రీ వేంకటేశ్వర స్వామి వారి విగ్రహాన్ని దర్శించాలంటే నవంబర్ 9న తెల్లవారుజాము కంటే ముందుగానే తిరుమాడ వీథులలో నిలిచి వుంటే చాలని భక్తులు అనుకుంటున్నారు. నవంబర్ 9న భారీ సంఖ్యలో భక్తులు వస్తారని టిటిడి ఏర్పాట్లు చేస్తోంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu