టెలికాం కంపెనీస్ ఫైట్… ట్రాయ్‌కి చేరిన పంచాయితీ… ఎయిర్‌టెల్, ఐడియా వోడాఫోన్‌పై జియో ఫిర్యాదు…

టెలికాం కంపెనీల మధ్య కోల్డ్‌వార్ కొనసాగుతోంది. మొన్నటి వరకు 5జీ సేవల విషయంలో పరస్పరం విమర్శించుకున్న జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా తాజాగా బహిరంగంగా ఒకరిని మరొకరు విమర్శించుకుంటున్నారు.

  • Gandu Raju
  • Publish Date - 9:59 am, Tue, 15 December 20
టెలికాం కంపెనీస్ ఫైట్... ట్రాయ్‌కి చేరిన పంచాయితీ... ఎయిర్‌టెల్, ఐడియా వోడాఫోన్‌పై జియో ఫిర్యాదు...

టెలికాం కంపెనీల మధ్య కోల్డ్‌వార్ కొనసాగుతోంది. మొన్నటి వరకు 5జీ సేవల విషయంలో పరస్పరం విమర్శించుకున్న జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా తాజాగా బహిరంగంగా ఒకరిని మరొకరు విమర్శించుకుంటున్నారు. ఆరోపణలకు దిగుతున్నారు. టెలికాం కంపెనీల పంచాయితీ కాస్తా ట్రాయ్ దాకా పోయింది. తనకు వ్యతిరేకంగా విషపూరిత, వేర్పాటు వాద ప్రచారానికి అవి దిగాయని జియో ఆరోపిస్తోంది.

 

జియో మొబైల్‌ నంబర్లను తమ నెట్‌వర్క్‌లకు పోర్ట్‌ చేసుకోవడం రైతుల ఆందోళనలకు మద్దతు పలికినట్టు అవుతుందంటూ ఎయిర్‌టెల్ ప్రచారం నిర్వహిస్తున్నాయని జియో ఆరోపించింది. ఉద్యోగులు, ఏజెంట్లు, రిటైలర్ల ద్వారా సదరు సంస్థలు ఈ చర్యలకు పూనుకుంటున్నట్టు తెలిపింది. ఈ మేరకు జియో టెలికం నియంత్రణ సంస్థ(ట్రాయ్‌)కు లేఖ రాసింది. ఆ రెండు కంపెనీల చర్యలు జియో ఉద్యోగుల భద్రత, రక్షణకు హాని కలిగిస్తాయని, వాటికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవాలని ట్రాయ్‌ను కోరింది. జియో ఆరోపణలను ఆధార రహితమంటూ భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియా (వీఐ) ఖండించాయి. పెద్ద ఎత్తున పోర్ట్‌ అభ్యర్థనలు తనకు వస్తున్నాయంటూ.. కస్టమర్లు ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియా పోర్టింగ్‌ ప్రచారాన్ని పేర్కొంటున్నారంటూ వివరించింది. వ్యవసాయ రంగానికి సంబంధించి కేంద్రం రూపొందించిన నూతన చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో పంజాబ్, హర్యానా, యూపీ రాష్ట్రాల రైతులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే.

ఆధారరహిత ఆరోపణలు…

జియో ఆధారరహిత ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు భారతీ ఎయిర్‌టెల్‌ ట్రాయ్‌కు లేఖ రూపంలో తెలియజేసింది. తాము ఎల్లప్పుడూ వ్యాపారాన్ని విలువలతో, పారదర్శకంగా నిర్వహించేందుకే కట్టుబడి ఉన్నట్టు ప్రకటించుకుంది. ఏ మాత్రం వాస్తవం లేని ఆరోపణలుగా వీటిని వొడాఫోన్‌ ఐడియా పేర్కొంది. తమ ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశ్యంతో చేసినవిగా పేర్కొంటూ.. విలువలతో కూడిన వ్యాపార నిర్వహణనే తాము విశ్వసిస్తామని స్పష్టం చేసింది.