త్వరలో థియేటర్లకు గ్రీన్ సిగ్నల్.. కారణమిదే

కరోనా నేపథ్యంలో వచ్చిన లాక్ డౌన్ కారణంగా మూతపడిన సినిమా థియేటర్లను తెరిచే దిశగా అడుగులు పడుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. నిర్దిష్టమైన మార్గదర్శకాలను పాటించేందుకు థియేటర్ ఓనర్లు సిద్ధపడడంతో థియేటర్లను తెరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం ...

  • Rajesh Sharma
  • Publish Date - 3:31 pm, Wed, 27 May 20
త్వరలో థియేటర్లకు గ్రీన్ సిగ్నల్.. కారణమిదే

కరోనా నేపథ్యంలో వచ్చిన లాక్ డౌన్ కారణంగా మూతపడిన సినిమా థియేటర్లను తెరిచే దిశగా అడుగులు పడుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. నిర్దిష్టమైన మార్గదర్శకాలను పాటించేందుకు థియేటర్ ఓనర్లు సిద్ధపడడంతో థియేటర్లను తెరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. శాస్త్రీయంగా చూసినా థియేటర్లను తెరవడం వల్ల పెద్దగా రిస్క్ లేదని కొందరు డాక్టర్లు కూడా చెబుతున్నారు.

సినిమా షూటింగులు, థియేటర్ల ఓపెనింగ్ తదితర అంశాలపై సినీ ప్రముఖులతో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం సమావేశమయ్యారు. నిర్మాతలు కళ్యాణ్, దిల్ రాజు, డైరెక్టర్ శంకర్, మా అద్యక్షుడు నరేష్, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ రాంమోహన్ రావు, జీవిత, పలువురు నిర్మాతలు, ఎగ్జిబిటర్స్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

లాక్ డౌన్‌తో సినిమా, టీవీ సీరియల్స్ షూటింగులు నిలిచిపోయి లక్షలాది మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిని ప్రముఖులు మంత్రికి వివరించారు. సినీ రంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలను తీసుకుంటుందని మంత్రి వారికి భరోసా ఇచ్చారు. పోస్ట్ ప్రొడక్షన్ చేసుకునేందుకు సంబంధించి ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, షూటింగులు, థియేటర్స్ ఓపెనింగులకు సంబంధించి పరిశీలించి తగు నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి చెప్పారు.

మే 28 వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీతో సినీ రంగంలోని పలు విభాగాలకు చెందిన ప్రముఖులతో సమావేశం జరుగుతుందని, దాంట్లో ప్రీకాషన్స్‌పైనే ప్రధానంగా చర్చిస్తామని మంత్రి తనతో భేటీ అయిన సినీ ప్రముఖులకు తెలిపారు. అయితే, థియేటర్లను తెరిస్తే కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం వుందంటూ వ్యక్తమవుతున్న అనుమానాలపై ప్రభుత్వం వైద్య వర్గాల సూచనలను పరిగణనలోకి తీసుకుంటుందని తెలుస్తోంది.

ఓ స్టడీ ప్రకారం షాపింగ్ మాల్స్, మత సంబంధమైన సదస్సులు, సంగీత కార్యక్రమాల కంటే థియేటర్లను తెరవడం వల్ల పెద్దగా ప్రమాదం లేదని తెలుస్తోంది. మౌఖిక సంభాషణలకు పెద్దగా అవకాశం వున్న మత సంబంధమైన సదస్సులు, రాజకీయ ప్రోగ్రాములు, సంగీత కార్యక్రమాలను నిర్వహిస్తే కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు 20 నుంచి 22 శాతం వుండగా.. థియేటర్లలో కొన్ని ప్రీకాషన్స్ తీసుకుంటే కరోనా విస్తరించే అవకాశాలు కేవలం 2 శాతమేనని తెలుస్తోంది. ఈ క్రమంలో నిర్దిష్టమైన షరతులు, ముందు జాగ్రత్త చర్యలతో థియేటర్లను తెరుచుకునే అవకాశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. ఇంకొన్ని రోజుల్లోనే తెలంగాణ వ్యాప్తంగా వెండితెరకు పూర్వకళ వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.