నీతి ఆయోగ్ ర్యాంకింగ్‌లో.. పదో స్థానంలో తెలంగాణ..?

ప్రజల ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని 2015 నుంచి 2018 వరకు ఆయా రాష్ట్రాల్లోని స్థితిగతులను నివేదిక ద్వారా వెల్లడించింది నీతి ఆయోగ్. మొత్తం 23 అంశాల ఆధారంగా రాష్ట్రాల పనితీరు అంచనా వేసి ర్యాంకులను ప్రకటించింది. ఏపీ మహారాష్ట్రలు ఆరోగ్యపరంగా తీసుకున్న అన్ని సూచీల్లో వరుసగా రెండు మూడు స్థానాల్లో నిలిచాయి. ఆరోగ్య విషయంలో కేరళ తొలిస్థానంలో ఉండగా.. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం చివరిస్థానంలో నిలిచింది. ఇక తెలంగాణ 10వ స్థానంలో నిలిచింది. కాగా ఈ జాబితాలో […]

నీతి ఆయోగ్ ర్యాంకింగ్‌లో.. పదో స్థానంలో తెలంగాణ..?
Follow us

| Edited By: Srinu

Updated on: Jun 26, 2019 | 5:27 PM

ప్రజల ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని 2015 నుంచి 2018 వరకు ఆయా రాష్ట్రాల్లోని స్థితిగతులను నివేదిక ద్వారా వెల్లడించింది నీతి ఆయోగ్. మొత్తం 23 అంశాల ఆధారంగా రాష్ట్రాల పనితీరు అంచనా వేసి ర్యాంకులను ప్రకటించింది. ఏపీ మహారాష్ట్రలు ఆరోగ్యపరంగా తీసుకున్న అన్ని సూచీల్లో వరుసగా రెండు మూడు స్థానాల్లో నిలిచాయి. ఆరోగ్య విషయంలో కేరళ తొలిస్థానంలో ఉండగా.. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం చివరిస్థానంలో నిలిచింది. ఇక తెలంగాణ 10వ స్థానంలో నిలిచింది. కాగా ఈ జాబితాలో కేరళ 7.655, ఆంధ్రప్రదేశ్ 65.66, మహారాష్ట్ర 63.99, తెలంగాణ 59 పాయింట్లు సాధించాయి. ఈ రిపోర్టుకు హెల్తీ స్టేట్స్ ప్రోగ్రెసివ్ ఇండియా అని పేరు పెట్టారు.

ఇక ర్యాంకులు ఇచ్చేందుకు మూడు కేటగిరీలను పరిగణనలోకి తీసుకుంది నీతి ఆయోగ్. పెద్ద రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ప్రాతిపదికగా తీసుకుని ఒకే అంశం పై ఈ రాష్ట్రాలను పోల్చి చూసింది. ఆరోగ్య పరంగా పెద్ద రాష్ట్రాల్లో అత్యంత దారుణమైన పరిస్థితుల్లో బీహార్ ఒడిషా రాష్ట్రాలు ఉన్నట్లు నీతి ఆయోగ్ వెల్లడించింది. ఇక చిన్నరాష్ట్రాల విషయానికి వస్తే.. మిజోరాం, త్రిపురా, మణిపూర్ రాష్ట్రాలు టాప్ ప్లేస్‌ను సాధించగా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌లో ఆరోగ్యపరంగా పడిపోయాయని నీతి ఆయోగ్ రిపోర్టు వెల్లడించింది. ఇక కేంద్రపాలిత ప్రాంతాల్లో చండీఘడ్ తొలి స్థానం ఆక్రమించగా… దాద్రా నగర్ హవేలీ ఆరోగ్యపరంగా పుంజుకున్నట్లు రిపోర్ట్ స్పష్టం చేసింది.

ఆరోగ్యపరంగా ర్యాంకులు ఇవ్వడం వల్ల ఆ ప్రభుత్వాలు ఆరోగ్యం విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుందని నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఇక ఆరోగ్య పరంగా వెనుకబడిన బీహార్, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, ఒడిషా రాష్ట్రాలు పలు అంశాలను విస్మరించినందుకే ఈ స్థితిలో ఉన్నాయని నీతి ఆయోగ్ గుర్తు చేసింది. ఉదాహరణకు బీహార్‌లో శిశు మరణాలు, పుట్టిన బిడ్డ సరైన బరువుతో పుట్టకపోవడం, టీబీ, చికిత్స వైఫల్యాలు, సరైన సదుపాయాలు లేకపోవడం, నేషనల్ హెల్త్ మిషన్ నుంచి సరైన సమయంలో నిధులు బదిలీ కాకపోవడంతో ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఈ పరిస్థితి తలెత్తిందని నీతి ఆయోగ్ తన నివేదికలో స్పష్టం చేసింది.

ఏపీ విషయానికి వస్తే.. శిశుమరణాలు 2015 నాటికి ప్రతి 1000 జననాలకు 24 ఉండగా 2016 నాటికి ఇది 23కి తగ్గింది. తెలంగాణలో శిశు మరణాలు తగ్గుదల గణనీయంగా ఉంది. తెలంగాణలో శిశు మరణాలు 23 నుంచి 21కి తగ్గాయి. అయితే, తమిళనాడు, కేరళలో ఇది కేవలం 12 మాత్రమే ఉంది. ఐదేళ్లలోపు పిల్లల్లో మరణాల సంఖ్య ఏపీలో 39 నుంచి 37కి తగ్గగా, తెలంగాణలో 34వద్ద ఆగిపోయి పురోగతి కనిపించలేదు. నవజాత శిశుమరణాలు, ఐదేళ్లలోపు చిన్నారుల మరణాలు, కుటుంబ నియంత్రణ, తక్కువ బరువుతో శిశువుల జననం, స్త్రీ-పురుష నిష్పత్తి, క్షయ వ్యాధి చికిత్సలో పురోగతి, ప్రభుత్వ హాస్పిటల్స్‌లో నాణ్యతా ప్రమాణాలు, జాతీయ ఆరోగ్య మిషన్ పథకాల నిధుల వినియోగం, రోగ నిరోధక టీకాలు, శిశు జననాల నమోదు, ప్రభుత్వ హాస్పిటల్‌లో ప్రసవాలు తదితర అంశాలను ప్రాతిపదికగా తీసుకుని ర్యాంకులు కేటాయించారు.