ఇప్పటి వరకు ఎంతమంది ఈపీఎఫ్ విత్ డ్రా చేసుకున్నారంటే..

లాక్ డౌన్ కారణంగా ఈపీఎఫ్ సొమ్ములోంచి విత్ డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించింది సర్కార్ దాదాపు 36లక్షల క్లెయిమ్‌లను పరిష్కరించినట్లు కార్మిక శాఖ ప్రకటించింది.

  • Balaraju Goud
  • Publish Date - 8:16 pm, Tue, 9 June 20
ఇప్పటి వరకు ఎంతమంది ఈపీఎఫ్ విత్ డ్రా చేసుకున్నారంటే..

దేశంలో కరోనా వ్యాప్తి చెందుతుండంతో భారత్ ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. దీంతో లక్షలాది ఉపాధి కోల్పోయి ఇంటికే పరిమితమయ్యారు. కడుపు నిండ తిండి తినేందుకు నానావస్థలు పడ్డారు. ఈ సమయంలో ఉద్యోగులు తాము పొదుపు చేసుకున్న ఈపీఎఫ్ సొమ్ములోంచి విత్ డ్ర చేసుకునే వెసులుబాటు కల్పించింది సర్కార్. దీంతో లక్షలాది మంది చిన్న ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారని ఈపీఎఫ్ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు 36లక్షల క్లెయిమ్‌లను పరిష్కరించినట్లు కార్మిక శాఖ ప్రకటించింది. దీని ద్వారా ఏప్రిల్‌, మే నెలల్లోనే రూ.11,540 కోట్లను ఈపీఎఫ్‌ ఖాతాదారులు ఉపసంహరించుకున్నట్లు తెలిపింది. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉన్నప్పటికీ ఏప్రిల్‌, మే నెలల్లోనే 32లక్షల క్లెయిమ్‌లను పరిష్కారించినట్లు పేర్కొంది. వీటిలో ఈ మధ్యే ప్రకటించిన ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ యోజన (PMGKY) కింద 15.54లక్షల క్లెయిమ్‌లను పరిష్కరించి రూ.4,580కోట్లను ఖాతాదారులకు విడుదల చేశామని తెలిపింది.
కరోనా ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈపీఎఫ్ ఖాతాదారులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని కార్మిక శాఖ పేర్కొంది. ముఖ్యంగా రూ. 15వేలలోపు జీతం ఉన్నవారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. లాక్‌డౌన్‌ కాలంలో ఈపీఎఫ్ ఉపసంహరించుకున్న ఖాతాదారుల్లో దాదాపు 75శాతం మంది రూ.15వేలలోపు జీతం ఉన్నవారేనని ప్రకటించింది. ఇక కేవలం 2శాతం మాత్రమే రూ.50వేలకు పైగా జీతం ఉన్నవారు ఉపసంహరించుకున్నట్లు పేర్కొంది. మిగతా 24శాతం మంది రూ.15 వేల నుంచి రూ.50వేల నెల జీతం ఉన్నవారు విత్‌ డ్రా చేసుకున్నవారని వెల్లడించింది. లాక్‌డౌన్‌ కారణంగా కేవలం 50శాతం ఉద్యోగులతోనే ఇన్ని లక్షల కేసులను పరిష్కరించినట్లు ప్రకటించింది.