మాజీ సైనికుని కేసులో కొత్త ట్విస్ట్

ఒకప్పుడు కార్గిల్ వార్ లో వీరోచితంగా పోరాడిన భారత మాజీ సైనికుడు మహమ్మద్ సనావుల్లా కేసు సుఖాంతమైంది. ఇండియన్ ఆర్మీలో దాదాపు 30 ఏళ్ళ పాటు సుబేదారుగా పని చేసిన అస్సాం వాసి 57 ఏళ్ళ సనావుల్లా విదేశీయుడన్న ముద్ర తొలగిపోయింది. ఫారినర్ అన్న కారణంతో అస్సాం పోలీసులు ఆయనను అరెస్టు చేసి సైనిక డిటెన్షన్ సెంటర్ కు తరలించిన సంగతి తెలిసిందే. (1946 నాటి ఫారినర్ చట్టం కింద ఆయనను అదుపులోకి తీసుకుని నిర్బంధ శిబిరానికి పంపారు.) విదేశీయులనో, అక్రమ వలసదారులనో ఇలా నిర్బంధ శిబిరాలకు పంపుతుంటారు. తాను భారతీయుడినేనని సనావుల్లా నిరూపించుకోలేకపోయాడట. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈయన సమర్పించిన డాక్యుమెంట్లను వెరిఫై చేసి.. ఇతని స్టేట్ మెంటును రికార్డు చేసిన రిటైర్డ్ ఎస్ఐ చంద్రమాల్ దాస్ తన ఇన్వెస్టిగేటివ్ రిపోర్టును తప్పుడు ఫోర్జరీలతో పంపాడని వెల్లడైంది. దాస్ మీద మూడు వేర్వేరు ఎఫ్ ఐ ఆర్ లను పోలీసులు నమోదు చేశారు. సనావుల్లా తన స్టేట్ మెంట్ లో సాక్షులుగా పేర్కొన్న ముగ్గురు వ్యక్తులు దాస్ పై ఖాకీలకు ఫిర్యాదు చేశారు. ఆయన తమ సంతకాలను ఫోర్జరీ చేశాడని, కావాలనే సనావుల్లాను ఇబ్బంది పెట్టాడని వారు ఆరోపించారు. సనావుల్లా బంగ్లాదేశ్ వాసి కాదు.. ఈ దేశంలో పుట్టిన భారతీయుడు అని వారు స్పష్టం చేశారు. అస్సాం బార్డర్ పోలీసులు ఆయనను ఎంతో వేధించారని కూడా వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. తాజా పరిణామాలతో సనావుల్లా డిటెన్షన్ సెంటర్ నుంచి విడుదల కానున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *