ధన త్రయోదశి: నగలు కొనేవారు ఫాలో కావాల్సిన టిప్స్!

బంగారం… భారతీయులకు ఓ సెంటిమెంట్. ఈ సెంటిమెంట్ కొన్ని పండుగల సమయంలో వేలకోట్ల వ్యాపారానికి కారణమవుతుంది. అక్షయ తృతీయ అలాంటిదే. అక్షయ తృతీయ తర్వాత ధంతేరాస్ రోజున కూడా నగల షాపులు కిటకిటలాడుతుంటాయి. మరి మీరు ధంతేరాస్‌కు బంగారం కొంటున్నారా? బంగారం అమ్మకాల్లో జరిగే మోసాలేంటో తెలుసా? మజూరీ, తరుగు, హాల్‌మార్క్… వీటిపై అవగాహన ఉందా? బంగారం కొనేముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా? బంగారం కొనడానికి షాపుకి వెళ్లేముందుకు ఈ విషయాలు గుర్తుంచుకోండి. 1. బంగారం… […]

ధన త్రయోదశి: నగలు కొనేవారు ఫాలో కావాల్సిన టిప్స్!
Follow us

| Edited By:

Updated on: Oct 24, 2019 | 1:38 PM

బంగారం… భారతీయులకు ఓ సెంటిమెంట్. ఈ సెంటిమెంట్ కొన్ని పండుగల సమయంలో వేలకోట్ల వ్యాపారానికి కారణమవుతుంది. అక్షయ తృతీయ అలాంటిదే. అక్షయ తృతీయ తర్వాత ధంతేరాస్ రోజున కూడా నగల షాపులు కిటకిటలాడుతుంటాయి. మరి మీరు ధంతేరాస్‌కు బంగారం కొంటున్నారా? బంగారం అమ్మకాల్లో జరిగే మోసాలేంటో తెలుసా? మజూరీ, తరుగు, హాల్‌మార్క్… వీటిపై అవగాహన ఉందా? బంగారం కొనేముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా? బంగారం కొనడానికి షాపుకి వెళ్లేముందుకు ఈ విషయాలు గుర్తుంచుకోండి.

1. బంగారం… భారతీయులకు ఆభరణం మాత్రమే కాదు. లక్ష్మీదేవితో సమానం. బంగారాన్ని వస్తువుగా కాకుండా సెంటిమెంట్‌తో చూడటం అలవాటు. బంగారం భారతీయులకు అలంకరణప్రాయం మాత్రమే కాదు… పెట్టుబడి సాధనం కూడా.

2. భారతదేశంలోని విభిన్న మతాల సంప్రదాయాలకు, బంగారానికి విడదీయరాని బంధం ఉంటుంది. ఏ చిన్న వేడుకైనా బంగారం కొనడం, బహుమతిగా ఇవ్వడం సంప్రదాయం. ఇక బంగారం కొనకుండా, కానుకగా ఇవ్వకుండా పెళ్లిళ్లు జరిగే ప్రసక్తే లేదు.

3. బంగారాన్ని సెంటిమెంట్‌గా భావించే భారతీయులు… అక్షయ తృతీయ, ధంతేరాస్‌ లాంటి శుభదినాల్లో పసిడిని సొంతం చేసుకునేందుకు పోటీపడుతుంటారు. ధర ఎక్కువైనా సరే కొంటూ ఉంటారు. అయితే బంగారం విషయంలో అనేక మోసాలు జరుగుతుంటాయన్నది వాస్తవం.

4. ‘బంగారం కొన్నా మోసపోతారు, అమ్మినా మోసపోతారు’ అని అంటూ ఉంటారు. ఇది అక్షరాలా నిజం. బంగారం కొనేప్పుడైనా, అమ్మేటప్పుడైనా అప్రమత్తంగా లేకపోతే మోసపోక తప్పదు. అందుకే బంగారం కొనేముందు కాస్త అవగాహన పెంచుకోవడం మంచిది.

5. బంగారం రేటెంత అని ఎవరినైనా అడగ్గానే క్యారెట్ ఎంత అని ప్రశ్నిస్తారు. బంగారం 24 క్యారెట్, 22 క్యారెట్, 18 క్యారెట్ ఇలా వేర్వేరు నాణ్యతతో లభిస్తుంటాయి. 24 క్యారెట్ గోల్డ్ బిస్కెట్ల రూపంలో ఉంటుంది. ఈ బంగారంతో నగలు తయారు చేయడం సాధ్యం కాదు.

6. అందుకే 24 క్యారెట్ బంగారంలో వెండి లేదా రాగి కలిపి నగలు తయారు చేస్తుంటారు. 24 క్యారెట్ గోల్డ్‌లో 2 క్యారెట్లు తగ్గించి వెండి లేదా రాగి కలిపి నగలు తయారు చేస్తారు. రెండు క్యారెట్లు తగ్గిస్తారు కాబట్టి దాన్ని 22 క్యారెట్ గోల్డ్ అంటారు.

7. బంగారం షాపుల్లో అమ్మే నగల్లో ఎక్కువగా 22 క్యారెట్ గోల్డ్‌తో తయారైనవే. దాంతో పాటు ఇటీవల కాలంలో 18 క్యారెట్ బంగారు ఆభరణాలను కూడా అమ్ముతున్నారు. 22 క్యారెట్ ఆభరణాల కన్నా 18 క్యారెట్ ఆభరణాలు కాస్త ధర తక్కువగా ఉంటాయి.

8. మీరు కొనే బంగారం నిజంగా 22 క్యారెట్ ఉంటుందా? లేదా అంతకన్నా తక్కువ ఉంటుందా? అని తెలుసుకోకపోతే మోసపోతారు. 18 క్యారెట్ నగలనే 22 క్యారెట్ నగలని చెప్పి మోసం చేయొచ్చు. 22 క్యారెట్ బంగారాన్నే 916 లేదా 91.6 బంగారం అని అంటారు.

9. బిస్కెట్ల రూపంలో ఉండేది 24 క్యారెట్ బంగారం. ఆ బంగారాన్ని కొంటే మేకింగ్ ఛార్జీలంటూ ఏవీ ఉండవు. కానీ… 22 క్యారెట్ నగలు కొంటే మేకింగ్ ఛార్జీలు చెల్లించాలి. ఎందుకంటే బంగారం తూకాన్ని ఆ రోజు ధరకు లెక్కించి రేటు నిర్ణయిస్తారు. నగల తయారీకి అయ్యే ఖర్చును మేకింగ్ ఛార్జీల పేరుతో బిల్లులో వేస్తారు.

10. మేకింగ్ ఛార్జీలనే మజూరీ అంటారు. మజూరీ అంటే కూలీ అని అర్థం. ముడి బంగారంతో నగలు తయారు చేసిన వర్క్‌షాప్‌లో కూలీలకు ఇచ్చే ఛార్జీలన్నమాట. మేకింగ్ ఛార్జీలు ఎంత శాతం అన్నది నగల షాపుల యజమానులు నిర్ణయిస్తుంటారు.

11. అక్షయ తృతీయ, ధంతేరాస్‌ లాంటి సందర్భాల్లో కస్టమర్లను ఆకర్షించేందుకు మజూరీ లేదు. మేకింగ్ ఛార్జీలు 0% అనే ప్రకటనలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. ఇక్కడే తిరకాసేంటో గమనించాలి. ముడి బంగారంతో నగలు తయారు చేయడానికి ఎంతో కొంత మేకింగ్ ఛార్జీలు చెల్లించక తప్పదు. ఊరికే డబ్బులు తీసుకోకుండా ఎవరూ నగలు తయారు చేసి ఇవ్వరు.

12. అలాంటప్పుడు నగల షాపుల యజమానులు మేకింగ్ ఛార్జీలు లేకుండా నగలను అమ్మడం ఏలా సాధ్యం? ఇది అస్సలు సాధ్యం కాదు. అయితే మీరు నగలకు చెల్లించే రేటులోనే మేకింగ్ ఛార్జీలు కూడా కలిపే ఉంటాయి. కాకపోతే కస్టమర్లను ఆకర్షించేందుకు మేకింగ్ ఛార్జీలు లేవు అని ప్రకటనలు ఇస్తుంటారు నగల షాపుల యజమానులు.

13. మీరు కొన్న నగలు కొంతకాలం వాడిన తర్వాత పాతబడిపోతాయి. వాటిని తిరిగి అమ్మితే ఆ నగల్లోని బంగారం స్వచ్ఛంగా మార్చినప్పుడు కొంత వేస్టేజ్ ఉంటుంది. ఆ వేస్టేజ్‌నే తరుగు అంటారు.

14. నగల షాపులు 5 నుంచి 12 శాతం వరకు తరుగు తీస్తుంటాయి. అంటే మీరు 100 గ్రాముల బంగారాన్ని అమ్మితే అందులో మీకు వచ్చేది 88 గ్రాములే. 12 గ్రాములు తరుగు కింద వెళ్తుంది.

15. తరుగులోనూ మతలబు ఉంటుంది. తరుగు లేదు అని ప్రచారం చేస్తుంటాయి నగల షాపులు. అయితే వాళ్ల షాపులో కొన్న బంగారాన్ని అమ్మితేనే తరుగు ఉండదంటారు. మీరు బంగారం కొనేప్పుడే ఈ తరుగును కలిపి రేటు వేస్తారు. ముందే అదనంగా వసూలు చేస్తారు.

16. తర్వాత ఎప్పుడైనా మీరు నగలు అమ్మేప్పుడు తరుగు లేదని అంటారు. మీరు ఒక షాపులో కొన్న నగల్ని మరో షాపులో అమ్మేందుకు వెళ్తే తీసుకోరు.

17. హాల్‌మార్క్ బంగారు నగలు అనే పేరును మీరు వినే ఉంటారు. బంగారు ఆభరణాల షాపులు ఈ పేరుతో ప్రకటనలు కూడా ఇస్తుంటాయి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్-BIS సంస్థకు చెందిన గుర్తే హాల్‌మార్క్. ఈ గుర్తు ఉన్న నగలు నాణ్యమైనవి. వాస్తవానికి ప్రతీ నగల షాపు హాల్‌మార్క్ గుర్తు ఉన్న బంగారు నగలనే అమ్మాలి.

18. మీరు నగలు కొనేప్పుడు హాల్‌మార్క్ గుర్తు ఉందో లేదో చూడాలి. హాల్‌మార్క్ గుర్తు ఉన్న ఆభరణాలే కొనాలి. అయితే కొన్ని నగల షాపులు సొంతగా హాల్‌మార్క్ ముద్ర వేసి నగల్ని అమ్ముతుంటాయి. అదే జరిగితే మీరు మోసపోయినట్టే.

19. మీరు ఏ షాపులో కొంటున్నారో ఆ షాపు నుంచి బిల్లు తీసుకోవాలి. ట్యాక్స్ కట్టాల్సి వస్తుందని చెప్పినా సరే బిల్లు తప్పనిసరిగా తీసుకోండి. మీరు కొన్న బంగారం తూకం విషయంలో అనుమానం ఉంటే మరో చోట తూకం చూడండి. తూకం సరిగ్గా లేదంటే కంప్లైంట్ చేయొచ్చు.

20. నగలు కొనేప్పుడు రాళ్లను కలిపి తూకం వేసి మోసం చేస్తుంటాయి షాపులు. రాళ్ల బరువు తీసేసి తూకం చేయమని గట్టిగా అడగండి. అవసరమైతే రాళ్లకు వేరుగా బిల్లు వేయమని అడగండి. మీరు కొన్న బంగారంలో తేడా ఉందని భవిష్యత్తులో అనిపిస్తే మీరు ఆ షాపుపైన కంప్లైంట్ కూడా చేయొచ్చు. లేదో కన్స్యూమర్స్ ఫోరమ్‌లో ఫిర్యాదు చేయొచ్చు.