56 బంతుల్లో 134 నాటౌట్‌… 4 ఓవర్లలో 8 వికెట్లు…!

Krishnappa Gowtham Smashes Unbeaten Century Takes Eight Wickets In KPL Match, 56 బంతుల్లో 134 నాటౌట్‌… 4 ఓవర్లలో 8 వికెట్లు…!

కర్ణాటక ప్రీమియర్‌ లీగ్‌(కేపీఎల్‌)లో భారత క్రికెటర్‌ కృష్ణప్ప గౌతమ్‌ సంచలన ప్రదర్శన చేశాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో రాజస్థాన్‌ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న గౌతమ్‌కు టీ20 ఫార్మాట్‌లో మంచి రికార్డు ఉంది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో రాజస్థాన్‌కు ఎన్నో మ్యాచ్‌ల్లో విజయాలు అందించి ఆకట్టుకున్నాడు. తాజాగా కేపీఎల్‌లో భాగంగా షిమొగ లయన్స్‌తో మ్యాచ్‌లో గౌతమ్‌(134 నాటౌట్‌ 56 బంతుల్లో 7ఫోర్లు, 13సిక్సర్లు) మెరుపు శతకంతో విరుచుకుపడటంతో బళ్లారీ టస్కర్స్‌ 17 ఓవర్లలో 3 వికెట్లకు 203 పరుగులు చేసింది. కేపీఎల్‌లో ఇదే అత్యంత వేగవంతమైన సెంచరీ కావడం విశేషం. కేవలం ఫోర్లు, సిక్సర్ల ద్వారానే అతడు 106 రన్స్‌ రాబట్టాడు. ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు(13) నమోదు కావడం ఇదే తొలిసారి.

ఆటకు వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 17 ఓవర్లకు కుదించారు. ప్రత్యర్థి బౌలర్లపై యువ ఆల్‌రౌండర్‌ ఎదురుదాడికి దిగడంతో లయన్స్‌ టీమ్‌ భారీ స్కోరు సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన షిమొగను గౌతమ్‌ బంతితో తిప్పేశాడు. 4 ఓవర్లు వేసిన కృష్ణప్ప 8 వికెట్లు తీసి కేవలం 15 పరుగులే ఇచ్చాడు. మొత్తంగా ఒక టీ20 మ్యాచ్‌లో అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శన ఇదే కావడం విశేషం. గౌతమ్‌ కట్టుదిట్టంగా బంతులేయడంతో లయన్స్‌ ఆటగాళ్లు వరుసగా పెవిలియన్‌ బాటపట్టారు. కేవలం అక్షయ్‌ బల్లాల్‌(40), పవన్‌ దేశ్‌పాండే(46), హెఎస్‌ శరత్‌(11) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. మిగతా బ్యాట్స్‌మెన్‌ సింగిల్‌ డిజిట్‌కే పెవిలియన్‌ బాటపట్టడంతో 16.3 ఓవర్లలో 133 పరుగులకే ఆ జట్టు కుప్పకూలింది. దీంతో టస్కర్స్‌ టీమ్‌ 70 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా కృష్ణప్ప నిలిచాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *