ఇది ప్రజా తీర్పు కాదు.. ఏదో జరిగింది.. మహారాష్ట్ర ఫలితాలపై ఉద్దవ్ వర్గం అనుమానాలు
Maharashtra Election Result 2024 Updates: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి డబుల్ సెంచరీ దిశగా దూసుకుపోతోంది. మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్, ఉద్ధవ్ థాకరే వర్గం శివసేన, శరద్ పవార్ వర్గం ఎన్సీపీతో కూడిన మహా వికాస్ అఘాడీ ఘోర పరాభవాన్ని చెవిచూశాయి.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి డబుల్ సెంచరీని దాటి భారీ విజయం దిశగా దూసుకుపోతోంది. మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్, ఉద్ధవ్ థాకరే వర్గం శివసేన, శరద్ పవార్ వర్గం ఎన్సీపీతో కూడిన మహా వికాస్ అఘాడీ ఘోర పరాభవాన్ని చెవిచూశాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి 220 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. ఇండియా కూటమి 56 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. ఇతరులు 12 స్థానాల్లో ఆధిక్యంలో నిలుస్తున్నారు. మొత్తం 288 మంది సభ్యులతో కూడిన మహరాష్ట్ర అసెంబ్లీలో 145 మ్యాజిక్ ఫిగర్‌గా ఉంది. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తొలి ట్రెండ్స్‌పై ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన శివసేన (UBT) స్పందించింది. ఇది ప్రజా తీర్పు కాదని.. ఎక్కడో ఏదో తప్పు జరిగిందని UBT నేత సంజయ్ రౌత్ అనుమానం వ్యక్తంచేశారు. మొత్తం ఎన్నికల నిర్వహణ యంత్రాంగాన్ని మహాయుతి తన ఆధీనంలోకి తీసుకుందని ఆరోపించారు.
తాజా ట్రెండ్స్‌లో మహాయుతి (ఎన్డీయే కూటమి) 221 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, మహా వికాస్ అఘాడి కేవలం 55 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. ఈ ఫలితాలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ ఇది ప్రజల నిర్ణయం కాదని, ఎక్కడో ఏదో తప్పు జరిగిందని అన్నారు. మహారాష్ట్ర ప్రజల మనోభావాలు ఏంటో తమకు తెలుసన్నారు. ఈ ఫలితాలు మహారాష్ట్ర ప్రజల తీర్పు కాదన్నారు. ఏక్‌నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేనకు చెందిన అభ్యర్థులు అంత మంది ఎలా గెలుస్తారు? అని ప్రశ్నించారు.
2014, 2019లో జరిగిన రెండు లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష నేత హోదా దక్కకూడదని ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా కుట్ర చేశారని రౌత్ ఆరోపించారు. ఈసారి కూడా మహారాష్ట్రలో ప్రతిపక్ష నేత ఎవరూ ఉండకూడదన్న వ్యూహంతో అంతా చేశారని పేర్కొన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఎప్పటినుంచో బీజేపీ వ్యూహంగా ఉందని వ్యాఖ్యానించారు.