‘ వరద ‘ నదిలో దూకేశాడు.. రెండు రోజుల తరువాత.. సజీవంగా…

karnataka 60 year old jumps into swollen river emerges 2 days later

భారీ వర్షాలు, వరదలతో సతమతమవుతున్న కర్ణాటకలో ఇదో విచిత్రం ! కపిల వంటి నదులు నీటితో పోటెత్తుతుండగా.. కాబిని రిజర్వాయర్ నుంచి అధికారులు ఫ్లడ్ గేట్లు తెరవడంతో.. జల ప్రవాహాలు ఉవ్వెత్తున పలు ప్రాంతాలను ముంచేశాయి. వీటిలో బెంగుళూరుకు సుమారు 169 కి.మీ. దూరంలోని నంజన్ గూడ్ టౌన్ కూడా ఉంది. ఇక్కడి నుంచి ప్రజలంతా సురక్షిత శిబిరాలకు తరలిపోగా.. ఈ ప్రాంతానికి చెందిన 60 ఏళ్ళ వెంకటేష్ మూర్తి మాత్రం ఒక్కడే అక్కడే ఉన్నాడు. అంతేకాదు ! ఉప్పొంగి ప్రవహిస్తున్న కపిల నదిని ఛాలెంజ్ చేస్తున్నట్టు ఆ నదిలోకి దూకేశాడు. ఈ నెల 10 న అంతా చూస్తుండగా అతని సాహసం తాలూకు వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అంతే ! ఈ ‘ పిచ్చొడు ‘ ఈ వరద నీటిలో దూకి ‘ ఆత్మహత్య ‘ చేసుకున్నాడనే అంతా అనుకున్నారు. వరద ‘ మృతుల్లో ‘ ఇతని పేరు కూడా చేరిపోయింది.

అతని కుటుంబం ఎంత గాలించినా అతని జాడ కనబడలేదు కూడా. వారి ఆశలు ఆవిరయ్యాయి. అయితే ఆశ్చర్యంగా రెండు రోజుల తరువాత.. ఈ నెల 12 న సజీవంగా మూర్తి బయటికొచ్చేశాడు. నేరుగా పోలీసు స్టేషనుకు వెళ్లి తాను సజీవంగా ఉన్నట్టు ప్రకటించుకున్నాడు. ఇతని వైనం అందరికీ ఆశ్చర్యం కలిగించినా ఇతని సోదరి మంజులకు మాత్రం ఆశ్చర్యం కలిగించలేదు. ఇలా తన సోదరుడు గత పాతికేళ్లుగా ఈ నదిలో దూకుతుంటాడని, అయితే అరగంటలోనే ఆ నది నుంచి తిరిగి వచ్ఛేస్తాడని .. ఈ సారి మాత్రం ఇంత ‘ లేటు ‘ ఎందుకయిందో తెలియడంలేదని ఆమె చెప్పింది.

కాగా- నదిలో ఓ పిల్లర్ ను పట్టుకుని తాను కొన్ని గంటలపాటు గడిపానని, వరద ప్రవాహం తగ్గాక తిరిగి ఈదుకుంటూ వచ్చానని మూర్తి చెబుతున్నాడు. గతంలో తన వయస్సును కూడా పట్టించుకోకుండా మూర్తి తన డొక్కు సైకిల్ తొక్కుంటూ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 10 వేల కిలోమీటర్లు ప్రయాణించి రికార్డు నెలకొల్పాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *