అరుణాచల్ ప్రదేశ్‌‌లో గ్రామాన్నే నిర్మించిన చైనా, మీ ప్రకటన ఏమైందని ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ ఫైర్

అరుణాచల్ ప్రదేశ్ లో మన భూభాగాన్ని ఆక్రమిస్తూ చైనా ఏకంగా ఓ గ్రామాన్నే నిర్మించిందని వచ్చిన వార్తల పట్ల కాంగ్రెస్ తీవ్ర ఆందోళన వ్యక్తం..

  • Umakanth Rao
  • Publish Date - 1:04 pm, Tue, 19 January 21
అరుణాచల్ ప్రదేశ్‌‌లో గ్రామాన్నే నిర్మించిన చైనా, మీ ప్రకటన ఏమైందని ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ ఫైర్

అరుణాచల్ ప్రదేశ్‌‌లో మన భూభాగాన్ని ఆక్రమిస్తూ చైనా ఏకంగా ఓ గ్రామాన్నే నిర్మించిందని వచ్చిన వార్తల పట్ల కాంగ్రెస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అక్కడ వంద ఇళ్ళు, భారీ రోడ్లతో చైనా గ్రామాన్ని నిర్మించిందని. గప్ చుప్ గా ఈ నిర్మాణాలు సాగాయని, ఇందుకు సంబంధించిన ఇమేజీలతో సహా మీడియా ప్రచురించింది. అయితే ఈ దేశాన్ని ఏ దేశం ముందూ తలవంచనీయబోమని మీరు ప్రకటనలు చేస్తుంటారని, ఇప్పుడు చైనా ఇంత దుస్సాహసానికి దిగితే మీరు మాట్లాడడం లేదు ఎందుకని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ….. ప్రధాని మోదీని ప్రశ్నించారు. ఇందుకు సంబంధించిన వార్తా పత్రికల క్లిపింగులను కూడా ఆయన తన ట్విటర్ కి జోడించారు. మీది 56 అంగుళాల ఛాతీ అని పేర్కొంటుంటారని, మరి ఇప్పుడు ఆ మాట ఎందుకు ఎత్తరని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సూర్జేవాలా కూడా ట్వీట్ చేశారు.

అటు-ఇదే పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. అరుణాచల్ ప్రదేశ్ లో మీ బీజేపీకే చెందిన తపిర్ గావో అనే ఎంపీ సాక్షాత్తూ ఇక్కడ చైనా అక్రమంగా గ్రామాన్ని నిర్మించిందని, అది కొన్ని వందల చదరపు మీటర్ల దూరం భారత భూభాగంలో ఉందని చెప్పారని అన్నారు. దీనిపై మీ ప్రభుత్వం మాట్లాడడంలేదెందుకని ప్రశ్నించారు. వందకు పైగా ఇళ్ళు, విశాలమైన రోడ్లతో చైనా అరుణాచల్ లో గ్రామాన్ని నిర్మించడంపై ఇతర విపక్షాలు కూడా మోదీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టాయి. అసలే లడఖ్ ప్రాంతంలో చైనా ఆక్రమణ నేపథ్యంలో ఉభయ దేశాల మధ్య ఉద్రిక్తత కొనసాగుతున్నా చైనా చేసిన ఈ పని అత్యంత దుస్సాహసమని, మన ఇంటెలిజెన్స్ వర్గాలు ఏం చేస్తున్నాయని ఈ పార్టీలు ప్రశ్నించాయి.