రైతులను అడ్డగించేందుకు హర్యానా పోలీసుల ‘వినూత్న ప్రయోగం’, రోడ్లు, కందకాలే తవ్వేశారు

రైతు చట్టాలకు నిరసనగా ఢిల్లీ దిశగా వెళ్తున్న రైతులను అడ్డగించేందుకు హర్యానా పోలీసులు వినూత్న ప్రయోగం చేపట్టారు. రాష్ట్ర సరిహద్దు సమీపంలో పలు చోట్ల రోడ్లు, భారీ కందకాలను తవ్వేశారు.

రైతులను అడ్డగించేందుకు హర్యానా పోలీసుల 'వినూత్న ప్రయోగం', రోడ్లు, కందకాలే తవ్వేశారు
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Nov 27, 2020 | 1:35 PM

రైతు చట్టాలకు నిరసనగా ఢిల్లీ దిశగా వెళ్తున్న రైతులను అడ్డగించేందుకు హర్యానా పోలీసులు వినూత్న ప్రయోగం చేపట్టారు. రాష్ట్ర సరిహద్దు సమీపంలో పలు చోట్ల రోడ్లు, భారీ కందకాలను తవ్వేశారు. ఇంకా హెవీ ట్రక్కులను నిలపడమే గాక, ఇనుప తీగెల కంచెలను, ఇసుక బస్తాలు నింపిన భారీ వాహనాలను, ఇనుప కంచెలు చుట్టిన బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. హర్యానా లోని బీజేపీ ప్రభుత్వం ఇలా అన్నదాతల ‘ఢిల్లీ చలో’ ఆందోళనను అడ్డుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేసింది. భారీగా పోలీసు బలగాలను మోహరించింది. గురువారం అనేక చోట్ల పోలీసులు వీరిపైకి బాష్పవాయువు, వాటర్ క్యానన్లను ప్రయోగించినా రైతులు బెదరలేదు. వారిపై రాళ్లు, ఇటుక పెళ్లలు విసిరారు. వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సుమారు 2 గంటలపాటు వారికీ, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది.

పోలీసులు తవ్విన లోతైన గుంతలు, కందకాలను చూసిన రైతులు సాయంత్రానికి వాటిని దాటేసుకుని ముందుకు కదిలారు. పంజాబ్ నుంచి వీరి మార్చ్ ను అడ్డగించడమే కాక, వారి ప్రదర్శనను జాప్యం చేసేందుకు  తాము ఈ ప్రయత్నం చేశామని ఓ పోలీసు అధికారి తెలిపారు. కురుక్షేత్ర వద్ద కూడా ఈ విధమైన బ్లాకేడ్లను ఏర్పాటు చేసినట్టు ఆయన చెప్పారు. కరోనా వైరస్ లాక్ డౌన్ సమయంలో వలస కార్మికులు తమ రాష్ట్రాల్లోకి రాకుండా చూసేందుకు కొన్ని ప్రభుత్వాలు  లోగడ ఈ విధమైన ప్రయోగాలు చేశాయి. ఏపీతో గల ఒడిషా బోర్డర్లో పోలీసులు రోడ్లను తవ్వేసిన వీడియో ఆ మధ్య వైరల్ అయింది.

ఇలా ఉండగా ఢిల్లీని చేరుతున్న రైతులు మరింత ఉత్సాహంతో కదులుతున్నారు. మధ్యమధ్య గల బ్యారికేడ్లను ధ్వంసం చేస్తూ  ఒక ఉద్యమ బాటనే పట్టారు. వేలాది అన్నదాతల ఆందోళనను అదుపు చేసేందుకు కేంద్రం అన్ని ప్రయత్నాలు చేస్తుండగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాత్రం..వీరిశాంతియుత నిరసన ప్రదర్శనను అడ్డుకోవడం సముచితం కాదని ట్వీట్ చేశారు. తమ ప్రొటెస్ట్ తెలపడానికి వారికి రాజ్యాంగ పరంగా హక్కు ఉందని ఆయన పేర్కొన్నారు.