రోడ్డు ప్రమాదాల్లో సాయం చేసినవారికి అవార్డులు: కేంద్రం

రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులకు సహాయపడే ఆపద్భాందవులకు అవార్డులు ప్రధానం చేసి.. వారిని సత్కరించాలని కేంద్ర రహదారి, రవాణా శాఖ నిర్ణయించింది.

  • Updated On - 10:42 am, Tue, 3 November 20
రోడ్డు ప్రమాదాల్లో సాయం చేసినవారికి అవార్డులు: కేంద్రం

Centre Help To Good Samaritans: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి సాయం చేసేందుకు చాలా మంది భయపడుతుంటారు. ఎందుకంటే..గాయపడిన వారిని కాపాడేంత వరకు ఓకే. కానీ, ఆ తర్వాత పోలీస్ కేసులు, విచారణ పేరుతో పీఎస్ చుట్టూ తిరగాల్సి వస్తుందనే భయంతో సహాయం చేయాలనుకున్న వారు కూడా వెనకడుగు వేస్తుంటారు. ఈ క్రమంలోనే జనాల్లో ఆ భయాలను తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం పలు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

ఇందులో భాగంగానే రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులకు సహాయపడే ఆపద్భాందవులకు అవార్డులు ప్రధానం చేసి.. వారిని సత్కరించాలని కేంద్ర రహదారి, రవాణా శాఖ నిర్ణయించింది. ఇలా చేయడం ద్వారా ఆపద సమయాల్లో క్షతగాత్రులకు మరింత మంది సాయం చేసే అవకాశం ఉంటుందని భావిస్తోంది. రహదారి భద్రతా విభాగంలో ఎనలేని సేవలు అందిస్తోన్న వారి పేర్లను అవార్డుల కోసం ప్రతిపాదించాలని ఇప్పటికే అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్రం లేఖ రాసింది.

ప్రతీ ఏటా బాధితులకు సాయం చేసే ఆపద్భాందవులకు రాష్ట్రాల వారీగా 1,2,3 అవార్డులు ప్రధానం చేయడమే కాకుండా, ధ్రువీకరణ పత్రాలు అందజేయనున్నారు. ఇందులో ఫస్ట్ ప్రైజ్‌కు రూ. 5 లక్షలు, రెండో బహుమతికి రూ. 2 లక్షలు, మూడో బహుమతికి రూ. లక్ష ఇస్తారు. కాగా, ఇప్పటికే రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి సాయం చేసే ఆపద్భాందవులకు కేంద్రం చట్టపరంగా అండగా నిలిచిన సంగతి విదితమే.