త్వరలో సిటీ బస్సులు షురూ..!

లాక్ డౌన్ తో నిలిచిపోయిన హైదరాబాద్ సిటీ బస్సులు త్వరలో రోడ్డెక్కే పరిస్థితి కనిపిస్తుంది. ఈ మేరకు ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ఆర్టీసీ అధికారులతో మంత్రి పువ్వాడ అజయ్‌ సమావేశం.

  • Balaraju Goud
  • Publish Date - 6:13 pm, Wed, 3 June 20
త్వరలో సిటీ బస్సులు షురూ..!

లాక్ డౌన్ తో నిలిచిపోయిన హైదరాబాద్ సిటీ బస్సులు త్వరలో రోడ్డెక్కే పరిస్థితి కనిపిస్తుంది. ఈ మేరకు ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ఆర్టీసీ అధికారులతో మంత్రి పువ్వాడ అజయ్‌ సమావేశమయ్యారు. ఈ నెల 8 తేదీ నుంచి హైదరాబాద్‌లో సిటీ బస్సులు నడిపి అంశంపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. నగరంలో ఆర్టీసీ బస్సులను నడపాల్సి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై మంత్రి అధికారులతో చర్చించారు.
హైదరాబాద్‌లో 78 రోజులుగా సిటీ బస్సులు నిలిచిపోయాయి. దీంతో ఆర్టీసీ ఆదాయంపై భారీగా గండిపడింది. లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా ఇప్పటికే తెలంగాణలో కంటైన్మెంట్ జోన్లు మినహా అన్ని ప్రాంతాల్లో ప్రజా రవాణాకు అనుమతించారు. అయితే, గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో కరోనా తీవ్రత దృష్ట్యా జిల్లాల నుంచి వచ్చే బస్సులను తొలుత నగర శివార్లకే పరిమితం చేశారు. కొన్ని రోజులకు సిటీలోకి వచ్చేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గత నెల 27న తీసుకున్న నిర్ణయం మేరకు ఎంజీబీఎస్‌ వరకూ బస్సులు నడుస్తున్నాయి. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు రాత్రి వేళలోనూ ఆటోలకు అనుమతించారు. కానీ, హైదరాబాద్‌ పరిధిలో ఇప్పటి వరకూ సిటీ బస్సులు, మెట్రో రైళ్లకు ఇంకా అనుమతి ఇవ్వలేదు. ఇదిలా ఉంటే.. అంతర్ రాష్ట్ర రవాణాకు సంబంధించి కూడా మంత్రి చర్చించినట్లు సమాచారం.