AP Covid vaccine burden: పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు అదనపు భారం.. ఖ‌జానాపై వ్యాక్సిన్ కొనుగోళ్ల ఎఫెక్ట్

ఏపీకి ఆర్ధిక క‌ష్టాలు ఒక్కోక్కటిగా వెంటాడుతూనే ఉన్నాయి. అస‌లే ఖ‌జానాపై న‌వ‌ర‌త్నాల అమలులో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్రానికి.. ఇప్పుడు క‌రోనా సెకండ్ వేవ్, పిడుగులా వ‌చ్చి ప‌డింది.

AP Covid vaccine burden: పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు అదనపు భారం.. ఖ‌జానాపై వ్యాక్సిన్ కొనుగోళ్ల ఎఫెక్ట్
Covid Vaccines Buying Burden On Andhra Pradesh
Follow us

|

Updated on: Apr 23, 2021 | 8:44 AM

Covid 19 Vaccines Burden on AP govt.: ఏపీకి ఆర్ధిక క‌ష్టాలు ఒక్కోక్కటిగా వెంటాడుతూనే ఉన్నాయి. అస‌లే ఖ‌జానాపై న‌వ‌ర‌త్నాల అమలులో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్రానికి.. ఇప్పుడు క‌రోనా సెకండ్ వేవ్, పిడుగులా వ‌చ్చి ప‌డింది. టీకా రూపంలో ప్రభుత్వంపై భారం పడబోతోంది. టీకా కొనుగోలులో ఏపీపై ఎంత భారం పడనుంది? ఆ మొత్తాన్ని ప్రభుత్వం ఎక్కడ నుంచి తీసుకురాగలదు. ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందనేదే ఆసక్తిగా మారింది.

కరోనా సెకండ్ వేవ్ ఉధృతి దేశాన్ని అల్లకల్లోలం చేస్తోంది. విపరీతమైన వేగంతో వైరస్ వ్యాపిస్తోంది. ఏపీలోనూ పరిస్థితులు దారుణంగా తయారవుతున్నాయి. కరోనా కట్టడిలో భాగంగా .. కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్ల పైబడిన వారందరికీ టీకా ఇవ్వాలని నిర్ణయించింది. అయితే ఇప్పుటి వ‌ర‌కు కొవిడ్ టీకా కేంద్రమే రాష్ట్రాల‌కు వ్యాక్సిన్ స‌ర‌ఫ‌రా చేసింది. మే 1 నుండి టీకా రాష్ట్రాల‌దే బాధ్యత అంటూ చేతులేత్తేసింది.

గతంలో మాదిరిగా కాకుండా.. 18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సున్న వారికి టీకాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే కొనుగోలు చేసుకోవాలని నిర్ణయించింది. దీంతో ఏపీలో ఈ వయస్సు వారికి కరోనా టీకాలు ఉచితంగా ఇవ్వాలా..? లేదా..? అనే అంశంపై జ‌గ‌న్ స‌ర్కార్ త్వర‌లో నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటి వ‌ర‌కు టీకాను కేంద్రమే రాష్ట్రాల‌కు ఉచితంగా ఇవ్వడంతో రాష్ట్ర్రాల‌పై పెద్దగా భారం పడలేదు. ఇకపై టీకా ఖ‌ర్చు రాష్ట్ర ప్రభుత్వాల‌దైతే ఎంత ఖ‌ర్చు అవుతోంద‌న్న చ‌ర్చ ఏపీ ఆర్ధిక శాఖ అధికారుల‌ను క‌ల‌వ‌రపెడుతోంది.

రాష్ట్ర వ్యాప్తంగా సుమారు నాలుగు కోట్లకు పైగా జనాభా 18 ఏళ్లకు పైబడి ఉన్నారని ప్రభుత్వ గ‌ణాంకాలు చెప్తున్నాయి. వీరిలో సుమారుగా మూడున్నర కోట్ల మంది 18 నుంచి 45 వయస్సు లోపు వారు ఉంటారు. ప్రస్తుతం వీరందరూ మే 1వ తేదీ నుంచి టీకా వేయించుకోవడానికి అర్హులు. ఒక్కోక్కరికి రెండు డోసులు వేయాల్సిందే. అంటే అందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలంటే కనీసం 7కోట్ల డోసులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

కేంద్రం ప్రక‌టించిన‌ట్లు ఒక్కడోస్ 400 రుపాయిల ప్రకారం.. సుమారు మూడు వేల కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం ఖ‌ర్చు చేయాల్సి ఉంది. అసలే రాష్ట్రం పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉంది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఖ‌జానాకు వ‌చ్చేది కూడా అంతంత మాత్రమే. ఇలాంటి పరిస్థితుల్లో ఒక‌వేళ రాష్ట్ర ప్రభుత్వమే ప్రజ‌ల‌కు ఉచితంగా టీకా వేయాలంటే వేల కోట్ల భారం మోయక తప్పదనే చ‌ర్చ జ‌రుగుతోంది.

ఇప్పటికే న‌వ‌ర‌త్నాలకు ఏడాదికి 50 వేల కోట్లకు పైగా ఏపీలో ఖర్చవుతోంది. గత ప్రభుత్వంలో కంటే అధిక సంఖ్యలో సంక్షేమ పథకాలను అమలుచేస్తోంది. ఇప్పుడు టీకా విష‌యంలో డబ్చులు వ‌సూలు చేస్తే తీవ్ర విమ‌ర్శలు తప్పబోవని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. న‌వ‌ర‌త్నాల మాదిరిగానే టీకా ఉచిత ప‌ధ‌కం అమ‌లు చేయ‌ల్సిన అనివార్య ప‌రిస్థితి ఏర్పడిందనే చ‌ర్చ జ‌రుగుతోంది.

కేంద్రం తీరుపై రాష్ట్ర ప్రభుత్వానిది మింగ‌లేక క‌క్కలేని ప‌రిస్థితి. క‌రోనా విప‌త్తులో కేంద్రం ఉచిత స‌ల‌హాల‌కే ప‌రిమితం అయ్యింది. టీకా విష‌యంలో కేంద్రం రెండు నాలుక‌ల విధానం అవ‌లంభిస్తోంది. కేంద్రం కోనుగోలు చేసే టీకా ధ‌ర 150 రుపాయిలుంటే.. అదే టీకాకు రాష్ట్ర ప్రభుత్వాలు 400 రుపాయిలు చెల్లించాల్సి వ‌స్తోంది. దీనిపై చాలా రాష్ట్రాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

Read Also…  Dhulipalla Narendra arrest: అవినీతి ఆరోపణలపై టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్.. చింతలపూడిలో అదుపులోకి తీసుకున్న ఏసీబీ