కేరళ సర్కార్ కీలక నిర్ణయం.. పండ్లకు, కూరగాయలకు మద్దతు ధర

16 రకాల కూరగాయలు, పండ్లకు కనీస ధరలను నిర్ణయించిన మొదటి రాష్ట్రంగా కేరళ నిలిచింది.

  • Balaraju Goud
  • Publish Date - 4:31 pm, Thu, 22 October 20

16 రకాల కూరగాయలు, పండ్లకు కనీస ధరలను నిర్ణయించిన మొదటి రాష్ట్రంగా కేరళ నిలిచింది. కేంద్రం ఆమోదించిన రెండు వ్యవసాయ బిల్లుల నేపథ్యంలో కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) ను తొలగిస్తారన్న భయాలు ఉన్న సమయంలో, కేరళ ప్రభుత్వం బుధవారం 16 రకాల కూరగాయలు, పండ్లకు ‘మూల ధరలను’ ప్రకటించింది. నవంబర్ 1 నుండి నూతన ధరల విధానం అమల్లోకి వస్తుందని ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వి ఎస్ సునీల్ కుమార్ తెలిపారు. దేశంలో కూరగాయలు, పండ్లకు మూల ధరలు నిర్ణయించడం ఇదే మొదటిసారి అని ఆయన స్పష్టం చేశారు. మూల ధర కూరగాయలు, పండ్ల రకాన్ని బట్టి ఉత్పత్తి వ్యయంలో 20 శాతం ఉంటుందన్నారు. అంటే ఒక రైతుకు 20 శాతం మార్జిన్ హామీ ఇవ్వబోతున్నట్లు ఆయన వెల్లడించారు.

మొదటి దశలో మూల ధరలు (కిలోకు) ప్రకటించిన 16 రకాలు: టాపియోకా ధర రూ .12, అరటి రూ .30, వయనాదన్ అరటి రూ .24, పైనాపిల్ రూ .15, యాష్‌గోర్డ్ రూ. 9 , దోసకాయ రూ8, క్యారెట్ రూ .21, బంగాళాదుంప రూ .20, బీన్స్ రూ .28, బీట్‌రూట్ రూ .21, వెల్లుల్లి రూ. 139 ధరలను నిర్ణయించింది కేరళ ప్రభుత్వం.

బేస్ ధర విధానం కనీస మద్దతు ధర వ్యవస్థ వలే పనిచేస్తుంది. “కొత్త యంత్రాంగం ప్రకారం, ఒక నిర్దిష్ట పండ్ల, కూరగాయల మార్కెట్ ధర నిర్ణీత మూల ధర కంటే పడిపోతే ప్రభుత్వం రైతు నుండి సరుకును మూల ధర వద్ద కొనుగోలు చేస్తుంది. ఆ మొత్తాన్ని రైతు ఖాతాకు జమ చేస్తుందని వ్యవసాయం మంత్రి బుధవారం చెప్పారు.

జాతీయంగా, వ్యవసాయ ధరల కమిషన్ ఈ సీజన్ ప్రారంభంలో 22 రకాల ఎంఎస్‌పిలను ఫిక్సింగ్ చేస్తోంది. అయితే, ఎక్కువగా ధాన్యాలు, పప్పుధాన్యాలు నూనె గింజల ధరలను మాత్రమే నిర్ణయిస్తుంది. వాటిలో రెండు వస్తువులు, కొప్రా, వరి మాత్రమే కేరళకు సంబంధించినవి. దీంతో రైతలుకు పండ్ల, కూరగాయలకు కూడా కనీస మద్దతు ధర లభించాలన్ని ఉద్దేశ్యంతోనే ధరలను నిర్ణయించామని మంత్రి వెల్లడించారు. అయితే, ఒక రైతు గరిష్టంగా 15 ఎకరాలలో పండించిన కూరగాయలు, పండ్లకు మాత్రమే కనీస మూల ధరకు అర్హులని మంత్రి సునీల్ కుమార్ తెలిపారు.

ప్రాథమిక ధరను మొదట అధికారికంగా ప్రకటించాలి జిల్లా యంత్రాంగం నిర్ణయిస్తుంది. జిల్లా స్థాయి ధరల కమిటీ స్థానిక మార్కెట్ ధరలను రిఫరెన్స్ నోడల్ మార్కెట్లతో నిరంతరం పోల్చి చూస్తుంది. జిల్లాలో ఒక వస్తువు ధర దాని మూల ధర కంటే పడిపోయిందని కమిటీకి నమ్మకం వచ్చినప్పుడు, కనీన మద్దతు ధరను ప్రకటిస్తారు.  డిక్లరేషన్ చేసిన తర్వాత, రైతు తన ఉత్పత్తులను కూరగాయలను,పండ్లను ప్రమోషన్ కౌన్సిల్ కేరళం (విఎఫ్‌పికెకె), హార్టికార్ప్ సేకరణ కేంద్రాలకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ప్రాధమిక వ్యవసాయ రుణ సహకార సంఘాల సభ్యులు ఉంటే వ్యవసాయ శాఖ నోటిఫికేషన్ ఇచ్చిన వ్యవసాయ సంఘాలకు తీసుకెళ్లాలి. అయితే ఇందుకోసం రైతు మొదట www.aims.kerala.gov.in వెబ్ సైట్ లోకి లాగిన్ అవ్వడం ద్వారా వ్యవసాయ శాఖ సమాచార నిర్వహణ వ్యవస్థలో నమోదు చేసుకోవాలి.

ఉత్పత్తి ప్రాథమిక ధరను నిర్ధారించేందుకు కొన్ని నాణ్యతా ప్రమాణాలకు కట్టుబడి ఉంటుంది. రైతు నుంచి సేకరణ దశలో సరుకులను గ్రేడ్ చేస్తారు. తక్కువ-నాణ్యత గల పంటలకు కచ్చితమైన ధర ఉండదని కేరళ సర్కార్ వెల్లడించింది. స్థానిక సంస్థలు, ప్రాధమిక వ్యవసాయ రుణ సహకార సంఘాల (పిఎసిఎస్) సహాయంతో వ్యవసాయ శాఖ ఈ యంత్రాంగాన్ని సమన్వయం చేస్తుంది. ఈ విభాగంలో ప్రస్తుతం కేరళ అంతటా 1,850 సేకరణ ఏజెన్సీలు పని చేస్తున్నాయి. వీటిలో వెజిటబుల్ అండ్ ఫ్రూట్ ప్రమోషన్ కౌన్సిల్ కేరళం (విఎఫ్‌పిసికె), హార్టికార్ప్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.