తెలుగు రాష్ట్రాల్లో కదిలిన ఆర్టీసీ రథచక్రాలు

ఎట్టకేలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సు చక్రాలు కదిలాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లెక్కల ప్రకారమే ప్రయాణం సాగించిన ఆర్టీసీ బస్సులు తాజాగా కొత్త ఒప్పందం మేరకు ప్రయాణించనున్నాయి.

  • Balaraju Goud
  • Publish Date - 8:07 pm, Mon, 2 November 20
తెలుగు రాష్ట్రాల్లో కదిలిన ఆర్టీసీ రథచక్రాలు

ఎట్టకేలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సు చక్రాలు కదిలాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లెక్కల ప్రకారమే ప్రయాణం సాగించిన ఆర్టీసీ బస్సులు తాజాగా కొత్త ఒప్పందం మేరకు ప్రయాణించనున్నాయి. ఈమేరకు రెండు రాష్ట్రాల మధ్య సమగ్ర ఒప్పందం కుదిరిందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. సోమవారం రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల మధ్య ఒప్పందం కుదిరింది. ఒప్పందాలపై ఇరు రాష్ట్రాల అధికారులు సంతకాలు చేసి, మంత్రి సమక్షంలో ఫైళ్లను మార్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర ఒప్పందం లేదనే విషయం కరోనా వల్లే తెలిసిందన్నారు. ఈ ఒప్పందంతో ఏపీఎస్‌ ఆర్టీసీకి లాభమేనన్నారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ, తెలంగాణ మధ్య రాకపోకలు ఎక్కువగా ఉంటాయన్నారు. ఈ మేరకు సమర్థవంతమైన ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇక, చార్జీల పెంచే ఆలోచన టీఎస్‌ ఆర్టీసీకి లేదని మంత్రి మరోసారి స్పష్టం చేశారు. జాప్యం కారణంగా తెలంగాణ ఆర్టీసీకి రూ.2వేల కోట్లు, ఏపీఎస్‌ ఆర్టీసీకి రూ.2400 కోట్ల నష్టం జరిగిందని మంత్రి అంగీకరించారు.

తాజాగా జరిగిన ఒప్పందంతో తెలంగాణ ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్‌లో 826 బస్‌లు నడువనుండగా.. 1,61,258 కిలోమీటర్లు తిరుగనున్నాయి. విజయవాడ రూట్‌లో 273 బస్సులు 52,944 కిలోమీటర్లు నడవనున్నాయి. అలాగే, తెలంగాణలో ఏపీ 638 బస్సులు తిప్పనుండగా.. 1,60,999 కిలోమీటర్ల మేర నడువనున్నాయి. హైదరాబాద్‌ రూట్‌లో 192 సర్వీసులు 52,524 కిలోమీటర్లు ఏపీ తిప్పనుంది. సోమవారం అర్ధరాత్రి నుంచి ఇరు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఎట్టకేలకు రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం కావడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు, ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందం కొలిక్కి రావడంతో ఏపీఎస్‌ ఆర్టీసీ బస్సు సర్వీసులను ప్రారంభించింది. విజయవాడ నుంచి హైదరాబాద్‌లోని మియాపూర్‌కు తొలి సూపర్‌ లగ్జరీ బస్సు బయలుదేరింది. సీట్లు పూర్తిగా నిండడంతో సాయంత్రమే బస్సు హైదరాబాద్‌కు బయలుదేరింది. బస్టాండ్‌కు వచ్చిన వారికి అప్పటికప్పుడే ఆర్టీసీ టికెట్లు జారీ చేస్తోంది ఏపీఎస్ఆర్టీసీ. అలాగే, ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌ను సైతం ప్రారంభించింది. సుమారు ఏడు నెలల తర్వాత రెండు రాష్ట్రాల మధ్య సర్వీసులు ప్రారంభమయ్యాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో మార్చి 22 నుంచి తెలుగు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు నిలిచిపోయాయి.