‘ రైతు బంధు ‘.. కేసీఆర్.. లక్ష రుణ మాఫీ

KCR RythuBandhu, ‘ రైతు బంధు ‘.. కేసీఆర్.. లక్ష రుణ మాఫీ

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ రైతులకు బంపరాఫర్ ప్రకటించారు. వారికి ఈ ఏడాది అదనంగా మరో లక్ష రూపాయల రుణ మాఫీ చేస్తున్నట్టు ఆయన హామీ ఇచ్చారు. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. తమ ప్రభుత్వం చేబట్టిన రైతుబంధు పథకం ప్రపంచ దృష్టిని ఆకర్షించిందని, ఇది గొప్ప పథకమని ఐక్యరాజ్యసమితి కూడా ప్రశంసించిందని అన్నారు. రైతులకు ఈ ఏడాది కూడా రూ. లక్ష మాఫీ చేస్తున్నట్టు తెలిపిన ఆయన.. కేంద్రం వారికి అమలు చేస్తున్న పథకానికి ఈ పథకమే ప్రేరణ అని పేర్కొన్నారు. రైతు మరణిస్తే రైతు బీమా పథకం కింద అతని కుటుంబానికి రూ. 5 లక్షలు అందజేస్తున్నామని, దీనికి ప్రీమియాన్ని ప్రభుత్వమే భరిస్తోందని కేసీఆర్ చెప్పారు. (తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు పథకాన్ని కేంద్ర పథకంలో విలీనం చేయాల్సిందిగా కోరుతూ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు ఇటీవల హైదరాబాద్ ను సందర్శించి ఇక్కడి అధికారులను కోరినప్పటికీ ఇందుకు వారు అంగీకరించని సంగతి తెలిసిందే.) రైతు బంధు పథకానికీ, కేంద్ర పథకానికి చాలా తేడా ఉందని కేసీఆర్ వివరించారు. ఇక మిషన్ కాకతీయ అంతర్జాతీయ ప్రశంసలు పొందిందని, పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రస్తావించిన ఆయన.. ఇది చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ‘ రాజకీయ అవినీతికి దూరంగా ఉన్న బలమైన రాష్ట్రం మనది. 24 గంటలూ విద్యుత్ ఇచ్చిన ఘనత మాదే ‘ అని కేసీఆర్ చెప్పారు. విద్యా ప్రమాణాలు పెంచడంలోనూ, దళారీల ప్రమేయంలేని పింఛన్ల పంపిణీలోనూ మన రాష్ట్రం చెప్పుకోదగిన స్థాయిలో ఉందని ఆయన తెలిపారు. దీనివల్ల ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నదన్నారు. కంటివెలుగు వంటి ఇతర పథకాల గురించి కూడా కేసీఆర్ ప్రస్తావించారు. కంటివెలుగు పథకం ప్రజలకు వరంగా మారిందని, దీని స్ఫూర్తితో
ఈ ఎన్ టీ కేంద్రాలు పని చేస్తాయన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *