Devineni Uma protest: కృష్ణా జిల్లా గొల్లపూడిలో మంగళవారం తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దీక్షకు దిగడానికి ప్రయత్నించడం, పోలీసులు అడ్డుకోవడం.. అరెస్ట్ చేయడం.. ఇలా మంగళవారం టెన్షన్ టెన్షన్‌గా గడించింది.
అయితే తాజాగా మళ్లీ అలాంటి పరిస్థితులే రిపీట్ కానున్నాయా అంటే అవుననే సమాధానం వస్తుంది. దీనికి కారణం దేవినేని ఉమ మరోసారి నిరసన దీక్షకు దిగడానికి సిద్ధమవుతుండడమే. ‘మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు’ అని అమరావతి రైతులు చేపడుతోన్న దీక్షలకు బుధవారంతో 400ల రోజులు పూర్తయిన నేపథ్యంలో దేవినేని ఈ నిరసన దీక్షకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ దీక్షకు అనుమతి లేదని పోలీసులు తేల్చిచెప్పారు. 144 సెక్షన్ అమల్లో ఉందని, ఎలాంటి కార్యక్రమాలకు అనుమతులు లేవని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఇదే రోజు మైలవరం ఎమ్మెల్యే సభ నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు. ఇళ్లపట్టాల పంపిణీ సభ విజయవంతమైన నేపథ్యంలో సభను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే వైసీపీ ఏర్పాటు చేయనున్న సభకు కూడా అనుమతి లేదని పోలీసులు తెలిపారు. దీంతో కృష్ణా జిల్లాలో ఈ రోజు కూడా హైటెన్షన్ వాతావరణం నెలకొంది.