రైతు వేదిక ప్రారంభోత్సవం రసాభాస.. మంత్రి నిరంజన్‌రెడ్డి సాక్షిగా బీజేపీ – టీఆర్ఎస్ కార్యకర్తల వాగ్వాదం

నాగర్ కర్నూలు జిల్లాలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ కార్యకర్తల మధ్య వాగ్వాదం

  • Balaraju Goud
  • Publish Date - 12:01 pm, Fri, 1 January 21
రైతు వేదిక ప్రారంభోత్సవం రసాభాస.. మంత్రి నిరంజన్‌రెడ్డి సాక్షిగా బీజేపీ - టీఆర్ఎస్ కార్యకర్తల వాగ్వాదం

Clash Between TRS vs BJP:  నాగర్‌కర్నూలు జిల్లాలో రైతు వేదిక ప్రారంభోత్సవం రసాభాసగా మారింది. రైతువేదిక సదస్సుపై ప్రధాని మోదీ ఫొటో పెట్టలేదని బీజేపీ కార్యకర్తలు సభను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో బీజేపీ, టీఆర్‌ఎస్‌ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా ఇరువర్గాల పోటాపోటీ నినాదాలతో ఆ ప్రాంతం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు బీజేపీ కార్యకర్తలను బయటకు పంపించేశారు. అప్పటికే రైతువేదిక వద్దకు భారీగా చేరుకున్న బీజేపీ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇదంతా కూడా రాష్ట్ర మంత్రి నిరంజన్ రెడ్డి సాక్షిగా జరిగింది. రైతువేదిక సదస్సుకు ముఖ్య అతిథిగా వచ్చిన మంత్రికి చిర్రెత్తుకొచ్చింది. బీజేపీ కార్యకర్తలను సముదాయించే ప్రయత్నం చేశారు. ప్రధాని మోదీ అంటే తమ ప్రభుత్వానికి చిన్నచూపు లేదన్నారు. బీజేపీ కార్యకర్తలే ప్రధాని స్థాయిని దిగజారుస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో కూడా ఫొటో పెట్టాలంటే ప్రధాని మోదీ నుంచి ఓ సర్క్యూలర్‌ తీసుకురావాలని మంత్రి నిరంజన్‌రెడ్డి సూచించారు.