మెగాస్టార్‌తో మరోసారి..?

తన ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి షూటింగ్‌ను పూర్తి చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం కొరటాల మూవీ కోసం సిద్ధమవుతున్నారు. ఈ చిత్రంలో మెగాస్టార్ కొత్త లుక్‌లో కనిపించనుండగా.. అందుకోసం ఆయన కసరత్తులు చేస్తున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా ఇది వరకు నయనతార, అనుష్క, శ్రుతీ హాసన్ ఇలా పలువురి పేర్లు వినిపించగా.. తాజాగా చందమామ కాజల్ పేరు ఈ లిస్ట్‌లో చేరింది. చిరంజీవి రీఎంట్రీ ఇచ్చిన ఖైదీ నంబర్.150లో కాజల్ అతడితో జోడీ కట్టింది. ఆ మూవీలో వాళ్లిద్దరి పెయిర్‌కు మంచి మార్కులే పడ్డాయి. దీంతో మరోసారి కాజల్‌నే తీసుకోవాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

కాగా 2017లో వరుస విజయాలను అందుకున్న కాజల్.. ఇటీవల వరుస ఫ్లాప్స్‌తో కాస్త గాడి తప్పింది. ఈ ఏడాది వచ్చిన సీత ఆమెను నిరాసపరించింది. మరోవైపు ఆమె నటించిన కోమలి, పారిస్ పారిస్, రణరంగం చిత్రాలు త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వీటిపై ఆమె చాలా ఆశలే పెట్టుకుంది. ఇలాంటి సమయంలో ఆమెకు చిరు సరసన మరోసారి ఛాన్స్ రావడం నిజంగా బంపర్ ఆఫరే. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

ఇదిలా ఉంటే కొరటాల, చిరంజీవి మూవీని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్, రామ్ చరణ్ కలిసి నిర్మించనున్నారు. సామాజిక సమస్యల నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *