దేశంలో కోవిడ్ 19 వ్యాక్సీన్ సులభంగా అందుబాటులోకి రావాలంటే ముఖ్యంగా సామాన్యులు మరో ఏడాది వరకు వేచి ఉండాల్సిందేనని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా అభిప్రాయపడ్డారు. భారతీయ మార్కెట్లలో ఇది ఎంటర్ కావాలంటే ఇంకో సంవత్సరం పట్టే అవకాశం ఉందన్నారు. మన దేశంలో జనాభా చాలా ఎక్కువని, ఫ్లూ వ్యాక్సీన్ మాదిరి దీనిని కూడా మార్కెట్లోకి ఎలా తేవాలో చూడాల్సి ఉందన్నారు. ఈ టీకా మందును దేశంలో ప్రతివ్యక్తికి ఎలా అందజేయాలో, ఏ విధంగా వ్యాక్సినేషన్ చేయాలో ఇంకా నిర్ణయించాల్సి ఉంది. ఇందుకు చాలా సమయం పడుతుంది.. పైగా తొలి టీకా మందు తరువాత వచ్ఛే రెండో వ్యాక్సీన్ ఎంత సమర్థంగా పని చేస్తుందో కూడా మదింపు చేయాల్సి ఉంది అని గులేరియా వివరించారు. మూడో దశ ట్రయల్స్ ఇంకా జరుగుతున్నాయని, వివిధ వ్యాక్సీన్లలో ఉత్తమమైనది ఏదో కూడా నిర్ధారణ కావలసి ఉందని ఆయన చెప్పారు.