మహారాష్ట్రలో అధికార పంపిణీపై బీజేపీ-శివసేన మధ్య సిగపట్లు కొనసాగుతుండగా.. ఎన్సీపీ సీనియర్ నేత శరద్ పవార్ రంగంలోకి దిగారు. ఆయన సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి బీజేపీ రాకుండా అడ్డుకునేందుకు శివసేనకు తమ పార్టీ మద్దతునివ్వడానికి గల అవకాశాలపై ఆయన ఆమెతో చర్చించవచ్చునని భావిస్తున్నారు. ఆదివారం ఆయన ముంబైలో తమ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. అయితే ఎన్సీపీ-కాంగ్రెస్-శివసేన ‘ టై అప్ ‘ విషయాన్ని పవార్ తేలిగ్గా తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. దీనిపై పెద్దగా మాట్లాడేందుకు ఏముందనిఆయన ప్రశ్నించారు. బీజేపీతో గానీ, సేనతో గానీ నిమిత్తం లేకుండా రాజకీయ పార్టీలు మాట్లాడుకోవచ్ఛునని వ్యాఖ్యానించారు. అటు-శివసేనతో కలిసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీకి చెందిన హుసేన్ దాల్వాయ్ అనే ఎంపీ… సోనియాకు లేఖ రాయడం గమనార్హం. గతంలో ఎన్నోసార్లు సేన కాంగ్రెస్ పార్టీకి మద్దతునిచ్చిందని ఆయన అన్నారు .మైనారిటీ వర్గాలతో సహా మన పార్టీలోని కొన్ని వర్గాలు ఎన్సీపీని తమ మిత్ర పక్షంగా భావిస్తున్నాయని హుసేన్ తన లేఖలో పేర్కొన్నారు. అందువల్ల ఇదే సమయంలో సేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తప్పేమిటి అని ప్రశ్నించారు. అటు-శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ గత నెల 31 న శరద్ పవార్ తో భేటీ అయ్యారు. తమ పార్టీ తలచుకుంటే సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన బలం ఉందని ఆయన అన్నారు. పైగా సేన అధినేత ఉధ్ధవ్ థాక్రే నిన్న శరద్ పవర్ తో ఫోన్ లో మాట్లాడినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఎన్సీపీ ఈ వార్తలను ఖండించింది. ఇటీవలి ఎన్నికల్లో ఎన్సీపీ 54 స్థానాలను, కాంగ్రెస్ పార్టీ 44 సీట్లను గెలుచుకున్నాయి .తాజా సీన్ చూస్తే.. బీజేపీతో ‘ దోస్తానా ‘ ఖతమైన పక్షంలో శివసేన .. ఎన్సీపీతో చేతులు కలిపినా కలపవచ్చుననే సంకేతాలు కనిపిస్తున్నాయి.