కన్నాకు గ్రీన్ సిగ్నల్.. బాబుకు రెడ్ సిగ్నల్.. ఎందుకో తెలుసా?

కన్నాకు గ్రీన్ సిగ్నల్.. బాబుకు రెడ్ సిగ్నల్.. ఎందుకో తెలుసా?

విశాఖలో ఊహించని విషాదం. ఎల్జీ పాలిమిర్స్ కంపెనీలో స్టైరిన్ గ్యాస్ లీకేజ్ తో 12 మంది నిండు ప్రాణాలు గాలిలో కలిశాయి. మరికొందరిని ఆసుపత్రి పాలు చేసింది. ఈ సంగతి తెలిసిన వెంటనే విశాఖకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, మంత్రులు బాధితులను పరామర్శించారు.

Rajesh Sharma

| Edited By: Anil kumar poka

May 08, 2020 | 3:20 PM

విశాఖలో ఊహించని విషాదం. ఎల్జీ పాలిమిర్స్ కంపెనీలో స్టైరిన్ గ్యాస్ లీకేజ్ తో 12 మంది నిండు ప్రాణాలు గాలిలో కలిశాయి. మరికొందరిని ఆసుపత్రి పాలు చేసింది. ఈ సంగతి తెలిసిన వెంటనే విశాఖకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, మంత్రులు బాధితులను పరామర్శించారు. చనిపోయిన వారి కుటుంబానికి ఒక్కోక్కరికి రూ.1 కోటి సాయంగా సిఎం ప్రకటించిన సంగతి తెలిసిందే. చికిత్స పొందుతున్న వారి కుటుంబాలకు భరోసానిచ్చారు. మరోవైపు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడ విశాఖకు వెళ్లారు. ఆసుపత్రిలో బాధితులను పరామర్శించడంతో పాటు..సంఘటన ప్రాంతాన్ని సందర్శించారు. వెంకటాపురంతో పాటు..గ్యాస్ లీకేజ్ అయిన గ్రామాల ప్రజలతో మాట్లాడి వారిలో ధైర్యం నూరిపోసే ప్రయత్నం చేశారు. ఆయనే కాదు..కమ్యూనిస్టు నేతలు అక్కడకు వెళ్లారు. స్థానిక టీడీపీ, వైసీపీ నేతలు వెళుతున్నారు. వారికి అండగా ఉంటున్నారు. సేవలందిస్తున్నారు. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు అక్కడకు వెళ్లేందుకు సిద్దమైనా వెళ్లలేకపోయారు. అసలు ఆయన్ను ఎందుకు వెళ్లలేకపోయారు. ఏంటనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.

ఎందుకంటే…

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. జడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీలో ఉన్నారు. కరోనాతో అంతా లాక్ డౌన్ లో ఉంది. లాక్ డౌన్ విధించక ముందు అమరావతి నుంచి హైదరాబాద్ కు వచ్చారు చంద్రబాబు. ఆయన కుమారుడు నారా లోకేష్ లు ఇంటికే పరిమితమయ్యారు. మరో ప్రాంతానికి వెళ్లలేదు. పార్టీ కార్యక్రమాలన్నీ ఆన్ లైన్ లోనే నిర్వహిస్తున్నారు చంద్రబాబు. ఇంటి నుంచి బయటకు రా దమ్ముంటే ఊరికే మాటలెందుకు అంటూ ఆయన వైరి వర్గం నేతలు సవాళ్లు విసురుతోంది. వారి మాటలను లైట్ తీసుకున్నారు చంద్రబాబు. ఇలాంటి సమయంలోనే ఘోర దుర్ఘటన జరిగింది. అంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో గ్యాస్ లీకేజ్ తో వందల మంది ఊపిరాడక ఆసుపత్రికి వెళ్లారు. ఏం జరిగిందో ఇంకా వారికి తెలియడం లేదు. మరికొందరు ఆ భయం నుంచి ఇంకా తేరుకోవడం లేదు. ఇలాంటి సమయంలో ప్రతిపక్ష నేతగా వారిని పరామర్శించడం తన బాధ్యతగా భావించారు బాబు. తాను ఉంటున్నది తెలంగాణ రాష్ట్రంలో వెళ్లాల్సింది ఆంధ్రప్రదేశ్ కు. అందులోను ఇప్పుడు విమానాలు గానీ…హెలికాప్టర్లు గానీ అందుబాటులో లేవు. రవాణా సదుపాయం లేదు. రోడ్డు మార్గాన వెళ్లడం అంత తేలిక కాదు. లాక్ డౌన్ సమయంలో తాను అలా రోడ్డు మార్గాన వెళ్లాలన్నా రెండు రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి. అదే సమయంలో చంద్రబాబుకు దారి పొడవునా సెక్యూరిటీ కల్పించాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది అంత తేలికైనా విషయం కాదు. అందుకే చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వాల కంటే కేంద్రం అనుమతి కావాలనుకు్నారు. అందుకే కేంద్రానికి లేఖ రాశారు.

లేఖల పర్వం…

ఏపీలో ప్రభుత్వ పాలనలోని లోపాలను ఎత్తి చూపేందుకు లేఖల అస్త్రాన్ని ఎంచుకున్న చంద్రబాబు ఇప్పుడు తన పర్యటనకు అదే బాణాన్ని ప్రయోగించారు. విశాఖ దుర్ఘటన అసాధారణమైంది. ఆ ప్రాంతాన్ని సందర్శించి బాధితుల పరామర్శించాలి. అందుకు అనుమతి ఇవ్వాలని చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దీని పై ఇప్పటి వరకు ఎలాంటి అనుమతులు రాలేదు. కానీ నిన్ననే చంద్రబాబుకు అనుమతులు వచ్చాయంటూ ఊదరగొట్టింది ఓ వర్గం మీడియా. మిగతా మీడియాకు లీకులిచ్చింది. సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం సాగింది. అది చూసి చంద్రబాబుకు అనుమతులు వచ్చాయా అని ఆయన అనుచరులు ఆరా తీసేంత వరకు వెళ్లింది విషయం. అసలు సంగతి తెలుసుకుని గమ్మునున్నారు. హైదరాబాద్‌లో ఉన్న చంద్రబాబు విశాఖ వెళ్లాలంటే ప్రత్యేక విమానం అవసరం. చంద్రబాబునే స్వయంగా విమానాన్ని అద్దెకు తీసుకున్నా…అది ముంబై నుంచి గానీ మరో ప్రాంతం నుంచి కానీ రావాల్సి ఉంది. ఒకవేళ బాబుకు అనుమతి లభిస్తే ఆ విమానం ముంబై నుంచి హైదరాబాద్ రావాలి. అక్కడి నుంచి విశాఖ వెళ్లాలి. తిరిగి హైదరాబాద్‌ మీదుగా ముంబై చేరుకోవాలి. ఇదంతా పెద్ద ప్రాసెస్. ఇందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. అందుకే చంద్రబాబు ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి పి.కె.మిశ్రాకు లేఖ రాశారు. దీనిపై కేంద్రం అసలు స్పందించలేదు. ప్రస్తుతం విశాఖలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఇలాంటి సమయంలో పెద్ద ఎత్తున అక్కడకు వెళ్లడం ఎందుకు అనుకుంటే చంద్రబాబును ఇప్పట్లో అనుమతించక పోవచ్చు. ఇప్పుడు విశాఖలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే 11 కేసులు వచ్చాయి. ఆ కోణంలోను కేంద్రం పరిశీలిస్తోంది.

కన్నాకు నిబంధనలు వర్తించవా….

మొగుడు కొట్టినందుకు కాదు. తోడికోడలు నవ్వినందుకు అనే సామెత ఉంది. అచ్చం అలా కాకపోయినా కాస్త అటు ఇటుగా ఉంది ఏపీలో రాజకీయ తీరు. తమను అనుమతించలేదు. ఓకే. కానీ బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను ఎందుకు వెెళ్ళనిచ్చారని వాదిస్తోంది మరోవైపు టీడీపీ. కన్నా విజయవాడలో ఉన్నారు. ఏపీలోనే ఉన్నారు కాబట్టి డిజిపి అనుమతించారు. కానీ చంద్రబాబు తెలంగాణలో ఉన్నారు. అందులోను బాబు వైజాగ్ కు వెళ్లాలంటే అటు మహారాష్ట్ర, తెలంగాణ, ఇటు ఏపీ ప్రభుత్వాల అనుమతులు కావాలి. మూడు రాష్ట్రాల అనుమతులతో పాటు..కేంద్రం ఒప్పుకోవాలి. అందుకే ఇన్ని తతంగాలు ఎందుకనే ఆలోచనతో చంద్రబాబు పర్యటనకు కేంద్రం పచ్చ జెండా ఊపలేదనే చర్చ సాగుతోంది. అందులోను మాజీ ముఖ్యమంత్రి కావడంతో చంద్రబాబు వచ్చిన చోటుకు జనాలు పెద్ద ఎత్తున వస్తారని..కరోనా వ్యాపించే ప్రమాదముందని ఆలోచిస్తోంది కేంద్రం. అందుకే అనుమతులు ఇవ్వలేదనే వాదన లేకపోలేదు.

తాను విశాఖ వెళ్లేందుకు అనుమతి కోరానని చంద్రబాబు మీడియా సాక్షిగా చెప్పినా..కేంద్రం స్పందించ లేదు. అదే సమయంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్‌ గోయల్‌కు చంద్రబాబు లేఖ రాశారు. ‘ఈ సంఘటనలో మరణాలు తక్కువగా ఉన్నా గ్యాస్‌ లీకేజితో అస్వస్ధతకు గురైన వారు రెండు వేల మంది వరకూ ఉన్నారు. గ్యాస్‌ లీకేజీ బాధితులకు వైద్య సేవలు అందించడానికి విశాఖలో ప్రత్యేక వైద్య నిపుణులు లేరు. అందుకని…జాతీయ స్థాయిలో నిపుణులను గుర్తించి పంపాలని కోరారు. అంతే కాదు…విదేశాల నుంచి కూడా కొందరిని సమకూర్చుకుని వైద్య బృందాన్ని విశాఖకు పంపాలని లేఖలో కోరడం విశేషం.

రాజకీయ కోణం…

బాధితులకు ప్రకటించిన ప్యాకేజ్ ను చూసి విపక్షాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. కోటి రూపాయలు చనిపోయిన వారి ఒక్కో కుటుంబానికి ఇవ్వడం అంటే మాటలు కాదు. గతంలో ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున సాయం ప్రకటించలేదు ప్రభుత్వాలు. ఈ విషయంలో విపక్షాల నుంచి విమర్శలు రాకుండా సిఎం జగన్ ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారనే చెప్పాలి. కానీ రేపు మరేదైనా అనుకోని సంఘటన జరిగితే ఇంత పెద్ద మొత్తంలోను ఇవ్వాలని బాధిత కుటుంబాలు, నేతలు డిమాండ్ చేసే వీలుంది. అది ఇబ్బందిగా మారుతుందని నిజం. నిర్వహణ లోపం, నిర్లక్ష్యంతో ప్రజల ప్రాణాలు తీసిన ఎల్జీ పాలిమర్స్ కంపెనీ పై సాధారణ కేసులు పెట్టారని..వారితో ప్రభుత్వం కుమ్మక్కైందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. దీనికి వైసీపీ గట్టి కౌంటరే ఇచ్చింది. గతంలో చంద్రబాబు చేయలేని పనిని తాము చేశాం. బాధితులకు పెద్ద మొత్తంలో సాయం చేస్తున్నాం. వారికి అండగా ఉంటామని చెబుతున్నారు ఫ్యాన్ పార్టీ గుర్తు నేతలు. ఫలితంగా కరోనానే కాదు..విశాఖ ఘటన వేసవిలో రాజకీయ వేడిని రగిలిస్తోంది.

  • కొండవీటి శివనాగ్ రాజు సీనియర్ జర్నలిస్టు, టీవీ-9.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu