ఆసుపత్రిపై పూల వర్షం.. ఆదివారమే ముహూర్తం

ఆసుపత్రిపై పూల వర్షం.. ఆదివారమే ముహూర్తం

కరోనా వైరస్‌పై ఎడతెగని పోరాటంలో కీలకమైన వేదికగా మారిన గాంధీ ఆసుపత్రిపై పూలవర్షం కురవబోతుంది. గత నలభై రోజులుగా కరోనా వైరస్ నియంత్రణ చర్యలకు, కరోనా వైరస్ బారిన పడిన రోగులకు సేవలు అందించేందుకు గాంధీ ఆసుపత్రి వైద్య సిబ్బంది చేస్తున్న కృషి అంతా ఇంతా కాదు.

Rajesh Sharma

|

May 02, 2020 | 3:34 PM

కరోనా వైరస్‌పై ఎడతెగని పోరాటంలో కీలకమైన వేదికగా మారిన గాంధీ ఆసుపత్రిపై పూలవర్షం కురవబోతుంది. గత నలభై రోజులుగా కరోనా వైరస్ నియంత్రణ చర్యలకు, కరోనా వైరస్ బారిన పడిన రోగులకు సేవలు అందించేందుకు గాంధీ ఆసుపత్రి వైద్య సిబ్బంది చేస్తున్న కృషి అంతా ఇంతా కాదు. అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో సైతం.. క్లిష్ట పరిస్థితులను అధిగమించేందుకు గాంధీ ఆసుపత్రి సిబ్బంది చేస్తున్న కృషి వల్ల ఎందరికో ప్రాణదానం లభిస్తోంది. ఈ నేపథ్యంలో గాంధీ ఆసుపత్రి వైద్య సిబ్బందికి అభినందనలు తెలపడానికి ఎయిర్‌ఫోర్స్ ముందుకొచ్చింది.

దేశ వ్యాప్తంగా వైద్య సిబ్బంది, పోలీసులు ఈ లాక్ డౌన్ పీరియడ్‌లో.. కరోనా వైరస్ నియంత్రణ చర్యలను పాలు పంచుకుంటున్న ఈ విషయంపై త్రివిధ దళాధిపతులు శుక్రవారం చర్చించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హకీంపేటలోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అధికారులు గాంధీ ఆసుపత్రిపై పూల వర్షం కురిపించడం ద్వారా అక్కడ నిరంతరం శ్రమిస్తున్న వైద్య సిబ్బందికి అభినందనలు తెలపాలని నిర్ణయించారు. ఎయిర్ ఫోర్స్ స్టేషన్ హెలికాప్టర్ల ద్వారా గాంధీ ఆసుపత్రిపై ఆదివారం మే 3వ తేదీ ఉదయం తొమ్మిదిన్నర గంటలకు పూల వర్షం కురిపించాలని తలపెట్టారు. ఇందుకోసం ఎయిర్ ఫోర్స్‌కు చెందిన హెలికాప్టర్లను వినియోగించ బోతున్నారు.

గాంధీ ఆసుపత్రి ఆవరణలోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద డాక్టర్లు. నర్సులు. తెలంగాణ పోలీసు అధికారులు, మినిస్టీరియల్, పారామెడికల్, 4వ తరగతి సిబ్బంది, భద్రతా సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది సహా అందరూ హాజరు కావాలని ఎయిర్‌ఫోర్స్ అధికారులు కోరారు. పూర్తి యూనిఫాంలో వీరంతా హాజరైన సందర్భంలో వారిపై హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం కురిపించడం ద్వారా అభినందనలు తెలియజేయాలని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నిర్ణయించింది. ఎయిర్ ఫోర్స్ అధికారుల సూచన మేరకు ఇదివరకే పేర్కొన్న సిబ్బంది అందరూ తమ యూనిఫాంలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద హాజరు కావాలని.. ఎయిర్ ఫోర్స్ అందించే ప్రశంశలను అందుకోవాలని గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ కోరారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu