ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ హవా.. పని చేయని మోదీ చరిష్మా

Delhi Assembly Elections: కాంగ్రెస్, బీజేపీతో పాటుగా ప్రస్తుతం అధికారంలో ఉన్న ఆప్ పార్టీకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారాయి. గెలుపే ధ్యేయంగా ఈ పార్టీలు తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకోవడమే కాకుండా అధికారం తమదేనంటూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ నెల 8న జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఎవరిని వరిస్తుందో.. ప్రతిపక్షంలో ఎవరు కూర్చుంటారో టీవీ9 నిర్వహించిన సర్వేలో తేలిపోయింది. రాష్ట్రంలోని సుమారు 6605 మందితో పలు విభాగాల్లో నిర్వహించిన ఈ […]

ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ హవా.. పని చేయని మోదీ చరిష్మా
Follow us

| Edited By: Umakanth Rao

Updated on: Feb 06, 2020 | 2:45 PM

Delhi Assembly Elections: కాంగ్రెస్, బీజేపీతో పాటుగా ప్రస్తుతం అధికారంలో ఉన్న ఆప్ పార్టీకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారాయి. గెలుపే ధ్యేయంగా ఈ పార్టీలు తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకోవడమే కాకుండా అధికారం తమదేనంటూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ నెల 8న జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఎవరిని వరిస్తుందో.. ప్రతిపక్షంలో ఎవరు కూర్చుంటారో టీవీ9 నిర్వహించిన సర్వేలో తేలిపోయింది.

రాష్ట్రంలోని సుమారు 6605 మందితో పలు విభాగాల్లో నిర్వహించిన ఈ సర్వేలో ఆప్ పార్టీనే విజయం సాధిస్తుందని స్పష్టమైంది. మొత్తం డబ్భై సీట్లకు గానూ 49 శాతం ఓటింగ్ షేర్‌తో 48-60 స్థానాలు ప్రస్తుతం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దక్కించుకుంటారని.. బీజేపీకి 37% ఓట్ల షేర్‌తో 10 నుంచి 20 సీట్లు వస్తాయని ఆ నివేదికలో వెల్లడైంది. ఇక ఇందులో కాంగ్రెస్ పార్టీకి 0-2 స్థానాలే వస్తాయని తేలడం గమనార్హం. ఇక ఆప్‌కి గతంతో పోలిస్తే ఈసారి మూడు శాతం ఓట్ల షేర్ తగ్గుతుందని పోల్ చెబుతుండగా.. బీజేపీకి మాత్రం మునపటి కంటే 4% ఓటింగ్ షేర్ పెరుగుతుందని తేలింది.

ఎవరు బెస్ట్ సీఎం…

హేమాహేమీల లాంటి రాజకీయ నాయకులు ఎందరో ఉన్నా.. హస్తిన ప్రజలు మాత్రం ఆప్ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రికే అధిక శాతంలో ఓటేశారు. ఉచితంగా వైద్య సేవలు, పిల్లలకు మంచి విద్య, విద్యుత్, నీటి సరఫరా లాంటి విషయాల్లో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూసుకున్నారు. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్‌ బెస్ట్ సీఎం అంటూ ఆయన పనితీరును మెచ్చుకుని 60 శాతం ప్రజలు ఓటేయగా.. బీజేపీ నేత డాక్టర్ హర్షవర్ధన్‌కు 15%, మరో కమలం పార్టీ నేత మనోజ్ తివారికి 10%, అలాగే కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్‌కు 2% ఓట్లు పడ్డాయి.

సీఏఏ, ఎన్ఆర్సీ ఇంపాక్ట్…

సీఏఏ, ఎన్ఆర్సీలను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు బీజేపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ రెండింటిపై ఆందోళనలు, నిరసనలు మిన్నంటుతున్నా.. కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేసేలా కనిపించట్లేదు. ఇక వాటి ప్రభావం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ గెలుపోటములపై పడే అవకాశం ఖచ్చితంగా ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. సీఏఏ, ఎన్ఆర్సీలు బీజేపీ గెలుపుకు అవకాశాలుగా మారుతాయని 42 శాతం మంది అంటుంటే.. వాటి వల్ల ఆ పార్టీ ఓటమి పాలవుతుందని 35% మంది.. ఆ రెండిటి ప్రభావం ఎన్నికలపై పడదని 21% ప్రజలు అంటున్నారు.

ప్రధాని మోదీ చరిష్మా…

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందో.? ఏ పార్టీ ఓడుతుందో.? అన్న విషయాలను కాసేపు పక్కన పెడితే.. ప్రతీ ఎన్నికల్లోనూ బీజేపీకి నరేంద్ర మోదీ చరిష్మా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈసారి ఢిల్లీ ఎన్నికలకు కూడా అదే జరుగుతుందని బీజేపీ పార్టీ జాతీయ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

సరిగ్గా అదే జరుగుతుందని సర్వే కూడా తేల్చి చెప్పింది. మోదీ ర్యాలీ తర్వాత ఒక్కసారిగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటింగ్ గ్రాఫ్ అమాంతం పెరిగింది. గతంలో 33% శాతం ఓట్ల షేర్ మాత్రమే ఉన్న ఆ పార్టీకి ఆయన చరిష్మాతో అది కాస్తా 37 శాతానికి పెరిగింది. అయితే ఆప్ పార్టీకి మాత్రం ఇది కాస్త కలవరపెట్టే విషయమే అని చెప్పాలి. గతంలో అరవింద్ కేజ్రీవాల్ పార్టీకి 52 శాతం ఓటింగ్ షేర్ ఉండగా.. మోదీ ర్యాలీ తర్వాత అది కాస్తా 49%కు పడిపోయింది. ఏది ఏమైనా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అంతిమ విజయం మాత్రం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వం వహిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీని వరిస్తుందని పోల్స్ స్పష్టం చేస్తున్నాయి.