AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ebola Outbreak: ఎబోలా వైరస్ విజృంభణ.. ఆ దేశాలకు వెళ్లొద్దు: పౌరులకు భారత ప్రభుత్వం కీలక సూచనలు

ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తూ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్‌లలో ఇప్పటికే 140 మందికిపైగా మృతి చెందగా.. వందలాది అనుమానిత కేసులు నమోదయ్యాయి. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమై.. ఆఫ్రికా దేశాలకు అనవసర ప్రయాణాలు చేయొద్దని పౌరులకు సూచించింది.

Ebola Outbreak: ఎబోలా వైరస్ విజృంభణ.. ఆ దేశాలకు వెళ్లొద్దు: పౌరులకు భారత ప్రభుత్వం కీలక సూచనలు
Ebola Virus
Shaik Madar Saheb
|

Updated on: May 24, 2026 | 9:55 AM

Share

ఆఫ్రికాలో ఎబోలా వైరస్‌ వేగంగా విజృంభిస్తోంది. కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్‌ లాంటి ఆఫ్రికా దేశాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఆయా దేశాల్లో ఎబోలా వైరస్‌ బారిన పడి ఇప్పటివరకు దాదాపు 140 మందికిపైగా మృతి చెందారు. దాదాపు 600లకు పైగా అనుమానిత కేసులను గుర్తించారు. ఈ పరిణామాలు ప్రపంచ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి.. వైరస్ తీవ్రత చాలా ఎక్కువగా ఉండటం, ఎలాంటి చికిత్స లేకపోవడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఇప్పటికే.. గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని జారీ చేసింది. కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్‌లలో ఎబోలా వ్యాప్తి వేగంగా ఉండటంతో.. ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది.. ఆఫ్రికాలో ఎబోలా వైరస్‌ వేగంగా విస్తరిస్తుండటం.. మరణాల సంఖ్య పెరుగుతుండటంతో భారత ప్రభుత్వం అలర్టయ్యింది. ఎబోలా వైరస్ వ్యాప్తి ఈ మూడు దేశాలను తీవ్రంగా దెబ్బతీసిందని.. కావున డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్‌తో సహా పలు దేశాలకు అన్ని రకాల అనవసర ప్రయాణాలను నివారించాలని భారతదేశం పౌరులకు సూచించింది.

ప్రయాణాలకు దూరంగా ఉండటంతో పాటు, ఈ మూడు దేశాల్లో నివసిస్తున్న పౌరులు అవసరమైన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని, స్థానిక అధికారులు జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని కూడా ప్రభుత్వం సూచించింది. “డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఇతర ప్రభావిత దేశాలలో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా, మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సిఫార్సులకు అనుగుణంగా, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్‌లకు అత్యవసరం కాని ప్రయాణాలను మానుకోవాలని భారత ప్రభుత్వం తన పౌరులందరికీ సలహా ఇస్తోంది”.. అని భారత ప్రభుత్వం జారీ చేసిన ఆరోగ్య సలహాలో పేర్కొంది.

ఈ లక్షణాలు కనిపిస్తే..

ఇప్పటికే.. ఎబోలాపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన కేంద్ర ఆరోగ్యశాఖ.. భారత్‌లో ఎబోలా భయం లేదని ప్రకటించింది. అయితే.. ఇతర దేశాల నుంచి వచ్చేవారికి ఎయిర్‌పోర్టుల్లో ముందస్తు స్క్రీనింగ్‌, క్వారంటైన్‌ ప్రొటోకాల్స్‌ అమలు చేయాలని ఆదేశించింది. ల్యాబ్‌ పరీక్షలు, ఆస్పత్రుల సన్నద్ధతను పర్యవేక్షించాలని.. వైరస్‌ నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేసింది. దీంతో పాటు.. సరిహద్దుల్లోనూ హైఅలర్ట్‌ ప్రకటించింది. ఇప్పటికే.. ఎబోలా వైరస్‌ కలకలంతో ఢిల్లీ ఎయిర్‌పోర్టు అధికారులు కీలక అడ్వైజరీ జారీ చేశారు. కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్‌ నుంచి వచ్చే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. జ్వరం, తలనొప్పి, నీరసం, కండరాల నొప్పులు లాంటి సమస్యలు కనిపిస్తే వెంటనే ఎయిర్‌పోర్టు వైద్యసిబ్బందికి సమాచారం ఇవ్వాలని సూచించారు. ఇప్పుడు కేంద్ర ఆరోగ్య శాఖ కూడా అధికారులను, ప్రజలను అలర్ట్‌ చేసింది.

ఇండియా- ఆఫ్రికా ఫోరమ్‌ సమ్మిట్‌ వాయిదా

మరోవైపు.. ఎబోలా వ్యాప్తి ఆందోళనతో ఢిల్లీ వేదికగా ఈ నెల 28-31 మధ్య జరగాల్సిన ఇండియా- ఆఫ్రికా ఫోరమ్‌ సమ్మిట్‌ కూడా వాయిదా పడింది. భారత్‌, ఆఫ్రికన్‌ యూనియన్‌ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు విదేశాంగశాఖ వెల్లడించింది. రెండు దేశాల చర్చల తర్వాత కొత్త తేదీలను ఖరారు చేస్తామని తెలిపింది.

Follow Us