Live Updates: భారత్‌లో స్ట్రెయిన్ సైరన్.. దేశవ్యాప్తంగా ఆరుగురికి సోకిన కొత్త వైరస్.. తెలుగు రాష్ట్రాల్లోనూ కలవరం

|

Updated on: Dec 29, 2020 | 1:47 PM

బ్రిటన్ కేంద్రంగా వ్యాప్తి చెందుతున్న కొత్త వైరస్ ప్రపంచ దేశాలను మరో కుదిపివేస్తోంది. చాపకింద నీరులా మెల్ల మెల్లగా అన్ని దేశాలకు విస్తరిస్తుంది. యూకే, సహా పలు దేశాలను హడలెత్తిస్తున్న వైరస్‌ తెలుగు రాష్ట్రాలను కూడా తాకింది.

Live Updates: భారత్‌లో స్ట్రెయిన్ సైరన్.. దేశవ్యాప్తంగా ఆరుగురికి సోకిన కొత్త వైరస్.. తెలుగు రాష్ట్రాల్లోనూ కలవరం

బ్రిటన్ కేంద్రంగా వ్యాప్తి చెందుతున్న కొత్త వైరస్ ప్రపంచ దేశాలను మరో కుదిపివేస్తోంది. చాపకింద నీరులా మెల్ల మెల్లగా అన్ని దేశాలకు విస్తరిస్తుంది. యూకే, సహా పలు దేశాలను హడలెత్తిస్తున్న వైరస్‌ తెలుగు రాష్ట్రాలను కూడా తాకింది. యూకే నుంచి భారతదేశానికి వచ్చిన ప్రయాణికుల్లో ఇప్పటికే కొందరికి కరోనా పాజిటివ్‌గా తేలగా.. అసలు అది పాత వైరసేనా? కొత్త స్ట్రెయినా? అనే విషయం తేల్చడం కోసం పరిశోధనల సంస్థలు శాంపిల్స్ పంపించారు అధికారులు.. దీనిపై జీనోమ్ చేసిన శాస్త్రవేత్తలు… ఆ నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. దీంతో.. అధికారుల్లో కొత్త టెన్షన్ మొదలైనట్టు తెలుస్తోంది.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 29 Dec 2020 01:39 PM (IST)

    తమిళనాడు వ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం

    రోజు రోజుకీ కరోనా కొత్త కేసులు వెలుగుచూస్తుండటంతో పాటు బ్రిటన్ రిటర్న్స్ కేసులు పెరుగుతుండటంతో తమిళనాడు సర్కార్ అలర్ట్ అయ్యింది. తమిళనాడు వ్యాప్తంగా క్లబ్‌, పబ్‌లు, బీచ్‌ రిసార్ట్స్‌, రెస్టారెండ్లు, బీచ్‌లలో న్యూ ఇయర్‌ సెలబ్రేషన్‌ను నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెస్టారెంట్లు, పబ్‌లు తెరిచేందుకు అనుమతి ఇచ్చినా.. కోవిడ్‌ మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలని ఆదేశించింది. మెరీనా బీచ్ న్యూ ఇయర్ సందర్భంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది.

  • 29 Dec 2020 01:38 PM (IST)

    పంజాబ్‌లోనూ అంక్షలు అమలు

    పంబాబ్‌లోనూ ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ విధించింది. పెళ్లిళ్లు, శుభకార్యాలు, ఇతర కార్యక్రమాలు, సామూహిక సమావేశాలపై నిషేధం విధించింది. ముఖ్యంగా జన సమూహం ఎక్కువగా ఉండే కార్యక్రమాలపై ప్రభుత్వం అంక్షలు విధించింది.

  • 29 Dec 2020 01:38 PM (IST)

    హిమాచల్‌ప్రదేశ్‌లో జనవరి 5వ తేదీ వరకు అంక్షలు అమలు

    హిమాచల్‌ప్రదేశ్‌లో జనవరి 5వ తేదీ వరకు సిమ్లా, మండి, కంగ్రా, కులులో రాత్రి కర్ఫ్యూ విధించారు. ఆయా జిల్లాలో బహిరంగ నూతన సంవత్సర వేడుకలకు అనుమతి లేదని అధికారులు పేర్కొన్నారు.

  • 29 Dec 2020 01:37 PM (IST)

    రాజస్థాన్‌‌లో కొత్త ఏడాది వేడుకలపై నిషేధం

    కొత్త వైరస్ వెలుగుచూస్తుండటంతో రాజస్థాన్‌ అప్రమత్తమైంది. మరోసారి కోవిడ్ నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ గురువారం రాత్రి నుంచి శుక్రవారం వరకు రాత్రి కర్ఫ్యూ విధిస్తన్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, బహిరంగ ప్రదేశాల్లోనూ కొత్త సంవత్సర వేడుకలు, సభలు, సమావేశాలపై నిషేధం విధించింది.

  • 29 Dec 2020 01:35 PM (IST)

    ఉత్తరాఖండ్‌లో మరోసారి కోవిడ్ అంక్షలు

    ఉత్తరాఖండ్‌లో కొత్తగా మరోసారి కోవిడ్ అంక్షలు విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర సర్కార్ ప్రకటించింది. హోటళ్లు, బార్‌, రెస్టారెంట్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో నూతన సంవత్సర వేడుకల నిర్వహణపై డెహ్రాడూన్‌ పరిపాలన అనుమతి నిరాకరించింది.

  • 29 Dec 2020 01:24 PM (IST)

    కర్ణాటకలోనూ రాత్రిపూట కర్ఫ్యూ అమలు

    కొత్త వైరస్‌లో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈనెల 30వ తేదీ గురువారం నుంచి జనవరి 2వ తేదీ వరకు రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సాయంత్రం 6గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రాత్రిపూట కర్ఫ్యూ అమలులో ఉండనుంది. దీంతోపాటు క్లబ్‌లు, పబ్‌లు, రెస్టారెంట్‌లతో పెద్ద ఎత్తున సమావేశాలపై నిషేధం విధిస్తున్నట్లు కర్ణాటక సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.

  • 29 Dec 2020 01:19 PM (IST)

    మహారాష్ట్రలో జనవరి 5వ తేదీ వరకు రాత్రిపూట కర్ఫ్యూ

    ఇప్పటికే కరోనా వైరస్‌ మహమ్మారితో విలయం సృష్టిస్తుండగా.. బ్రిటన్‌లో వెలుగు చూసిన కొత్త వేరియంట్‌తో రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. మహమ్మారి మరింత వ్యాప్తిని నియంత్రించడానికి అనేక రాష్ట్ర ప్రభుత్వాలు న్యూ ఇయర్ వేడుకలపై అంక్షలు విధిస్తున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 31 నుంచి జనవరి 5వ తేదీ వరకు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ విధించింది. ముంబై, పుణెతో పాటు పెద్ద నగరాల్లోనూ బహిరంగ నూతన వేడుకలకు అనుమతించడం లేదు.

  • 29 Dec 2020 01:15 PM (IST)

    జనవరి 31 వరకు కోవిడ్ అంక్షలు.. కేంద్రం తాజా ఉత్తర్వులు

    కొత్తరకం వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కొవిడ్‌ ఆంక్షలను జనవరి 31 వరకు పొడగిస్తూ కేంద్ర హోంశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల స్థానిక పరిస్థితులను బట్టి కరోనా వ్యాప్తి నియంత్రణకు రాత్రిపూట కర్ఫ్యూ, ఆంక్షలు విధించుకోవచ్చని సూచించింది. అయితే, రాష్ట్రాల మధ్య, రాష్ట్ర పరిధిలోని వ్యక్తులు, వాహనాల రాకపోకలపై పరిమితులు విధించకూడదని స్పష్టం చేసింది

  • 29 Dec 2020 01:09 PM (IST)

    ఆంధ్రప్రదేశ్‌లో స్ట్రెయిన్ భయం

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ బ్రిటన్ స్ట్రెయిన్ భయం పట్టుకుంది. ఇప్పటివరకు ఏపీ లో మొత్తం 23మంది అనుమానితులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే వీరిని గుర్తించామన్నారు. యూకే రిటర్న్స్ లో 11మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. బ్రిటన్ నుంచి వచ్చిన ప్రయాణికులతోకాంటాక్ట్ అయిన వారిలో 12 మందికి పాజిటివ్ తేలినట్లు రాష్ట్ర వైద్యారోగ్య అధికారులు తెలిపారు. మరికొందరి కోసం ట్రేసింగ్ ఉన్నట్లు వెల్లడించారు.

  • 29 Dec 2020 12:59 PM (IST)

    బ్రిటన్ రిటర్స్న్ తప్పించుకు తిరుగుతున్నారుః రాష్ట్ర సర్కార్

    బ్రిటన్‌లో కొత్త రకం కరోనా గుబులు నెలకొన్న తరుణంలో ఆ దేశంతో పాటు విదేశాల నుంచి బెంగళూరుకు చేరుకున్నవారిలో చాలా మంది అడ్రస్‌ లేరు. కరోనా పర్యవేక్షణ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. బ్రిటన్‌ నుంచి రాష్ట్రానికి వచ్చిన 1,614 మందిలో 26 మందికి కరోనా పాజిటివ్‌ అని వెల్లడైందని వైద్య ఆరోగ్య మంత్రి సుధాకర్‌ తెలిపారు.

  • 29 Dec 2020 12:14 PM (IST)

    గత నెల రోజుల్లో యూకే నుంచి భారత్‌కు 33 వేల మంది

    గత నెల రోజులలో యూకే నుంచి 33 వేల మంది ప్రయాణికులు భారత్‌కు వచ్చారు. వీరిలో 114 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. బెంగళూరులో ముగ్గురు, హైదరాబాద్‌లో ఇద్దరు, పూణేలో ఒకరికి కొత్తరకం కరోనా స్ట్రెయిన్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ ఆరుగురిని ప్రత్యేక గదిలో ఉంచి కేంద్ర వైద్య బృందం పరీక్ష పరీక్షలు నిర్వహిస్తోంది. వీరితో సన్నిహితంగా మెలిగిన వారందరినీ ప్రభుత్వం క్వారంటైన్‌కు తరలించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం ప్రకటన విడుదల చేసింది.

  • 29 Dec 2020 11:49 AM (IST)

    ఆరుగురికి కొత్త స్ట్రెయిన్ నిర్ధారణ

    బ్రిటన్ నుంచి వచ్చిన 176 మంది భారత్‌కు వచ్చారు. వీరందరికీ కరోనా పరీక్షలు చేయగా వారిలో ఆరుగురికి కొత్త స్ట్రెయిన్ నిర్ధారణ అయింది. వీరిలో బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్(ఎన్ఐఎంహెచ్‌ఏఎన్ఎస్)లో ముగ్గురిని గుర్తించారు. హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ)లో ఇద్దరిని, అలాగే పూనేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎఐవీ)లో ఒకరిని గుర్తించినట్లు తెలుస్తోంది.

  • 29 Dec 2020 11:48 AM (IST)

    భారత్‌లో ఆరుగురికి కొత్త వైరస్

    మన దేశంలోకి కరోనా కొత్త వైరస్ స్ట్రెయిన్ ప్రవేశించింది. ఇంగ్లండ్ నుంచి భారత్ తిరిగి వచ్చిన ఆరుగురిలో తొలిసారిగా ఈ స్ట్రెయిన్‌ను గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

  • 29 Dec 2020 11:43 AM (IST)

    తెలంగాణకు యూకే రిటర్న్స్ 1216 మంది

    బ్రిటన్ నుంచి తెలంగాణకు వచ్చిన వారి వివరాలు సేకరించి, వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. డిసెంబర్ 9 నుండి ఇప్పటి వరకు 1216 మంది యూకే నుండి తెలంగాణకు వచ్చారు. వీరిలో 1,060 మందిని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో ట్రేస్ అయిన వారిలో 996 మందికి పరీక్షలు నిర్వహించగా 966 మందికి కరోనా నెగెటివ్ గా నిర్ధారణ అయ్యింది. 21 మందికి పాజిటివ్ అని తేలింది, మరో 9 మంది ఫలితాలు రావాల్సి ఉంది.

  • 29 Dec 2020 11:40 AM (IST)

    అప్రమత్తమైన తెలంగాణ సర్కార్

    కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ వచ్చిన నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్ విధానంను అవలంబిస్తున్నాము. వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ సోమవారం ఉన్నతాధికారులతో అత్యవసరంగా భేటీ అయ్యారు. అన్ని జిల్లాల వైద్య యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. బ్రిటన్‌ నుంచి వచ్చిన ప్రయాణికుల వివరాలను సేకరించాలని సూచించారు. యుద్ధప్రాతిపాదికన వారిని గుర్తించి వీలైనంత వేగంగా అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.

  • 29 Dec 2020 11:37 AM (IST)

    49 ఏళ్ల వ్యక్తిలో కొత్త రకం కరోనా వైరస్‌

    ఈ నెల 10న యూకే నుంచి తిరిగివచ్చిన వరంగల్‌ అర్బన్‌ జిల్లాకు వచ్చిన 49 ఏళ్ల వ్యక్తిలో కొత్త రకం కరోనా వైరస్‌ ఉన్నట్లుగా సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయోలజీ (సీసీఎంబీ) నిర్ధారించింది. అయితే ఈ వివరాలను అధికారికంగా ప్రకటించనప్పటికీ వైరస్‌ కొత్త స్ట్రెయిన్‌ సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసింది.

  • 29 Dec 2020 11:36 AM (IST)

    తెలంగాణలో తొలి కేసు నమోదు

    బ్రిటన్ నుంచి వచ్చిన ప్రయాణికులతో భారత్‌తోసహా పలు దేశాలను హడలెత్తిస్తున్న కొత్త రకం కరోనా వైరస్‌ తెలంగాణకూ పాకింది. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న కరోనాకన్నా సుమారు 70 శాతం అధికంగా వ్యాప్తి చెందే గుణం ఉన్న కరోనా కొత్త స్ట్రెయిన్‌కు సంబంధించి రాష్ట్రంలోనే తొలి కేసు సోమవారం నమోదైంది.

  • 29 Dec 2020 11:34 AM (IST)

    కోవిడ్ నిబంధనలు పాటించాలిః వైద్యులు

    కరోనా కొత్త రకం వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతుందేగానీ దానివల్ల మరణాల తీవ్రత తక్కువే. వ్యాక్సిన్‌ వచ్చేవరకు అందరూ తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలి. భౌతిక దూరం నిబంధన పాటించాలి. చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

  • 29 Dec 2020 11:32 AM (IST)

    కరోనా వ్యాక్సిన్ కొత్త వైరస్‌ను సమర్థవంతంగా ఎదురించే అవకాశంః శాస్త్రవేత్తలు

    కరోనా ఆర్‌ఎన్‌ఏ వైరస్‌. ఇది ఎప్పటికప్పుడు రూపం మార్చుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. కొత్తగా యూకేలో పరివర్తనం చెందిన వైరస్‌కు.. ప్రస్తుతమున్న కరోనా వైరస్‌ కంటే అతి వేగంగా వ్యాప్తి చెందే గుణముందంటున్నారు. అయితే, కేసుల సంఖ్య పెరుగుతుందేమోగానీ.. మరణాల శాతం పెరిగే అవకాశాల్లేవని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం ప్రయోగ దశల్లో ఉన్న టీకాలు కూడా ఈ పరివర్తనం చెందిన వైరస్‌ను సమర్థంగా ఎదుర్కోగలవని సంబంధిత నిపుణులు చెబుతున్నారు.

  • 29 Dec 2020 11:28 AM (IST)

    కొత్త వైరస్‌ అతి వేగంగా వ్యాప్తి చెందే స్వభావంః శాస్త్రవేత్తలు

    ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్‌ కంటే.. ఈ జన్యు మార్పు చెందిన వైరస్‌ అతి వేగంగా వ్యాప్తి చెందే స్వభావాన్ని కలిగి ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతమున్న కరోనా వైరస్‌ వ్యాప్తి 30 శాతం ఉంటే.. ఈ కొత్త రకం వైరస్‌ వ్యాప్తి 40-70 శాతం ఉన్నట్లు తేలిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

  • 29 Dec 2020 11:26 AM (IST)

    ప్రపంచ దేశాలకు విస్తరిస్తున్న కొత్త వైరస్

    యూకేలో తొలిసారి వెలుగులోకి వచ్చిన ఈ వైరస్‌ ఇటలీ, డెన్మార్క్‌, నెదర్లాండ్స్‌, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాల్లోనూ విస్తరించడంతో సర్వత్రా భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. బ్రిటన్‌ నుంచి జరిగే అన్ని రాకపోకలపై అంక్షలు విధించాయి. విమాన సర్వీసులను రద్దు చేసుకున్నాయి.

  • 29 Dec 2020 11:22 AM (IST)

    సెప్టెంబరులోనే కరోనా వైరస్‌లో భారీ మార్పులు

    కరోనా వైరస్‌ ఇప్పటికే పలుసార్లు మార్పులు చెందగా.. సెప్టెంబరులో ఈ వైరస్‌లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఇదే క్రమంలో గణనీయమైన పరివర్తనాలు ప్రమాదకరంగా మారినట్లుగా బ్రిటన్‌ గుర్తించింది. శరీరంలో వృద్ధి చెందిన యాంటీబాడీస్‌ నుంచి కూడా ఇది తప్పించుకుంటుందని పరిశోధకులు కనుగొన్నారు.

  • 29 Dec 2020 11:18 AM (IST)

    అప్రమత్తమైన అధికారులు

    మార్పు చెందిన కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. తొలిదశలోనే అడ్డుకోవడానికి యుద్ధప్రాతిపదికన కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ శాఖ ఉన్నతాధికారులు అత్యవసరంగా సమావేశమయ్యారు. వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలపై చర్చించారు.

  • 29 Dec 2020 11:15 AM (IST)

    భారత్ లోకి ప్రవేశించిన యూకే కొత్త వైరస్

    యూకే వైరస్‌ ప్రవేశంపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. ఇప్పటిదాకా ఆరుగురికి కొత్త వైరస్ లక్షణాలు ఉన్నట్లు అధికారిక ప్రకటించింది. వివిధ రాష్ట్రాల్లో ఈ తరహాలో పరీక్షలు కొనసాగుతుండడంతో.. వాటన్నింటి ఫలితాలను సమీకరించి ఒకేసారి కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Published On - Dec 29,2020 1:39 PM

Follow us