కేసీఆర్ మరో సంచలన నిర్ణయం..

తెలంగాణ సీఎం కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్పీఆర్ విషయంలో పలు సందేహాలు, అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం...

కేసీఆర్ మరో సంచలన నిర్ణయం..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 28, 2020 | 2:36 PM

తెలంగాణ సీఎం కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (ఎన్పీఆర్) ప్రక్రియను ప్రస్తుతానికి ఆపివేశారు. ఎన్పీఆర్ విషయంలో పలు సందేహాలు, అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

వాస్తవానికి, దేశంలో పదేళ్లకోసారి జనగణన చేపడతారు. 2011 తర్వాత అంటే.. 2020-2021 సంవత్సరంలో జనగణన జరగాల్సి ఉంది. ప్రతి ఐదేళ్లకోసారి ఎన్పీఆర్ సవరణ జరుగుతుంది. జనగణనకు సన్నాహాకంగా హౌస్ హోల్డ్ సర్వే నిర్వహిస్తారు. దాంతోపాటే ఎన్పీఆర్‌ వివరాలను సేకరించాల్సిందిగా కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. అయితే గతంలో ఉన్న ఎన్పీఆర్‌ ఫార్మాట్‌ను సవరించిన కేంద్రం.. మరికొన్ని ప్రశ్నలను జోడించింది. జాతీయ పౌర పట్టిక (ఎన్నార్సీ) తయారీకి ఎన్పీఆర్‌ ప్రాతిపదికగా భావిస్తున్న నేపథ్యంలో కొత్త ప్రశ్నల జోడింపు తీవ్ర వివాదాస్పదమైంది. అందుకే ఇప్పుడు ఎన్పీఆర్ ప్రక్రియను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది .

షెడ్యూలు ప్రకారం ఏప్రిల్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 30 వరకు ఏదో ఒక 45 రోజుల కాలపరిమితిలో రాష్ట్రాల వారిగా ఎన్పీఆర్‌, జనగణన ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉంటుంది. కేంద్రం ఆదేశాల మేరకు పలు రాష్ట్రాలు ఏప్రిల్‌ ఒకటి నుంచి ఈ ప్రక్రియను అమలుచేయనున్నాయి. అయితే, ప్రక్రియ పూర్తికి చాలా సమయం ఉన్నందున ప్రస్తుతానికి ఎన్పీఆర్‌ను వాయిదా వేసి, పరిస్థితులమేరకు తర్వాత ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే కలెక్టర్లకు శిక్షణ కార్యక్రమాన్ని కూడా వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

అటు.. పాత నమూనాతోనే ఎన్పీఆర్ ప్రక్రియను కొనసాగించాలని కేంద్రాన్ని తెలంగాణ సర్కారు కోరినట్లు సమాచారం. రాష్ట్రమంతటా పట్టణ ప్రగతి కార్యక్రమం జరుగుతున్నది. ఆ తర్వాత వెంటనే అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జరుగనున్నాయి. అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యాక ఈ ప్రక్రియ గురించి ఆలోచించి, అడుగు వేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. కాగా, పౌరసత్వ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని తెలంగాణ సర్కారు కేంద్రాన్ని గతంలోనే కోరిన విషయం తెలిసిందే.