మధ్యప్రదేశ్‌ ఉప ఎన్నికల కోసం బీజేపీ రామ్‌శిలా పూజాన్‌ రథయాత్ర

మధ్యప్రదేశ్‌లో త్వరలో జరిగే ఉప ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ.. ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది బీజేపీ. ఓటర్లను ఆకర్షించేందుకు రథయాత్రను కూడా ప్లాన్‌ చేసింది.. రామ్‌శిలా పూజన్‌ రథయాత్ర పేరుతో అసెంబ్లీ నియోజకవర్గాలన్నింటినీ చుట్టేయాలనుకుంటోంది

మధ్యప్రదేశ్‌ ఉప ఎన్నికల కోసం బీజేపీ రామ్‌శిలా పూజాన్‌ రథయాత్ర
Balu

|

Sep 05, 2020 | 4:50 PM

మధ్యప్రదేశ్‌లో త్వరలో జరిగే ఉప ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ రెండు ప్రధాన అంశాలను ఎజెండాగా పెట్టుకుంది.. మొదటిది అభివృద్ధి అయితే రెండోది సహజంగానే అయోధ్య రామమందిర నిర్మాణం.. 27 స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది బీజేపీ. ఓటర్లను ఆకర్షించేందుకు రథయాత్రను కూడా ప్లాన్‌ చేసింది.. రామ్‌శిలా పూజన్‌ రథయాత్ర పేరుతో అసెంబ్లీ నియోజకవర్గాలన్నింటినీ చుట్టేయాలనుకుంటోంది.. రథయాత్రలో భాగంగా ప్రజల నుంచి వెండి ఇటుకలను, ఇతర లోహాలతో తయారు చేసిన ఇటుకలను స్వీకరిస్తారు. భక్తులు ఇచ్చిన ఇటుకలను రథంలోనే అయోధ్యకు తరలిస్తారట! ఆల్‌రెడీ ఇలాంటి రథయాత్ర ఒకటి బుందెల్‌ఖండ్‌లో ఉనన్ సాగర్‌ జిల్లాలోని సురఖి నియోజకవర్గంలో ప్రారంభమయ్యింది కూడా! జ్యోతిరాదిత్య సింధియాకు అత్యంత సన్నిహితుడైన రాష్ట్ర మంత్రి గోవింద్‌ రాజ్‌పుత్‌ నేతృత్వంలో ఈ రథయాత్ర సాగుతోంది.. సింధియా నాయకత్వంలో పాతికమంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు అధిష్టానంపై తిరుగుబాటు చేసి బీజేపీ పంచన చేరిన సంగతి తెలిసిందే. సురఖీ నియోజకవర్గం నుంచి మరోసారి గెలవాలన్న పట్టుదలతో రాజ్‌పుత్‌ ఉన్నారు.. పదకొండు రోజుల పాటు సాగే ఈ రథయాత్ర అసెంబ్లీ నియోజకవర్గమంతా చుట్టేస్తుంది.. రాబోయే రోజుల్లో ఇలాంటి రథయాత్రలు మరిన్ని జరిగే అవకాశముంది. అయితే బీజేపీ నుంచి దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికార ప్రకటన రాలేదు.. తమ ఎన్నికల ప్రచారమంతా అభివృద్ధి అంశంపైనే సాగుతుందని బీజేపీ అంటోంది. రామమందిరం ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశమని, ఓటర్ల మనస్సులను గెల్చుకోడానికి ఇది దోహదపడుతుందని కమలదళం అంటోంది.. అయితే ఎన్నికల ప్రచారంలో మాత్రం తమ ప్రధాన ఎజెండా ఇది కాదని, కచ్చితంగా అభివృద్ధి అంశాన్నే ఎత్తుకుంటామని చెబుతున్నారు బీజేపీ నేతలు. 15 ఏళ్లలో తాము సాధించిన ప్రగతిని కేవలం 15 నెలల్లోనే కమల్‌నాథ్‌ ప్రభుత్వం నాశనం చేసిందని ఆరోపిస్తున్నారు. 2018తో పోలిస్తే కాంగ్రెస్‌ పరిస్థితి ఇప్పుడు దిగజారిందని బీజేపీ అధికార ప్రతినిధి దీపక్‌ విజయ్‌వర్గీయ తెలిపారు.

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలలోని 65 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఉప ఎన్నికలు సింధియా వర్గానికి అత్యంత కీలకం.. గెలిస్తే సరేసరి.. లేకపోతే కష్టమే! మరోవైపు మధ్యప్రదేశ్‌లో ఉన్న బీజేపీ సర్కారుకు ఈ ఎన్నికల ఫలితాలు అత్యంత కీలకం. 230 మంది సభ్యులు ఉన్న మధ్యప్రదేశ్‌లో బీజేపీ మెజారిటీ సాధించాలంటే తొమ్మిది స్థానాలను గెల్చుకోవాలి.. ఇప్పుడు బీజేపీ బలం 107గా ఉంటే కాంగ్రెస్‌కు 89 మంది శాసనసభ్యులు ఉన్నారు. మధ్యప్రదేశ్‌లో 1,052 మండలాలలో బీజేపీ ప్రతినిధుల చేతుల్లో ఉన్నాయి.. ఇది కాకుండా బీజేపీ ప్రధాన కర్షకులు, సోషల్‌ వర్కర్లు, మేథావులు, డాక్టర్లు, లాయర్లతో తరచూ సమావేశమవుతూ వస్తున్నది.

మరోవైపు కాంగ్రెస్‌ కూడా సెంటిమెంట్‌నే నమ్ముకుంది. హిందుత్వ బీజేపీ సొంతం కాదని చెబుతున్న కాంగ్రెస్‌ … చింద్వారా జిల్లాలో 101 అడుగుల ఎత్తైన హనుమంతుడి విగ్రహాన్ని కమల్‌నాథే ఏర్పాటు చేశారన్న విషయాన్ని విస్మరించకూడదని అంటోంది. అలాగే ఉప ఎన్నికల ప్రచారాన్ని ఉజ్జయిని మహంకాల్‌ ఆలయం నుంచి మొదలు పెడతామని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అజయ్‌ యాదవ్‌ చెబుతున్నారు. ప్రజల విశ్వాసాలు, నమ్మకాలకు తాము గౌవరవిస్తామని, వారి మనోభావాలు దెబ్బతినేలా తాము ఎప్పుడూ ప్రవర్తించమని వివరిస్తున్నారు. అయోధ్యలో భూమి పూజను తాము కూడా స్వాగతించామని చెబుతున్నారు. 15 నెలలో కమలనాథ్‌ సర్కార్‌ ఎన్నో ఘనతలను సాధించిందని, రాష్ట్రాభివృద్ధి కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని అజయ్‌ యాదవ్‌ అంటున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu