కళ్లల్లో తడిని, గుండెల్లో ఎనర్జీని నింపిన సంఘటన !

నాలుగైదేళ్ల కిందటి ముచ్చట... అప్పట్లో వచ్చిన ఓ వార్త నిజంగానే చాలా మందిని ఆకర్షించింది... అబ్బురపరిచింది... ఆనందపరచింది. అదేమిటంటే జపాన్‌లో ఓ స్కూల్‌ విద్యార్థిని కోసమే ఓ రైలు నడవటం... దక్షిణ జపాన్‌లోని హోకైడో ద్వీపంలో కామి అనే చిన్న ఊరుంది..

కళ్లల్లో తడిని, గుండెల్లో ఎనర్జీని నింపిన సంఘటన !
Follow us

|

Updated on: Jun 05, 2020 | 12:57 PM

నాలుగైదేళ్ల కిందటి ముచ్చట… అప్పట్లో వచ్చిన ఓ వార్త నిజంగానే చాలా మందిని ఆకర్షించింది… అబ్బురపరిచింది… ఆనందపరచింది. అదేమిటంటే జపాన్‌లో ఓ స్కూల్‌ విద్యార్థిని కోసమే ఓ రైలు నడవటం… దక్షిణ జపాన్‌లోని హోకైడో ద్వీపంలో కామి అనే చిన్న ఊరుంది.. అక్కడ చిన్నపాటి బడి కూడా లేదు… పైగా ఆ ఊర్లో అటు ఇటు ప్రయాణించేవారు కూడా అంతగా ఉండరు.. అంచేత ఆ ఊరుకు ఉన్న ఒక్కగానొక్క రైలును షిరాటాకి అనే స్టేషన్‌లోనే ఆపేసి కామి స్టేషన్‌ను మూసేయాలని హకాడియో రైల్వే కంపెనీ అనుకుంది… అయితే కామి నుంచి రోజూ కనా అనే బాలిక ఆ రైల్లోనే పక్క ఊరు షిరాటాకిలోని స్కూల్‌కు వెళ్లి వస్తుంటుంది.

మరో విశేషమేమిటంటే ఆ గ్రామం నుంచి షిరాటాకి వెళ్లి చదివే చివరి విద్యార్థిని కనానే కావడం.. రైలుని రద్దు చేస్తే ఇక ఆమె బడికెళ్లే అవకాశాన్ని కోల్పోతుంది. ఇది తెలుసుకున్న హకోడియా రైల్వే కంపెనీ మనసు మార్చుకుంది… కేవలం కనా కోసం రెండు రైళ్లని నడపాలని నిర్ణయించింది. ఒకటేమో స్కూలుకి తీసుకెళ్లేది. మరొకటేమో తిరిగి తెచ్చేది. ఆ రెండు రైళ్లలోనూ కనా ఒక్కరే ప్రయాణికురాలు..కనా స్కూల్‌కి వెళ్లే టైమ్‌కు కామి స్టేషన్‌ నుంచి రైలు బయలుదేరుతుండేది… సాయంత్రం అయిదింటికి మళ్లీ షిరాటాకి స్టేషన్‌ నుంచి కనాను ఎక్కించుకుని కామి స్టేషన్‌కు చేరుకునేది… ఇంజన్‌కి కేవలం రెండు పెట్టెలే ఉండేవి.. రైలు పెట్టెలో కేవలం కానా మాత్రమే కూర్చుని ఉండేది. అలా 2012 నుంచి 2016 వరకు అంటే కనా స్కూల్ విద్య ముగిసే వరకు ఈ రైళ్లని నడిపారు. అన్నట్టు తన కోసం రైలు నడిచిన నాలుగేళ్లల్లో కనా ఒక్కసారి కూడా స్కూల్‌కి వెళ్లడం మానలేదు. హకాడియో రైల్వే కంపెనీ మంచితానికి ఔదర్యానికి జపాన్‌ ప్రజలే కాదు.. యావత్‌ ప్రపంచం ఆనందించింది.

ఇది చదివిన తర్వాత చాలామంది మన దేశంలో అయితే… అంటూ దీర్ఘాలు తీశారు.. ప్రభుత్వ యంత్రాంగం మీద మనకున్న నమ్మకం అలాంటిది మరి! కానీ మన దేశంలో కూడా వ్యవస్థలు అప్పుడప్పుడు అద్భుతంగా పని చేస్తాయని తెలిస్తే తెలియకుండానే మనకు బోలెడంత ఎనర్జీ వస్తుంది… అచ్చంగా జపాన్‌లో జరిగిన సంఘటనలాంటిదే ఈమధ్య కేరళలో జరిగింది… అప్రయత్నంగానే కళ్లల్లో తడిని నింపింది… కేరళలోని అలప్పూజ జిల్లాలో సాండ్రాబాబు అనే ఓ అమ్మాయి ఉంది… 17 ఏళ్ల ఆ అమ్మాయి ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతోంది… ఉంటున్నది ఎమ్‌ఎన్‌ బ్లాక్‌లో… అది చిన్నపాటి ద్వీపంలాంటి ఊరు…కరోనా వైరస్‌ రాక ముందు కొన్ని పరీక్షలు జరిగాయి.

ఇప్పుడు లాక్‌డౌన్‌లు గట్రాలు లేకపోవడంతో మిగిలిన ఎగ్జామ్స్‌ కూడా కండక్ట్‌ చేయాలనుకుంది కేరళ ప్రభుత్వం… అందుకు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంది. సరే.. ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది కానీ.. సాండ్రాకే కష్టం వచ్చి పడింది.. ఆ పాప ఎగ్జామ్‌ సెంటర్‌ కొట్టాయంలోని కంజిరాంలో ఉంది.. అక్కడికి వెళ్లడం ఎలా? కరోనా కారణంగా బోట్లు ఆగిపోయాయి.. ఒక్కతే బోట్లో వెళ్లి రావడం కుదరని పని..! ఏ బోటు యజమాని ఇందుకు ఒప్పుకోడు.. అక్కడ ఒక్కో బోటులో 70 సీట్లుంటాయి.. బోటు నడవాలంటే సిబ్బంది ఉండాలి.. డ్రైవర్‌… నేవిగేటర్‌.. బోటు మాస్టర్‌.. ఇద్దరు అసిస్టెంట్లు లేనిదే బోటు నడవదు.. ఓ చిన్న ప్రయత్నం చేద్దామనుకుంది సాండ్రా… బోట్లను నడిపే ఎస్‌డబ్ల్యూటీడీ అధికారులకు తన సమస్యను విన్నవించుకుంది.. రెండే రెండు పరీక్షలు అని ప్రాధేయపడింది.. తన ఆర్ధిక పరిస్థితిని కూడా చెప్పుకుంది.. ఇదంతా కేరళ ప్రభుత్వానికి తెలిసింది.. వెంటనే సాండ్రా కోసం ప్రత్యేకంగా బోటును నడిపించింది..ఆమెను జాగ్రత్తగా కంజిరాం వరకు తీసుకెళ్లారు అధికారులు.. ఎగ్జామ్‌ అయ్యాక జాగ్రత్తగా ఇంటి దగ్గర దింపేసి వెళ్లిపోయారు.. మామూలుగా ఇలాంటి బోట్లకు ఒక్కో ట్రిప్పుకు నాలుగు వేల రూపాయల వరకు వసూలు చేస్తారు… కానీ సాండ్రా కోసమే ప్రత్యేకంగా బోటును నడిపారు. ప్రయాణికులు ఎవ్వరూ లేరు .. అయినప్పటికీ అధికారులు సాండ్రా దగ్గర తొమ్మిది రూపాయల ఛార్జి మాత్రమే వసూలు చేశారు… అంటే రోజుకు 18 రూపాయలు.. ఆ రెండు రోజులకు కేవలం 36 రూపాయలు మాత్రమే… ఇలాంటి సంఘటనలు ఓ పట్టాన నమ్మబుద్దేయదు.. కానీ నమ్మి తీరాలి… మన దగ్గర కూడా వ్యవస్థలు అప్పుడప్పుడు భేషుగ్గా పని చేస్తాయి.. సాండ్రా విషయంలో స్పందించిన అధికారులకు హాట్సాఫ్‌ చెప్పి తీరాలి.. సంబంధిత మంత్రికి ఎన్ని వీరతాళ్లు వేసినా తక్కువే! దేశంలో అందరూ ఇలాంటి అధికారులే ఉంటే… ప్రజాప్రతినిధులంతా ఆ మంత్రిలాగే స్పందిస్తే… మనం ఆశాజీవులం కదా…! ఆశిద్దాం…

..బాలు