బాలీవుడ్‌కు టాలీవుడ్ సినిమాలే దిక్కా.?

నేచురల్ స్టార్ నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జెర్సీ’. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్లా మంచి విజయాన్ని నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. నాని కెరీర్‌లోనే బెస్ట్ మూవీగా నిలిచిన ఈ సినిమాకి ప్రేక్షకులు మాత్రమే కాదు సినీ ప్రముఖలు కూడా ప్రశంసలు కురిపించారు. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా హిందీ రీమేక్ హక్కులను ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్, నిర్మాత కరణ్ జోహార్ సొంతం చేసుకున్నారు. ఇక ఈ […]

బాలీవుడ్‌కు టాలీవుడ్ సినిమాలే దిక్కా.?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 26, 2019 | 12:59 PM

నేచురల్ స్టార్ నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జెర్సీ’. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్లా మంచి విజయాన్ని నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. నాని కెరీర్‌లోనే బెస్ట్ మూవీగా నిలిచిన ఈ సినిమాకి ప్రేక్షకులు మాత్రమే కాదు సినీ ప్రముఖలు కూడా ప్రశంసలు కురిపించారు.

కాగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా హిందీ రీమేక్ హక్కులను ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్, నిర్మాత కరణ్ జోహార్ సొంతం చేసుకున్నారు. ఇక ఈ రీమేక్‌కు గౌతమ్ తిన్ననూరి స్వయంగా దర్శకత్వం వహించనున్నారని సమాచారం. అలాగే హిందీ వెర్షన్‌లోని నాని పాత్రను షాహిద్ కపూర్ పోషించబోతున్నారని టాక్. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

మరోవైపు బాలీవుడ్ చిత్రసీమ కొద్దికాలంగా ప్లాప్స్‌తో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. అందులోనూ ముఖ్యంగా నిర్మాత కరణ్ జోహార్ ఇటీవల ‘కళంక్’, ‘స్టూడెంట్ అఫ్ ది ఇయర్ 2’ సినిమాలతో భారీ డిజాస్టర్స్ చవి చూశాడు. బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ హిట్స్ కొడతాయని భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమాలు అటు ప్రేక్షకులను.. ఇటు క్రిటిక్స్‌ను నిరాశపరిచాయని చెప్పాలి. ఖాన్ల త్రయం మాదిరిగానే హిట్ సాధించాలనే ప్రయత్నంలో టాలీవుడ్ సినిమాపై కరణ్ జోహార్ నమ్మకం పెట్టుకుని హక్కులను సొంతం చేసుకున్నాడని బీ-టౌన్ టాక్. ఇక షాహిద్ కపూర్ కూడా సోలో హీరోగా హిట్ దక్కించుకుని చాలాకాలం అయింది. రీసెంట్‌గా ఆయన ‘పద్మావత్’ సినిమాలో కనిపించినా.. క్రెడిట్ మొత్తం రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకునేలకు దక్కింది. బహుశా అందుకే టాలీవుడ్‌లో హిట్ అయిన ‘అర్జున్ రెడ్డి’ని ‘కబీర్ సింగ్’గా రీమేక్ చేసి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించాడు. దీన్ని బట్టి చూస్తే బాలీవుడ్ హీరోలు తమ ప్లాప్స్ నుంచి బయటపడడానికి టాలీవుడ్ సినిమాలనే నమ్ముకున్నారని చెప్పవచ్చు. అటు ముగ్గురు ఖాన్‌లు కూడా ప్లాప్స్ తర్వాత హిట్ దక్కించుకోవడం కోసం టాలీవుడ్ సినిమానే రీమేక్ చేశారు. అందులో ముఖ్యంగా సల్మాన్ ఖాన్ తన మూవీ ప్లాప్ అయినప్పుడల్లా దాని నుంచి బయటపడడానికి ఏదో ఒక తెలుగు సినిమా రీమేక్ పై ఫోకస్ పెడుతూ భారీ హిట్లు దక్కించుకుంటున్నాడు.

కాగా తెలుగులో మరికొన్ని సినిమాలు త్వరలోనే హిందీలో రీమేక్ కానున్నాయి. వాటిల్లో ‘ఆర్ఎక్స్ 100’, ‘శ్రీమంతుడు’, ‘మహర్షి’ తదితర చిత్రాలు ఉన్నాయి.