కజకిస్థాన్‌లో కరోనాను మించిన వైరస్‌.. ఆ దేశం ఏమందంటే

ప్రపంచమంతా కరోనాతో పోరాటం చేస్తోన్న వేళ చైనా మరో బాంబు పేల్చింది. తమ సరిహద్దు దేశం కజకిస్థాన్‌లో అంతుపట్టని వ్యాధితో వేలాది మంది మృతి చెందారని చైనా వెల్లడించింది.

కజకిస్థాన్‌లో కరోనాను మించిన వైరస్‌.. ఆ దేశం ఏమందంటే
Follow us

| Edited By:

Updated on: Jul 10, 2020 | 1:34 PM

ప్రపంచమంతా కరోనాతో పోరాటం చేస్తోన్న వేళ చైనా మరో బాంబు పేల్చింది. తమ సరిహద్దు దేశం కజకిస్థాన్‌లో అంతుపట్టని వ్యాధితో వేలాది మంది మృతి చెందారని చైనా వెల్లడించింది. గుర్తు తెలియని వైరస్ సోకి న్యూమోనియాతో గత ఆరు నెలలుగా 1772 మరణించారని డ్రాగన్ కంట్రీ తెలిపింది. గత నెలలోనే దాదాపు 600 మంది చనిపోయినట్లు వివరించింది. ఈ నేపథ్యంలో చైనీయులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. కోవిడ్‌ 19 కంటే ఈ గుర్తు తెలియని వైరస్ అత్యంత ప్రమాదకరమైనదని, అందుకే అప్రమత్తంగా ఉండాలని చైనీయులను అలర్ట్ చేసింది. ఈ మేరకు కజకిస్థాన్‌లోని చైనా రాయబార కార్యాలయం గురువారం ఓ ప్రకటన విడుదల చేసినట్లు చైనా స్థానిక మీడియా వెల్లడించింది. అయితే ఈ వార్తలను కజకిస్థాన్ కొట్టివేసింది.

దీనిపై కజకిస్థాన్‌ ఆరోగ్యమంత్రి మాట్లాడుతూ చైనా ఆరోపణలను ఖండించారు. ఆ వ్యాధి బ్యాక్టీరియా, ఫంగల్‌, వైరల్‌ న్యూమోనియా ఇన్‌ఫెక్షన్‌ లక్షణాలతో పోలి ఉందని అన్నారు. వీటికి సంబంధించి స్పష్టమైన కారణాలు ఇంకా తెలియడం లేదని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలను తాము అనుసరిస్తున్నట్లు వివరించారు. చైనా మీడియాలో ప్రచురించినట్లుగా కజకిస్థాన్‌లో కొత్త రకపు న్యూమోనియా లేదని మంత్రి స్పష్టం చేశారు. కాగా కరోనా నేపథ్యంలో కజకిస్థాన్‌లో విధించిన లాక్‌డౌన్‌కు మే నెలలో భారీ సడలింపులు ఇచ్చారు. అయితే ఆ తరువాత అక్కడ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. దీంతో ఈ వారంలో అక్కడ రెండోసారి లాక్‌డౌన్ విధించింది కజకిస్థాన్‌. ఇదిలా ఉంటే కరోనా వైరస్ కారణంగానే న్యూమోనియా వస్తుందా..! లేదా కొత్త వైరస్‌ అక్కడ పుట్టుకొచ్చిందా..! అన్న దానిపై అక్కడి శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నట్లు సమాచారం.