కేసీఆర్ నోట అమరావతి మాట.. హాట్‌హాట్‌గా రచ్చ..!

Cm Kcr Speech At Amaravathi, కేసీఆర్ నోట అమరావతి మాట.. హాట్‌హాట్‌గా రచ్చ..!

తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీ రాజధాని అమరావతి గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారం రేపుతున్నాయి. ఏపీ రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయడం దండగా అని కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు అసలు చంద్రబాబుకు అమరావతి నిర్మాణం చేయొద్దని.. అది ఒక డెడ్ ఇన్వెస్టిమెంట్ అని అప్పుడే చెప్పాను కాని వినలేదు.. ఇప్పుడు ఏమైంది అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. అసలే మరోవైపు అమరావతిని వైసీపీ ప్రభుత్వం ఏపీ రాజధానిగా కొనసాగిస్తుందా..? లేదా..? అన్న అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ అమరావతి గురించి మాట్లాడటం రాజకీయంగా హాట్ టాపిక్ అయింది.

తాజాగా కేసీఆర్ మాట్లాడిన మాటలే ఆయన్ను ఇబ్బందుల్లో పడేసేలా ఉన్నాయి. గతంలో ఓ సందర్భంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను నెటిజెన్లు గుర్తుచేస్తున్నారు. ఏపీ రాజధాని అమరావతిని అభివృద్ధి చేసేందుకు కేసీఆర్ రూ. 100 కోట్లు ఇవ్వాలనుకుంటున్నారని కేటీఆర్ చెప్పారు. అయితే అమరావతి భూమిపూజ చేసిన రోజే తన నిర్ణయాన్ని ప్రకటించాలనుకున్నారని తెలిపారు. కాగా, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆయన వెనక్కు తగ్గారని కేటీఆరే స్వయంగా మీడియాతో చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలనే నెటిజెన్లు గుర్తుచేస్తున్నారు. అమరావతిని అభివృద్ది చేయడం దండగ అని చెప్పిన కేసీఆర్.. అసలు రూ.100 కోట్లు ఎలా ఇవ్వాలనుకున్నారని నెటిజెన్లు ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ ఇప్పుడు చెప్పింది అబద్దమా..? లేక కేటీఆర్ అప్పుడు చెప్పింది అబద్దమా..? అని విమర్శలు చేస్తున్నారు. ఎవరి మాటలు నమ్మాలి..? అసలు అమరావతి గురించి కేసీఆర్ మాట్లాడటమేంటి..? దీనిపై సీఎం జగన్ ఎందుకు స్పందించడం లేదని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు కురిపిస్తున్నారు.

ఇదిలా ఉంటే అసలు ఏపీ రాజధాని అమరావతి పై సీఎం జగన్ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. దీంతో కేసీఆర్ చెప్పిన మాటను అప్పట్లో చంద్రబాబు పాటించకపోయినా.. ఇప్పుడు జగన్ పాటిస్తున్నారేమో అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే గతంలో చంద్రబాబుకు చెప్పినట్లే.. జగన్‌కు కూడా కేసీఆర్ చెప్పారేమో అనే టాక్ వినిపిస్తోంది. అందుకే అమరావతి నిర్మాణంపై జగన్ సైలెంట్‌గా ఉన్నారని అనుకుంటున్నారు. ఇక రాజధాని అంశం పక్కకు పెట్టి రాయలసీమకు నీరు ఇచ్చే అంశంపై జగన్ ఎక్కువగా దృష్టి పెట్టారేమో అనే చర్చ కూడా నడుస్తోంది.

కేసీఆర్ వ్యాఖ్యలను బట్టి శ్రీశైలానికి గోదావరి జలాలను తరలిస్తే… రాయలసీమ మొత్తానికి నీరు ఇవ్వొచ్చనే ఆలోచన జగన్‌కు ఓకే అనిపించి ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అందుకే అమరావతి నిర్మాణానికి బదులుగా గోదావరి జలాలను శ్రీశైలం ద్వారా రాయలసీమకు తీసుకెళ్లే అంశంపై జగన్ సర్కార్ దృష్టి పెట్టినట్టు కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి కేసీఆర్ బాటలోనే జగన్ నడుస్తున్నారా అన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *