రెంటికీ చెడ్డ రేవడిగా తయారైన కోడెల పరిస్థితి

Kodela Siva Prasada Rao Political Carrier in Dilemma, రెంటికీ చెడ్డ రేవడిగా తయారైన కోడెల పరిస్థితి

టీడీపీ ఓడిపోయింది. చాలా మంది సీనియర్లు ఓడిపోయారు. కానీ…కోడెలను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత వరసగా కె ట్యాక్స్‌ బాధితులు బయటకు రావడం మొదలుపెట్టారు. అందులో టీడీపీ వాళ్లు కూడా ఉండటంతో పూర్తిగా డిఫెన్స్‌లో పడిపోయే పరిస్థితి ఏర్పడింది. అటు కేసుల సెగ భగ్గుమంటూ ఉండగానే…ఇటు అసమ్మతి వర్గం ఏకంగా చంద్రబాబునే కలిసి ఈయన మాకొద్దని చెప్పేసింది.

నిజానికి కోడెల అనగానే వెంటనే గుర్తుకొచ్చేది నర్సరావుపేట నియోజకవర్గం. పేట కోడెల కోటగా నాడు రాజకీయ వర్గాలు చెబుతూ ఉండేవి. అలాంటి నియోజకవర్గాన్ని వదిలి సత్తెనపల్లిలో పొలిటికల్‌గా సెటిల్‌ అయ్యే ప్రయత్నం చేశారు కోడెల. కానీ ఐదేళ్లు పార్టీ పవర్‌లో ఉన్న సమయంలో కోడెల, ఆయన కుటుంబసభ్యులు వ్యవహరించిన తీరు…ఇప్పుడాయన్ని వదల బొమ్మాళి వదల అంటోంది. దీంతో…అటు సొంత నియోజకవర్గం… ఇటు వలస వచ్చిన నియోజకవర్గం…రెండికీ చెడ్డ రేవడిగా తయారైంది కోడెల పరిస్థితి.

సత్తెనపల్లి ఇన్‌చార్జ్‌గా కోడెలను తొలిగించాలని అసమ్మతి వర్గం గట్టిగా డిమాండ్‌ చేస్తోంది. పంచాయితీ చంద్రబాబు వద్దకు చేరడంతో…అసమ్మతి వర్గంతో చర్చించడానికి రాయపాటి రంగారావుని పంపారు చంద్రబాబు. నిజానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో సత్తెనపల్లి ఎమ్మెల్యే టిక్కెట్‌ తన కుమారుడికి ఇవ్వాలని రాయపాటి సాంబశివరావు చంద్రబాబును అడిగినట్టు తెలుగుతమ్ముళ్లలో గుసగుసలు నడిచాయి. ఇప్పుడు అదే రాయపాటి రంగారావుని చంద్రబాబు రంగంలోకి దించారు. దీంతో….కోడెల వ్యతిరేకవర్గం అంతా రంగారావుకి జై కొడుతుందా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోందట. అటు చంద్రబాబు కూడా సత్తెనపల్లికి కొత్త ఇన్‌చార్జ్‌ని నియమించే దిశగా ఆలోచన చేస్తున్నారా అన్న ప్రశ్న పార్టీ శ్రేణుల్లో హల్‌చల్‌ చేస్తోందట.

ఇక నర్సరావుపేటలో టీడీపీ ఇన్‌చార్జ్‌గా డాక్టర్‌ అరవింద్‌ బాబు కంటిన్యూ అవుతున్నారు. దీంతో…ఇప్పుడు కోడెల అక్కడికి వెళ్లే పరిస్థితి కూడా లేదని తెలుగుతమ్ముళ్లు చెబుతున్నారట. ఓవైపు కేసులు, మరోవైపు అసమ్మతి సెగలు అన్నీ కలిసి కోడెల రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకంలో పడేశాయి అంటున్నాయి పొలిటికల్‌ సర్కిల్స్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *