మళ్లీ తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ.. ఈ సారి ఎందుకంటే?

KCR and YS Jagan to meet again, మళ్లీ తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ.. ఈ సారి ఎందుకంటే?

ఏది ఏమైనా..తెలుగు రాష్ట్రాలు మంచి సమన్వయంతో ముందుకు వెళ్తున్నాయి. సీఎంలు..జగన్, కేసీఆర్‌లు గొడవలకు పడకుండా..సామరస్యపూర్వకంగా సమస్యలు సాల్వ్ చేసుకుంటున్నారు. ఇది నిజంగా ఆనందించదగ్గ పరిణామం. రాష్ట్రాల అభివృద్దికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. తాజాగా మన సీఎంలు సెప్టెంబరు 24న మరోసారి భేటీ కానున్నారు. కాకపోతే ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న విభజన అంశాలపై ఇదివరకే వీరు మూడు సార్లు భేటీ అయి చర్చించిన విషయం తెలిసిందే. గవర్నర్ సమక్షంలో విభజన అంశాలను పరిష్కరించుకోవాలని గతంలో జరిగిన భేటీలో నిర్ణయించారు.  నదుల అనుసంధానంపై ఇంజనీరింగ్ నిపుణుల కమిటీ అందజేసిన ప్రతిపాదనలపై తాజా భేటీలో వారు చర్చిస్తారని సమాచారం.  గత సమావేశాల్లో విభజన సమస్యలతో పాటూ ఇరిగేష్ ప్రాజెక్టులు, నీట పంపకాలపై చర్చించారు. ఇప్పుడు గోదావరి జలాలను శ్రీశైలానికి ఎలా తరలించాలనే అంశంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చిస్తారని  తెలుస్తోంది. గతంలో గోదావరి నీటిని శ్రీశైలం జలాశయానికి తరలించే వ్యూహం ఖరారు చేయాలని ఓ  కమిటీని ఏర్పాటు చేశారు. ఇరు రాష్ట్రాల అధికారులు, ఇంజినీర్లకు ఇందులో అవకాశం కల్పించారు.

ఎక్కడి నుంచి ఎలా నీరు తరలించాలన్న విషయంపై నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించారు. అయితే, తెలంగాణ భూభాగం నుంచి గోదావరి నీటిని తరలించాలని ఏపీ ఇంజనీర్లు, ఏపీలో మరో రిజర్వాయర్ నిర్మాణం చేస్తూ.. కాల్వలను వెడల్పు చేయడం ద్వారా నీటిని నాగార్జునసాగర్, అక్కడి నుంచి శ్రీశైలం తరలించవచ్చునని తెలంగాణ అధికారులు వేర్వేరు ప్రతిపాదనలు రూపొందించారు. ఒకరి ప్రతిపాదనలు ఒకరికి నచ్చకపోవడంతో ఈ అంశం అప్పటికి ఆగిపోయింది. దీనిపై ఇప్పుడు కేసీఆర్ పట్టుబడుతున్నట్టు సమాచారం. మొత్తం మీద  మరో వివాదానికి సంబంధించిన వ్యవహారంపై ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు 24న జరగనున్న సమావేశంలో ఏం నిర్ణయం తీసుకుంటారన్నదానిపై ఆసక్తి నెలకొంది.

అయితే ఉభయ రాష్ట్రాలకు వేర్వేరు గవర్నర్‌లు రావడంతో..మధ్యలో జరగాల్సిన భేటీ జరగలేదు. ప్రస్తుతం తొమ్మిది – పది షెడ్యూలు సంస్థల విభజన, జలాల వినియోగం వంటి అంశాలు పెండింగ్‌లో ఉన్నాయి. గతంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. ఆర్థికపరమైన అంశాలపైనా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

కాగా ఎన్నికల ముందు మోదీపై కయ్యానికి కాలు దువ్విన మమతా బెనర్జీ, మాయావతి, కేజ్రీవాల్ వంటి నాయకులు ఇప్పుడు చల్లబడిపోయారు. మమతా వెళ్లి మోదీని కలిసి ఆయనకు స్వీట్లు కుర్తా..ఇవ్వగా..మాయావతి, కేజ్రీవాల్‌లు మోదీ పలు నిర్ణయాలకు మద్దతుగా స్టేట్మెంట్లు ఇచ్చారు. దీంతో సీఎంలిద్దరూ కేంద్రంతో ఎలా వ్యవహరించాలనే విషయంలోనూ ఒక ఆలోచనకు రానున్నట్లు తెలుస్తోంది.  ఇద్దరు సీఎంలపై రెండు రాష్ట్రాల బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. కొన్ని అంశాల్లో కేంద్రం నుంచి సరైన సహకారం అందడం లేదన్న  అభిప్రాయం రాష్ట్ర  ప్రభుత్వాల్లో ఉంది. దీనిపై ఎలా ముందుకు వెళితే బాగుంటుందన్నది చర్చించనున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *