విడాకులయ్యాక పెళ్ళి రోజు పండగా ?

విడాకులయ్యాక పెళ్ళి రోజు పండగా ?

ఆంధ్ర అవతరణ దినోత్సవంగా నవంబర్ 1 న జరపాలని చెప్పి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సరైందికాదని భావిస్తున్నాను. ఎందుకంటే ఎందరో మహనీయుల త్యాగఫలంగా, వారి పోరాట ఫలితంగా 1953 అక్టోబర్ 1వ తారీఖున ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగింది. 1913లో బాపట్లలో జరిగిన ప్రథమాంధ్ర మహాసభ తర్వాత అనేక పోరాటాలు, ఆత్మత్యాగాలు జరిగిన పిదప, ఢిల్లీ పాదుషాలను ఎదిరించి పోరాటం సాగించి ఆఖరికి రాష్ట్ర అవతరణ అక్టోబర్ ఒకటో తారీఖున సాధించుకున్నాం. గత […]

TV9 Telugu Digital Desk

| Edited By: Anil kumar poka

Oct 18, 2019 | 3:53 PM

ఆంధ్ర అవతరణ దినోత్సవంగా నవంబర్ 1 న జరపాలని చెప్పి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సరైందికాదని భావిస్తున్నాను. ఎందుకంటే ఎందరో మహనీయుల త్యాగఫలంగా, వారి పోరాట ఫలితంగా 1953 అక్టోబర్ 1వ తారీఖున ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగింది. 1913లో బాపట్లలో జరిగిన ప్రథమాంధ్ర మహాసభ తర్వాత అనేక పోరాటాలు, ఆత్మత్యాగాలు జరిగిన పిదప, ఢిల్లీ పాదుషాలను ఎదిరించి పోరాటం సాగించి ఆఖరికి రాష్ట్ర అవతరణ అక్టోబర్ ఒకటో తారీఖున సాధించుకున్నాం.

గత ఐదు సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం కచ్చితంగా జరపాలని మేము డిమాండ్ చేసినా, గత చంద్రబాబు ప్రభుత్వం విస్మరించింది. తప్పూ అని చెబుతున్నా వినకుండా నవనిర్మాణ దీక్షలని జూన్2 నుంచి చేశారు. మేము ఈసారి కొత్త ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అక్టోబర్ 1న రాష్ట్ర అవతరణదినోత్సవంగా జరపాలని ముందే వినతిపత్రం పంపించాము. వారు స్పందించకపోతే ఆ రోజున కీ.శే. పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి, తెలుగుతల్లి విగ్రహానికి పూలమాలలు వేసి, సమావేశం నిర్వహించాము.

ఇవాళ కొత్తగా ప్రభుత్వం వారు ఒక వాదన తీసుకువచ్చారు. దిల్లీ కేంద్రప్రభుత్వం పాత అవతరణ దినోత్సవాన్ని జరపాలని చెప్పిందని, అప్పుడే బ్రాండ్ ఇమేజ్ ఉంటుందనేది తీసుకు వచ్చారు, కానీ పాత అవతరణ దినోత్సవం అంటే అక్టోబర్ 1 అనేది మరచారు. ఉదాహరణకి ఒకటి అనుకుందాం… ఆంధ్రాకి అక్టోబర్1 పుట్టినరోజు అయితే తెలంగాణతో పెళ్లిరోజు నవంబర్ 1. తెలంగాణతో విడాకుల దినం జూన్ 2. ఆంధ్రరాష్ట్రానికి సంబంధించి జూన్ రెండో తారీకున విడాకులు జరిగేవరకూ వివాహ దినోత్సవం జరుపుకుంటారు. కానీ విడాకులు అయిపోయిన తర్వాత కూడా వివాహ దినం జరుపుకోవడంలో అర్థం లేదు అనేది స్పష్టంగా ఎవరికైనా అర్థం అవుతుంది.

ఆరోజు ఆంధ్రరాష్ట్రంలో తెలంగాణ విలీనం జరిగినప్పుడు హైదరాబాదు రాజధానిగా ఆంధ్రప్రదేశ్ అవతరించింది, అలాగే తెలంగాణ ప్రాంతం కలిసింది. కానీ ఈరోజు ఆ రాజధాని హైదరాబాదు ఆంధప్రదేశ్‌లో లేదు.. ఆ తెలంగాణ భూభాగమూ ఆంధ్రరాష్ట్రంలో లేదు. అలాంటప్పుడు నవంబర్ 1న అవతరణ అనడంలో అర్థం లేదు కదా ? కేవలం మధ్యలో మనకు దిల్లీ హిందీ పాలకులు బలవంతంగా తగిలించిన హిందీ తోక (ప్రదేశ్) కర్మ కొద్దీ వేలాడుతుంది. అయితే అవతరణ దినాల వల్ల ఆంధ్రప్రదేశ్‌కి ఆర్ధికంగా పెద్దగా వచ్చిందీ లేదు.. అలాగనీ పోయేదీ ఏమీ లేదు అని కొందరు అన్నది కొంతవరకూ నిజమే. కానీ ఒకటి స్పష్టం.. వస్తు, కనక, వాహన లేదా బహు దారిద్ర్యములు ఉన్నా ఫర్వాలేదు గానీ, భావదారిద్ర్యము ఉండకూడదు అన్న పెద్దల మాట అత్యంత ముఖ్యమైనది.

Disclaimer: ఈ ఆర్టికల్‌లో రచయిత వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఆయన వ్యక్తిగతమైనవి. అవి టివీ9 వెబ్‌సైట్ అభిప్రాయాలుగా పరిగణించవద్దని మనవి.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu