ఉత్తర తిరుగుబాటుదారులు జితిన్‌ ప్రసాద, రాజ్‌బబ్బర్‌లను దూరం పెట్టిన కాంగ్రెస్‌ అధిష్టానం

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ఎంతకాదన్నా ఇంకా ఏడాదిన్నర ఉంది.. 2022లో జరిగే ఆ ఎన్నికల కోసం మిగతా పార్టీలేమో కానీ కాంగ్రెస్‌ పార్టీ మాత్రం ఇప్పట్నుంచే కసరత్తులు చేస్తోంది.. ఉత్తరప్రదేశ్‌లో పునరుత్తేజాన్ని సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్‌పార్టీ ఇందుకోసం ఏడు కమిటీలను ఏర్పాటు చేసింది.

ఉత్తర తిరుగుబాటుదారులు జితిన్‌ ప్రసాద, రాజ్‌బబ్బర్‌లను దూరం పెట్టిన కాంగ్రెస్‌ అధిష్టానం
Follow us

|

Updated on: Sep 07, 2020 | 1:58 PM

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ఎంతకాదన్నా ఇంకా ఏడాదిన్నర ఉంది.. 2022లో జరిగే ఆ ఎన్నికల కోసం మిగతా పార్టీలేమో కానీ కాంగ్రెస్‌ పార్టీ మాత్రం ఇప్పట్నుంచే కసరత్తులు చేస్తోంది.. ఉత్తరప్రదేశ్‌లో పునరుత్తేజాన్ని సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్‌పార్టీ ఇందుకోసం ఏడు కమిటీలను ఏర్పాటు చేసింది. మ్యానిఫెస్టో కమిటీ, మీడియా అడ్వైజరీ కమిటీ, ట్రైనింగ్‌ కమిటీ, పంచాయతీరాజ్‌ ఎలెక్షన్‌ కమటీ, మెంబర్‌షిప్‌ కమిటీ, అవుట్‌రీచ్‌ కమిటీ… ఇలా ఏడు కమిటీలను రూపొందించి ఎన్నికలకు సంసిద్ధం కావాలంటూ పురమాయించింది అధిష్టానం..

ఈ కమిటీలలో ఒక్కదాంట్లో కూడా కేంద్ర మాజీ మంత్రి జితిన్‌ ప్రసాద, ఉత్తరప్రదేశ్‌ మాజీ పీసీసీ చీఫ్‌ రాజ్‌బబ్బర్‌ల పేర్లు లేకపోవడం విస్మయాన్ని కలిగించింది.. సీనియర్‌ నేతలు సల్మాన్‌ ఖుర్షిద్‌, ప్రమోద్‌ తివారి, పి.ఎల్‌.పునియా, అనుగ్రహ్‌ నారాయణ్‌ సింగ్‌లకు మాత్రం కమిటీలలో పెద్దపీట వేసింది కాంగ్రెస్‌ అధిష్టానం. నాయకత్వాన్ని మార్చాలంటూ సోనియాగాంధీకి లేఖ రాసిన 23 మందిలో జితిన్‌ ప్రసాద, రాజ్‌బబ్బర్‌లు కూడా ఉండటం గమనార్హం. అందుకే కాంగ్రెస్‌ అధిష్టానం వీరిని పక్కన పెట్టిందా అన్న అనుమానం కలుగుతోంది.. అయితే వీరితో పాటు ఉత్తరప్రదేశ్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ దీపక్‌ సింగ్‌, కేంద్ర మాజీ మంత్రి ఆర్‌.పి.ఎన్‌.సింగ్‌, మాజీ ఎంపీ అనూ టాండన్‌, రాజీవ్‌ శుక్లాలకు కూడా కమిటీలలో చోటివ్వకపోవడం చూస్తుంటే కాంగ్రెస్‌ దీర్ఘాలోచనతోనే ఈ పని చేసిందని అంటున్నారు కొందరు.. పైగా రాజీవ్‌శుక్లా, అనూ టాండన్‌లు పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీకి అత్యంత సన్నిహితులు.. వారి పేర్లు కూడా కమిటీలలో కనిపించకపోవడమే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.. బ్రాహ్మిణ్‌ చేతన పరిషత్‌ పేరుతో బ్రాహ్మణులను సంఘటితం చేసే పనిలో పడ్డారు జితిన్‌ ప్రసాద.. బ్రాహ్మణుల హత్యలను ఖండిస్తూ సభలు సమావేశాలు పెడుతున్నారు.. జూమ్‌ ద్వారా పది మందితో ఇంటరాక్ట్‌ అవుతున్నారు..ఇవన్నీ కాంగ్రెస్‌పార్టీకి ఉపయోగపడతాయో లేదో తెలియదు కానీ ప్రసాద విషయంలో మాత్రం అధిష్టానం ఒకింత సీరియస్‌గానే ఉందని తాజా పరిణామాలు చెబుతున్నాయి. అయితే కమిటీలలో సీనియర్లకు చోటు కల్పించకపోవడానికి కారణం ఎన్నికల ముందు వారికి కీలక బాధ్యతలను అప్పగించడం కోసమేనని యూపీ కాంగ్రెస్‌ చీఫ్‌ అజయ్‌కుమార్‌ లల్లూ అంటున్నారు. ఇంకా చాలా కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఉందని, వారి సేవలను తప్పనిసరిగా పార్టీ సద్వినియోగం చేసుకుంటుందని అన్నారు. ప్రియాంకగాంధీ నేతృత్వంలో ఎన్నికలలో పోరాడుతామని తెలిపారు.