ఫాస్ట్ ట్రాక్ లో..కతువా కేసు విచారణ !

KATHUA CONVICTS SET NEW STANDARD FOR COURTS, ఫాస్ట్ ట్రాక్ లో..కతువా కేసు విచారణ !

దేశంలో సంచలనం రేకెత్తించిన కతువా కేసు విచారణ అతి త్వరగా జరగడం బహుశా న్యాయ చరిత్రలో మొదటిసారని నిపుణులు అంటున్నారు. ఈ కేసు చుట్టూ రాజకీయ రంగు పులుముకున్నప్పటికీ, 275 రోజుల్లోనే కోర్టు తీర్పు రావడం, దోషులకు శిక్ష పడడం జరిగిందన్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. పఠాన్ కోట్ కోర్టులో ఈ కేసు విచారణ సందర్భంగా ప్రాసిక్యూషన్, డిఫెన్స్ లాయర్లు 128 మంది సాక్షులను విచారించారు. సుప్రీంకోర్టు జోక్యంతో విచారణను జమ్మూ కాశ్మీర్ బయట మరో కోర్టుకు బదిలీ చేశారు. ఈ కేసులో హియరింగ్ కు పాటించిన ప్రమాణాన్నిఇతర కోర్టులు కూడా పాటించాలని నిపుణులు, అభిప్రాయపడ్డారు. వివిధ కోర్టుల్లో రేప్ కేసులు ఏళ్ళ తరబడి పెండింగులో ఉన్నాయి. దాదాపు లక్షకు పైగా అత్యాచార కేసులు పెండింగులో ఉన్నట్టు అంచనా. వీటి శాతం పెరుగుతూనే ఉందని వారు అంటున్నారు. పైగా నిందితులు బెయిలు పొంది దర్జాగా బయట తిరుగుతున్నారని, వారికి శిక్షల విషయంలోనూ జాప్యం జరుగుతోందని వీరు పేర్కొంటున్నారు. ఇదే విషయమై సెంటర్ ఫర్ సోషల్ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ రంజన్ కుమార్ మాట్లాడుతూ.. ఈ కేసుల విచారణ మందగతిన జరగడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. వివిధ స్థాయిల్లోని అన్ని కోర్టులు కతువా కేసు విచారణ మాదిరే త్వరగా నిర్వహించాలని ఆయన కోరారు.

కతువా కేసులో స్పెషల్ కోర్టునేదీ ఏర్పాటు చేయలేదని, పోలీసులు సమర్పించిన సాక్ష్యాధారాలనన్నీ నిర్దేశిత కాలంలో న్యాయవాదులు క్రాస్ ఎగ్జామిన్ చేయడమే ఈ కేసు విచారణ త్వరగా జరగడానికి కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. చాలావరకు సాధారణ కోర్టులు రేప్ కేసులను పెద్దగా పట్టించుకోవు.. రాజకీయ వత్తిడులు వచ్చి నప్పుడో, పెద్ద ఎత్తున ప్రజాగ్రహం పెల్లుబికినప్పుడో మాత్రమే న్యాయస్థానాలు త్వరగా స్పందిస్తాయి. అని కుమార్ వ్యాఖ్యానించారు. పైగా దోషులకు విధించే శిక్షలపై చర్చ జరగాలన్నారు. అత్యాచార కేసులను విచారించే ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో న్యాయమూర్తులు సిఆర్పీసి లోని 157, 309, 327 సెక్షన్ల కింద ఆయా నిబంధనలను ఉపయోగించుకోవాలని, రోజువారీగా సాక్షులను విచారించాలని న్యాయనిపుణులు చెబుతున్నారు. కేసు విచారణ వాయిదాల మీద వాయిదాలు పడడం వల్ల బాధితులకు న్యాయం జరగడంలో జాప్యం జరుగుతుందన్నారు. విచారణ సందర్భంగా బాధితులకు లీగల్ ఎయిడ్ లభించకపోవడం వల్ల కూడా డిలే జరుగుతోందని సుప్రీంకోర్టుకు చెందిన చిరు సిన్హా అనే లాయర్ అభిప్రాయపడ్డారు. జడ్జీలకు అన్ని విషయాలు తెలిసినప్పటికీ.. వివిధ కారణాలు ఈ జాప్యానికి దారి తీస్తున్నట్టు ఆమె పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *