మిత్రపక్షాలే కానీ ఎవరి దారివారిదే! ఎగ్జాంపుల్ ఇదే..

రాజకీయంగా వారిది ఉమ్మడి ఎజెండా ! ఎజెండాలు కలిసాయి.. ఇక జెండాలు కలిపి పోరాటం చేయడమే అన్నారు. ఇంతలో కరోనా ప్రభావం మొదలైంది. తాజాగా కరోనాతో కలిసి సహజీవనం చేస్తున్న పరిస్థితి. ఇక రాజకీయ ఉద్యమాలకు తెరలేపాల్సిందేనని ఇరు పార్టీలు నిర్ణయించాయి.

మిత్రపక్షాలే కానీ ఎవరి దారివారిదే! ఎగ్జాంపుల్ ఇదే..

రాజకీయంగా వారిది ఉమ్మడి ఎజెండా ! ఎజెండాలు కలిసాయి.. ఇక జెండాలు కలిపి పోరాటం చేయడమే అన్నారు. ఇంతలో కరోనా ప్రభావం మొదలైంది. తాజాగా కరోనాతో కలిసి సహజీవనం చేస్తున్న పరిస్థితి. ఇక రాజకీయ ఉద్యమాలకు తెరలేపాల్సిందేనని ఇరు పార్టీలు నిర్ణయించాయి. కార్యాచరణ ప్రకటించాయి. ఇంకేముంది రెండు పార్టీలు కలిసి కదం తొక్కడమే తరువాయి అనుకున్నారు అంతా. కానీ సీన్ మాత్రం వేరేలా వుంది. ఎవరికీ వారే యమునాతీరే అన్నట్లు ఆ రెండు పార్టీల వ్యవహారం నడుస్తోంది. అధికార పార్టీపై ట్విటర్ వేదికగా ఒకరు…జూమ్‌లో మరొకరు.. ఇన్నాళ్లు కదం తొక్కారు. వారి తీరు ఇప్పుడు చూస్తే మాత్రం ఎవరి ఎజెండా వారిదే అంటూ సోలో సాంగ్‌ పాడుతున్నారు.

బీజేపీ, జనసేన… ఏపీ రాజకీయాల్లో మిత్రపక్షాలు. కలిసినడుద్దామని జాతీయస్థాయిలో నిర్ణయించారు. కరోనా టైమ్‌ కంటే ముందు ఉమ్మడి పోరాటాలు చేశారు. లాక్‌డౌన్‌ తర్వాత మళ్లీ ఇప్పుడు ఉమ్మడి ఆందోళనలు చేద్దామని అనుకున్నారు. అయితే విజయవాడలో జులై 22 బుధవారం కనిపించిన సీన్‌ మాత్రం పూర్తి రివర్స్‌గా ఉంది.

పేదలకు ఇళ్ల కేటాయింపులో ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తూ బీజేపీ, జనసేన రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేపట్టాయి. అయితే ఎవరి డప్పు వారిదే కొట్టుకున్నారు. ఎవరి ఆఫీసు ముందు వారే నినదించారు. కానీ రెండు పార్టీలు కలిసి ఉమ్మడి గళం మాత్రం వినిపించలేదు. బీజేపీ ఆఫీసు ముందు బీజేపీ నేతలు నిరసన చేపట్టారు. జనసేన నాయకులు విడిగా ఆందోళన చేపట్టారు. చివరకు వేర్వేరు ప్రెస్‌మీట్లతో అధికారపార్టీపై మాటలతో దండయాత్ర చేశారు.

జాతీయ స్థాయిలో రెండు పార్టీల నేతలు కలిశారు. రాష్ట్రస్థాయిలో ఒక్కటయ్యారు. కానీ లోకల్‌గా కేడర్‌ మాత్రం కలవడం లేదనేది కొందరి వాదన. ఏపీలో ప్రత్యామ్నాయం శక్తిగా ఎదగాలంటే మాత్రం రెండు పార్టీలు కలిసి నడిస్తే సాధ్యమనేది కొందరి విశ్లేషకుల మాట. ఇలా ఒంటరిపోరాటాలతో సాధించేది ఏం లేదంటున్నారు.