ప్రవాసీ కోటాకు కువైట్ ఆమోదం.. 8 లక్షల భారతీయులకు ఏఫెక్ట్..!

కువైట్‌ సర్కార్ కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. ఆ దేశంలోని విదేశీయుల సంఖ్యను గణనీయంగా తగ్గించుకునేందుకు ప్రవాసీ కోటా బిల్లును తీసుకువచ్చింది. దేశంలో 70శాతంగా ఉన్న ప్రవాసీయులను 30 శాతానికి తగ్గించాలని నిర్ణయించింది. ఈ బిల్లు చట్టంగా మారితే 8 లక్షల మంది భారతీయులపై కూడా ప్రభావం పడుతుందంటున్నారు నిపుణులు.

ప్రవాసీ కోటాకు కువైట్ ఆమోదం.. 8 లక్షల భారతీయులకు ఏఫెక్ట్..!
Follow us

|

Updated on: Jul 07, 2020 | 2:38 PM

కువైట్‌ సర్కార్ కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. ఆ దేశంలోని విదేశీయుల సంఖ్యను గణనీయంగా తగ్గించుకునేందుకు ప్రవాసీ కోటా బిల్లును తీసుకువచ్చింది. దేశంలో 70శాతంగా ఉన్న ప్రవాసీయులను 30 శాతానికి తగ్గించాలని నిర్ణయించింది. ఈ బిల్లు చట్టంగా మారితే 8 లక్షల మంది భారతీయులపై కూడా ప్రభావం పడుతుందంటున్నారు నిపుణులు.

కరోనా ప్రభావంతో కువైట్‌లో చమురు ధరలు భారీగా పడిపోయాయి. దీంతో దేశ ఆదాయానికి భారీ గండిపడింది. అటు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 49వేలు దాటింది. ఈ నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా కువైట్ వ్యాప్తంగా ఉన్న విదేశీయులను వెనక్కు పంపించాలనే డిమాండ్‌ పెరిగింది. దీంతో ఆ దేశ ప్రధాని షేక్‌ సబా అల్‌-ఖలీద్‌ అల్‌-సబా ఈ బిల్లును ప్రతిపాదించారు. దేశంలో 70శాతంగా ఉన్న ప్రవాసీయులను 30 శాతానికి తగ్గించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా తీసుకువచ్చిన ప్రవాసీ కోటా ముసాయిదా బిల్లుకు ఆ దేశ జాతీయ శాసనసభ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు చట్టంగా మారితే అక్కడ ఉన్న దాదాపు 8 లక్షల మంది భారతీయులు వెనుకకు రావాల్సి పరిస్థితి ఏర్పడింది.

కువైట్‌ మొత్తం జనాభా 43 లక్షలు. అందులో వివిధ దేశాలకు చెందిన 30 లక్షల మంది కువైట్ లో స్థిరపడ్డారు. ఈ సంఖ్యలో అత్యధికంగా భారతీయులే 14 లక్షల మంది ఉన్నారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. తాజా బిల్లు ప్రకారం కువైట్‌లో భారత జనాభా 15శాతం కంటే ఎక్కువ ఉండకూడదని నిబంధన తీసుకువచ్చింది ఆ దేశ ప్రభుత్వం. అయితే, అందరినీ ఒక్కసారే కాకుండా ఏడాదికి కొంతమంది చొప్పున విడతల వారిగా తిరిగి పంపించాలని అధికారులు నిర్ణయించారు. అయితే, ఈ బిల్లుకు చట్టబద్ధత ప్రక్రియ పూర్తి కావల్సివుంది. మరోవైపు ఆ దేశ అసెంబ్లీ స్పీకర్‌ మర్జూఖ్‌ అల్‌-ఘానెమ్‌ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రకారం అక్కడ 28వేల మంది భారతీయులు నర్సులు, ఇంజినీర్లు, చమురు కంపెనీల్లో నిపుణులుగా పనిచేస్తున్నారు. దాదాపు 5.23 లక్షల మంది ప్రైవేటు రంగంలో పనిచేస్తున్నారు. 60 వేల మంది విద్యార్థులు వివిధ యూనివర్సిటీల్లో ఉన్నత చదువులు అభ్యసిస్తున్నారు. ఇందులో నైపుణ్యం కలిగిన వారికి అవకాశం కల్పిస్తూ శ్రామికులు, కార్మికులను తిరిగి పంపనున్నట్టు తెలుస్తోంది. ఇదే గనక జరిగితే భారత ప్రభుత్వంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు ఆర్థిక నిపుణులు. ప్రస్తుతం ఇండియా విదేశీ మారక నిల్వలు పెరగడంలో కువైట్‌ ముఖ్య భూమికను పోషిస్తోంది. అక్కడ నుంచి 2018లో 4.8 బిలియన్‌ డాలర్ల అంటే దాదాపు రూ. 36వేల కోట్లు చెల్లింపులు జరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. భారతీయులు భారీ సంఖ్యలో వెనక్కు వచ్చేస్తే వ్యక్తిగతంగా ఆర్థిక ఇబ్బందులతో పాటు ప్రభుత్వ ఆదాయానికి కూడా గండి పడే ప్రమాదం లేకపోలేదంటున్నారు ఆర్థికవేత్తలు.

ఇదిలావుంటే, ప్రవాసీ కోటా బిల్లు సంబంధించి అధికారిక సమాచారం ఏదీ కువైట్‌ ప్రభుత్వం తమకు తెలుపలేదని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. కువైట్‌లోని భారతీయులను పంపించాలంటే వారి స్థానాల్లో పనిచేయడానికి ప్రత్యామ్నాయం అవసరం అని. ప్రాక్టికల్‌గా ఇది సాధ్యంకాదని అధికారులు చెబుతున్నారు.