Extraordinary Indian Woman: 50 పైసలతో జర్నీ షురూ.. నేడు 14 కోట్ల టర్నోవర్.. సాధించిందో మహిళ

కష్టపడే తత్వం ఉండి కాలం కలిసి వస్తే పది పైసలతో జర్నీ మొదలు పెట్టి ఐదేళ్ళలో యాభైలక్షలకు యజమానిగా మారిన నేపధ్యాన్ని ఛాలెంజ్ సినిమాలో చూశాం.. మరి ఓ మహిళ నిజ జీవితంలో ఆచరించింది..

Extraordinary Indian Woman: 50 పైసలతో జర్నీ షురూ.. నేడు 14 కోట్ల టర్నోవర్.. సాధించిందో మహిళ
Follow us

|

Updated on: Feb 01, 2021 | 1:45 PM

Extraordinary Indian Woman: కృషి ఉంటె మనుషులు ఋషులవుతారు.. మహాపురుషులవుతారు అన్నాడో మహాకవి.. పట్టుదలతో పనిచేస్తే సాధించలేదని ఏమీ లేదు ఈ మాటలను కొంత మంది నమ్ముతారు.. తమకున్న చిన్నపాటి సదుపాయాలనే అవకాశాలుగా మార్చుకుని ఆకాశమే హద్దుగా ఎదుగుతారు. చదువు, ఆర్ధిక ఆలంబన ఉండి ఏం చేయలేక పోతున్నామని నిరాశావాదులకు ఇలాంటివారు ఆదర్శంగా నిలుస్తారు. అవును కష్టపడే తత్వం ఉండి కాలం కలిసి వస్తే పది పైసలతో జర్నీ మొదలు పెట్టి ఐదేళ్ళలో యాభైలక్షలకు యజమానిగా మారిన నేపధ్యాన్ని ఛాలెంజ్ సినిమాలో చూశాం.. మరి ఓ మహిళ నిజ జీవితంలో ఆచరించింది.. వారానికి యాభై పైసలు దాచుకుంటూ.. నెలకు రూ. 20 జమ చేస్తూ.. ఈ చిన్న మొత్తంతో ఇప్పుడు కొన్ని కోట్ల టర్నోవర్ చేసే బిజినెస్ ఉమెన్ గా మారింది. కాకపోతే ఈ మహిళ తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆమె కాదు.. మధ్యప్రదేశ్ కు చెందిన ఆదివాసీ మహిళ సక్సెస్ స్టోరీని ఈరోజు తెలుసుకుందాం..!

మధ్యప్రదేశ్‌లోని దిందోరి జిల్లాలోని బార్గాలోని అగారియా తెగకు చెందిన పేద ఆదివాసీ రైతు కుటుంబంలో చంద్రకాళి జన్మించింది. ఈ తెగకు చెందిన వారు బాహ్యప్రపంచానికి దూరంగా అడవుల్లో జీవిస్తుంటారు. వీరికి వర్షం మీద ఆధారపడి సేద్యం చేయడమే తెలుసు. పంటలు సరిగ్గా పండడంలేదని చంద్రకాళి అన్నయ్యలు అడవిని వదిలిని నగరానికి పయనమయ్యారు. వారితో పాటు వెళ్లిన చంద్రకాళి ఐదోతరగతి వరకూ విద్యనభ్యసించింది. ఎందుకంటే వారి తెగలో చదువుకోవటం చాలా అరుదు. ఎంత వద్దన్నా పదకొండేళ్లకే పెళ్లి చేశారు. తల్లిదండ్రుల మాటకు తలవంచి పెళ్లి చేసుకుంది. తిరిగి అడవి బాట పట్టింది.. అయితే పందొమ్మిదేళ్ల వయసులో ఎవరికి చెప్పకుండా ప్రధాన్ అనే ఎన్జీవోలో పొదుపు సంఘ సభ్యురాలిగాచేరింది. దీంతో చంద్రకాళిలో ఆర్ధికంగా ఎదుగుదలపై ఆలోచనలు వచ్చాయి.

ఎప్పుడు వస్తుందో తెలియని వర్షాధార పంటలతో పాటు.. విభిన్న పద్ధతులతో ఆదాయం సృష్టించుకునే మార్గాలను అన్వేషించింది. తనతో పాటు తన తోటి ఆదివాసీ మహిళల్ని ఏకం చేసింది. వారందరూ తమకంటే ఎక్కువ చదువుకున్న లోకం తెలిసిన చంద్రకాళిని నమ్మారు దీంతో 20మంది మహిళలు కలిసి వారానికి ఒక్కొక్కరు యాభై పైసలు చొప్పున రూ.20 జమ చేశారు. దాంతో నాటుకోళ్లను పెంచటం మొదలు పెట్టారు. వారి పొదుపు గురించి పక్క ఊళ్లకు తెలీటంతో వారు కలిశారు. అలా స్వయం సంపాదన కోసం చంద్రకాళి ప్రయాణం మొదలైంది. అలా నెలలు.. సంవత్సరాలు కాలంలో కలిసిపోయాయి. ఆమె పట్టుదల పుణ్యమా అని రూ.20 కాస్తా లక్షలాది రూపాయిలు అయ్యాయి. చంద్రకాళి పెంచటం మొదలుపెట్టిన నాటుకోళ్లు అంతకంతకూ పెరిగిపోయాయి.

అలా మొదలైన జర్నీ 2006లో పౌల్ట్రీ ఫార్మింగ్ కోఆపరేటివ్ వెనుక మార్కమ్ చోదక శక్తిగా ఎదిగింది. ఇప్పుడు 60 మంది ఈ సంఘాన్ని నడిపిస్తున్నారు. దాదాపు 23 గ్రామాల్లోని భూమిలేని పేదలు ఈ సంస్థ ద్వారా ఉపాధిని పొందుతున్నారు. ఆమె పర్యవేక్షణలో, సహకార సంస్థ రూ .14.5 కోట్ల టర్నోవర్ ను కలిగి ఉన్న సంస్థగా మారింది. 2018–19లో రూ .8 లక్షల నికర లాభం చూపించింది. నాటుకోళ్ల వ్యాపారం చేస్తూనే పుట్టగొడుగుల వ్యాపారం.. కాయగూరల తోటలు వేసి లాభాలు ఆర్జించటంతో పాటు.. తన చుట్టూ వారిని జీవన స్థితిని మార్చేసింది. ఆమె చేసిన ప్రయత్నాన్ని CII ఫౌండేషన్ అనే ఎన్జీవో సంస్థ గుర్తించి. 2020 ఉమెన్ ఎక్స్‌ప్లార్ అవార్డుతో పాటు రూ.3లక్షల బహుమతితో సత్కరించింది. ఆ మొత్తంతో మోటార్ సైకిల్ కొన్న చంద్రకాళి మరింత వేగంతో దూసుకుపోతోంది.

తనకు ఇప్పుడు తన భర్త ఎంతో సహకరిస్తున్నదని చెప్పింది ఆమె.. ఆర్ధికంగా ఎదగాలి అనే పట్టుదల ఉంటె.. చదువు, డబ్బు ఇవేమీ మనిషి ఎదుగుదలను ఆపలేవని నిరూపించి పదిమందికి ఆదర్శంగా నిలిచింది చంద్రకాళి.

Also Read: తండ్రి దగ్గర పెరిగినా తల్లిని గుర్తు చేసే హిమ.. రియల్ లైఫ్ లో కన్నీటిమయమట