పత్రి, ప్రకృతికి ప్రతిరూపాలే వినాయకచవితి

కోటి సూర్యులకు సమమైన గణపతికి వీలు లేని కార్యం లేదు. ఈ చరా చర సృష్టిలో.. వినాయకుడికి సాధ్యం కానిది లేదంటారు గణేశశక్తిని ఆరాధించేవారు. రూపాలు వేరైనా.. గణనాధుడు ఒక్కడే. ఆది దేవుడికి అనంతకోటి దండాలతో పూజలు చేస్తాం.

పత్రి, ప్రకృతికి ప్రతిరూపాలే వినాయకచవితి
Follow us

|

Updated on: Aug 21, 2020 | 7:02 PM

కోటి సూర్యులకు సమమైన గణపతికి వీలు లేని కార్యం లేదు. ఈ చరా చర సృష్టిలో.. వినాయకుడికి సాధ్యం కానిది లేదంటారు గణేశశక్తిని ఆరాధించేవారు. రూపాలు వేరైనా.. గణనాధుడు ఒక్కడే. ఆది దేవుడికి అనంతకోటి దండాలతో పూజలు చేస్తాం. అందులో మట్టి గణపతిని పూజిస్తే.. ప్రకృతిని పూజించినట్లే అని పెద్దలు చెబుతుంటారు.

వినాయకచవితి పండగ అంటేనే ప్రకృతితో ముడిపడి వుంటుంది. వినాయకచవితికి ఉపయోగించే మట్టి వినాయకుడి ప్రతిమగానీ, పత్రిగానీ ప్రకృతికి ప్రతిరూపాలే. మనం జరుపుకునే ప్రతి పండుగ వ్యవసాయానికి అనుసంధానించే ఉంటుంది.. వినాయకచవితి కూడా అంతే! భాద్రపద మాసం చవితి రోజున వినాయకుడికి పూజలు చేసి పండుగ చేసుకుంటాం! విఘ్నాల నుంచి కాపాడమంటూ వేడుకుంటాం! భాద్రపద మాసంలోనే వ్యవసాయ తొలి సీజన్‌ ఖరీఫ్‌ మంచి ఊపులో ఉంటుంది.. రైతులంతా నాట్లు వేయడంలో తీరిక లేకుండా ఉండే కాలం కూడా ఇదే! అందుకే విఘ్నేశ్వరుడికి తొలి పూజలు చేసి పవిత్రమైన వ్యవసాయ పనులను మొదలుపెడతారు రైతన్నలు.

ఇక, వినాయకుడి శరీరం ఏనుగు శరీరం.. అంటే భారీ పదార్థమన్నమాట! ఫిజిక్స్‌లో చెప్పాలంటే మెటీరియల్‌.. పదార్థం నుంచే సృష్టి జరుగుతుంది.. మట్టి నుంచే ధాన్యపు సిరి వస్తుంది.. ఒక్క మాటలో చెప్పాలంటే వినాయకుడు భూమికి ప్రతీక.. ఆయన ఏనుగు మొహం బుద్ధికి ప్రతీక.. ఆయన ఏకదంతం నాగలికి చిహ్నం. ఆయనకున్న పెద్ద చెవులు ధాన్యాన్ని తూర్పారబట్టే చేటలకు సంకేతం.. ఆయన పెద్ద బొజ్జ ధాన్యాన్ని దాచుకునే గుమ్మి లేదా గాదెకు గుర్తు.. తల భాగమేమో గాదెపై బోర్లించిన గంపను గుర్తు చేస్తుంది..

ఎలుకను వాహనంగా చేసుకున్నాడంటే దానికి కూడా ఓ అర్థం ఉంది.. పంటలను పాడు చేసేవి ఎలకలే.. వాటిని అణచి వేయడానికి సింబలే ఆ వాహనం! పొట్టను పాములతో బిగించి కట్టుకోవడం వెనకున్న కారణం కూడా ఇదే! ఇక వినాయక పూజలో మనం 21 రకాల పత్రిలను వాడతాం! అవన్నీ ఔషధాలే! ఇవన్నీ మనకు పంటపొలాల పక్కన కనిపిస్తాయి.. వీటన్నింటిని చూస్తే వినాయకుడు వ్యవసాయ ప్రధాన దేవుడేనని అనిపిస్తుంది.

ఇక, మట్టిలోంచే సకల ప్రాణులు, సంపదలు వచ్చాయని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అది ఒక కారణమైనా..మట్టి వినాయకుని చేయాలంటే చెరువుల నుంచి బంకమట్టిని సేకరించాలి. ఇంటికో గంపెడు మట్టి తీయడంవల్ల, అందరూ తమకు తెలియకుండానే తలో చెయ్యివేసి, చెరువుల్లో పూడిక తీసినట్టవుతుంది. చెరువుల్ని బాగు చేసినట్టవుతుంది.

ఇదీ ఓ కారణమైనా.. అసలు కారణం మరొకటి ఉంది. అసలు వినాయకుడు పుట్టింది పార్వతీదేవి మేని నలుగు మట్టి నుంచే కదా. అందుకే ఆయన విగ్రహాన్ని మట్టితోనే చేయాలి. మట్టి వినాయకునే పూజించాలి. అప్పుడే…భక్తి..ముక్తి..శక్తి. అలాగే మట్టి వినాయకుడిని పూజించడం అంటే మన ప్రకృతిని పూజించడంతో సమానం. మనకు జీవాన్ని, జీవితాన్ని, మనుగడని ఇస్తున్న ప్రకృతిని పూజించే అవకాశం మనకు వినాయకచవితి ద్వారా లభిస్తోంది. అలాంటి మంచి అవకాశాన్ని వినియోగించుకుని మట్టి వినాయకుడిని పూజించాలి. అదేవిధంగా మట్టి వినాయకుడిని మాత్రమే పూజించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు మనవంతు బాధ్యతను నిర్వర్తించినట్టు అవుతుంది. వినాయకుడి బొమ్మని మట్టితోనే చేయాలని శాస్త్రం చెబుతోంది.