KKR second innings: క్రియాశీల రాజకీయాల్లోకి మళ్ళీ కిరణ్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఆఖరు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మొత్తానికి అఙ్ఞాతవాసం వీడారు. తిరిగి క్రియాశీల రాజకీయాల్లోకి ఎంటరయ్యారు. ఏకంగా ఏపీసీసీ థింక్ ట్యాంక్ సభ్యుడయ్యారు.

KKR second innings: క్రియాశీల రాజకీయాల్లోకి మళ్ళీ కిరణ్
Follow us

|

Updated on: Feb 22, 2020 | 5:59 PM

Former Chief Minister Kiran Kumar started second innings: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఆఖరు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మొత్తానికి అఙ్ఞాతవాసం వీడారు. తిరిగి క్రియాశీల రాజకీయాల్లోకి ఎంటరయ్యారు. ఏకంగా ఏపీ కాంగ్రెస్ థింక్ ట్యాంక్‌లో చోటు సంపాదించారు. తనకు అత్యున్నత పోస్టునిచ్చిన కాంగ్రెస్ పార్టీనే ఆయన తిరిగి ఎంచుకున్నారు.

సమైక్యాంధ్ర ప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయిన నల్లూరి కిరణ్ కుమార్ రెడ్డి.. రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు చివరి వరకు యత్నించిన సంగతి తెలిసిందే. తనకు రాజకీయ భిక్ష పెట్టి, సీఎం పదవినిచ్చిన కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి భిన్నంగా వ్యవహరించి.. చివరికి అదే ప్రయత్నంలో 2014 తొలినాళ్ళలో పార్టీని వీడారు కిరణ్ కుమార్ రెడ్డి. రాష్ట్ర విడిపోతున్న తరుణంలో పలువురు నవ్వుకుంటున్నా వెరవకుండా జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టి.. దానికి చెప్పు గుర్తు పెట్టుకుని పోటీ చేసి చతికిలా పడ్డారు కిరణ్.

2014 ఎన్నికల తర్వాత ఏపీ విడిపోవడం.. తెలంగాణా ఏర్పాటవడం జరిగిపోయాక చాలా కాలం కిరణ్ కుమార్ రెడ్డి ఎక్కడ వున్నారో కూడా తెలియని పరిస్థితి. అడపాదడపా.. హైదరాబాద్ కేబీఆర్ పార్కు దగ్గర మార్నింగ్ వాక్‌లో కనిపించడం తప్ప ఆయన క్రియాశీలకంగా వెలుగులోకి రాలేదు. కానీ 2019 ఎన్నికల సందర్భం నుంచి కిరణ్ కుమార్ రెడ్డి అయితే బీజేపీలో లేకపోతే కాంగ్రెస్ పార్టీలో చేరతారని, మళ్ళీ క్రియాశీలకంగా మారతారని ప్రచారం మొదలైంది.

ఒక దశలో ఏపీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపడతారని కూడా కథనాలొచ్చాయి. వాటిని తెరవెనుక నుంచే ఖండించిన కిరణ్ కుమార్ రాజకీయాల్లోకి పునరాగమనం చేయలేదు. తాజాగా ఏపీసీసీకి కొత్త అధ్యక్షునిగా మాజీ మంత్రి సాకె శైలజానాథ్‌ను నియమించిన నేపథ్యంలో ఆయన తన జట్టును ఏర్పాటు చేసుకున్నారు. భారీ జాబితాతో రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడంతోపాటు ఓ థింక్ ట్యాంక్‌ని కూడా నియమించారు. అందులో ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితోపాటు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పేరు కూడా కనిపించడంతో పలువురు ఆశ్చర్యపోయారు.

ఈ నేపథ్యంలోనే కిరణ్ కుమార్ మళ్ళీ క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారని స్ఫష్టమైంది. అయితే.. ఆయన ఏ మేరకు రాజకీయాలు చేస్తారన్నది ఇప్పుడే తెలియని పరిస్థితి. ఎందుకంటే.. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పునర్వైభావాన్ని పొందడం ఇప్పట్లో సాధ్యం కాదని పలువురు భావిస్తున్న నేపథ్యంలో కిరణ్ కుమార్ పాత్ర ఎలా వుండబోతోందన్నది ఆసక్తి రేపుతోంది.